Chennur | ‘ఇక మేము ఈ ఆర్థిక భారాన్ని మోయలేం.. రూ. లక్షల్లో అప్పులు తెచ్చి పంచాయతీలను నడిపిస్తున్నం. తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టలేక మనోవేదనకు గురవుతున్నం. పారిశుద్ధ్య ట్రాక్టర్ల డీజిల్‌తోపాటు ఇతర ఖర్చులకు ఎవరూ అప్పులు ఇవ్వడం లేదు’ అంటూ పంచాయతీ కార్యదర్శులు చేతులెత్తేశారు. ఇప్పటికే సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, భద్రాద్రి జిల్లాల్లోని పలువురు పంచాయతీ కార్యదర్శులు ట్రాక్టర్ల తాళం చెవులను అధికారులకు అప్పగించగా.. తాజాగా మంచిర్యాల జిల్లా చెన్నూరు పంచాయతీ కార్యదర్శులు కూడా ట్రాక్టర్ తాళాలను ఎంపీడీవోకు అందజేశారు.
తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల జేఏసీ పిలుపుమేరకు.. చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి చెన్న మధుకర్ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు కలిసి ట్రాక్టర్ల తాళాలను ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీవో అజ్మత్కు అందజేశారు. గ్రామాల్లో ఆర్థికపరమైన పనులను నిలిపివేస్తున్నామని ఒక మెమొరాండం అందజేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
పంచాయతీ కార్యదర్శుల డిమాండ్లు..
1) గ్రామ పంచాయతీలకు సంబంధించిన పెండింగ్ చెక్కులను వెంటనే క్లియర్ చేయాలి.
2) గ్రామపంచాయతీ నిర్వహణలో భాగంగా ట్రాక్టర్ డీజిల్ ఖర్చులకు, తాగునీటి నిర్వహణ, వీధి దీపాల నిర్వహణ ఇతర ఖర్చుల నిధులను విడుదల చేయాలి
3) రాష్ట్రంలో పనిచేస్తున్న OPS పంచాయతీ కార్యదర్శులను JPS గా కన్వర్ట్ చేయాలి. OPS ను పూర్తిగా రద్దు చేయాలి.
4) జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నాలుగు సంవత్సరాల విధి నిర్వహణ కాలాన్ని సర్వీస్‌గా పరిగణించాలి.
5) గ్రామ పంచాయతీ సాధారణ నిధులను (జనరల్ ఫండ్) ట్రెజరీ అనుసంధానం నుంచి తొలగించాలి.