తాండూర్, జూలై 28: గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కేసీఆర్ ప్రభుత్వం గ్రామానికో క్రీడా ప్రాంగణం (Kreeda Pranganam) ఏర్పాటు చేయగా.. ప్రస్తుత సర్కారు నిర్లక్ష్యంతో అధ్వానంగా తయారయ్యాయి. నిర్వహణను గాలికొదిలేయడంతో పిచ్చిమొక్కలతో చిత్తడిగా దర్శనమిస్తున్నాయి. కొన్నిచోట్ల పశువులు సంచరిస్తుండగా, మరికొన్ని చోట్ల మందుబాబులకు అడ్డాగా మారాయి. ప్రస్తుతం నిరుపయోగంగా కనిపిస్తుండగా, ప్రభుత్వం నుంచి వచ్చిన కేసీఆర్ స్పోర్ట్స్ కిట్లు గ్రామ పంచాయతీలకే పరిమితమయ్యాయి.
తాండూర్ మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లో పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గత బీఆర్ఎస్ సర్కార్ ఊరికో క్రీడా ప్రాంగణం చొప్పున 15 తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. అందుకు ఒక్కో జీపీలో 20 గుంటల చొప్పున భూమి కూడా కేటాయించింది. దాదాపుగా రూ.2.50 లక్షలు ఖర్చు చేసింది. చాలా గ్రామాల్లో స్థలాల కొరత ఉండడంతో పాఠశాల ప్రాంగణాలు, ఖాళీగా ఉన్న కొద్దిపాటి స్థలాలు, వైకుంఠధామాలు, గ్రామ పంచాయతీల పక్కన తెలంగాణ క్రీడా ప్రాంగణం పేరిట బోర్డు, వాలీబాల్ కోర్టు, వ్యాయామం చేసేందుకు పరికరాలను ఏర్పాటు చేసింది. దీంతో పాటు కేసీఆర్ స్పోర్ట్స్ కిట్లనూ అంద జేసింది. అందులో టీ షర్టులు, క్రికెట్, వాలీ బాల్ కిట్లు, మేజరింగ్ టేబుల్, డంబుల్స్, డిస్కస్ త్రో, టెన్నికాయిట్ రింగులు, స్కిప్పింగ్ రోప్‌లు, విజిల్స్ తదితర వస్తువులున్నాయి.
ప్రస్తుతం క్రీడా ప్రాంగణాలను కాంగ్రెస్ సర్కారు గాలికొదిలేసింది. దీంతో పిచ్చిమొక్కలు పెరిగి అధ్వానంగా మారాయి. మరోవైపు నిధుల కొరతతో పంచాయతీలు వాటి నిర్వహణను పట్టించుకోవడంలేదు. దీంతో చాలా చోట్ల స్పోర్ట్స్ కిట్లను పంచా యతీ గదుల్లో మూలన పడేశారు. ఇప్పటి కైనా పాలకులు, అధికారులు గ్రామీణ క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తీసుకురా వాలని క్రీడాకారులు కోరుతున్నారు.
ప్రభుత్వం నిర్లక్ష్యం తగదు..
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేం దుకు కేసీఆర్ ప్రభుత్వం అన్ని గ్రామాల్లోనూ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసిందని బీఆర్ఎస్వీ నాయకుడు బోడ సతీశ్ అన్నారు. అందుకు అవసరమైన ఆట వస్తువులతో కూడిన కేసీఆర్ స్పోర్ట్స్ కిట్టునూ అందజేసింది. కానీ, కాంగ్రెస్ అధికా రంలోకి వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం సరికాదు. క్రీడాకారులను విస్మరిస్తుండడంతో పాటు స్పోర్ట్స్ కిట్లన్నీ పంచాయతీలకే పరిమితమవుతున్నాయి. చాలా గ్రామాల్లో పిచ్చిమొక్కలతో క్రీడా ప్రాంగణాలన్నీ ఆధ్వానంగా మారాయి. అధికారులు, ప్రభుత్వం స్పందించి
క్రీడాప్రాంగణాలను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.