చెన్నూర్ టౌన్ : ఆర్థిక ప్రగతిపై ప్రశ్నావళిని సేకరించి, నమోదు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి, మండల ప్రత్యేకాధికారి వెంకటేశ్వర రావు ఆదేశించారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం శుక్రవారం చెన్నూరు మండల కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ (PAI) పై మండల స్థాయి అవగాహన సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి, టీవోటీలు మాట్లాడారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను సాధించిన ప్రగతిపై ఉన్న ప్రశ్నావళి (questionire) ని రెవెన్యూ శాఖ, పంచాయతీ రాజ్ శాఖ, రూరల్ డెవలప్మెంట్ శాఖ, వ్యవసాయ శాఖ, విద్యా శాఖ, ఐసీడీఎస్, ఆరోగ్య శాఖ, ఆర్ డబ్ల్యుఎస్, మిషన్ భగీరథ, ఎలక్ట్రిసిటీ, పోలీస్ శాఖ, హౌసింగ్ శాఖల వారి సహకారంతో పంచాయతీ కార్యదర్శులు రెండు రోజుల్లో సేకరించాలన్నారు.
సంబందిత పోర్టల్ లో నమోదు చేయాలని, ఆయా శాఖల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని మండల ప్రత్యేకాధికారి సూచించారు. గ్రామంలో ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా వారానికి రెండు సార్లు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని, రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలని పంచాయతీ కార్యదర్శులు, ఆరోగ్య శాఖ సిబ్బందికి చెందిన ఏఎన్ఎంలు, ఆశ అంగన్వాడీ సిబ్బందికి జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి ఎండీ అజ్మత్ అలీ, చెన్నూరు మండలంలోని మండల స్థాయి అధికారులు, అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యారు.