చెన్నూర్, మే 27 : రైతులకు న్యాయం చేయాలని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందని బీఆర్ఎస్ పార్టీ చెన్నూరు పట్టణ సోషల్ మీడియా ఇన్చార్జి, మాజీ కౌన్సిలర్ రేవల్లి మహేష్ అన్నారు. చెన్నూరులో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 420 హామీలు ఆరు గ్యారంటీలు అమలు చేయాలని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించినందుకు చెన్నూర్ పట్టణంలోని ఎనిమిది మంది బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టిందని ఆరోపించారు.
ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులు గాలిపల్లి రవి, కమటం మనోహర్, ఎండీ నాయబ్, శంషీర్ ఖాన్, రేవెల్లి రాజు, బోగే భారతి, సుద్దాల ప్రశాంత్, రేవెల్లి మహేష్ లపై కేసులు పెట్టారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టిన ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.