కాసిపేట, డిసెంబర్ 4 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కాలేజ్ సైన్స్ ఉపాధ్యాయుడు జాడి ప్రవీణ్ ప్రతిష్టాత్మకమైన ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (IISF) 2025లో పాల్గొనేందుకు ఎంపికయ్యారు. డిసెంబర్ 6 నుండి 9 వరకు హర్యానాలోని పంచకులాలో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ జరగనుంది. ఐఐఎస్ఎఫ్ అనేది దేశ వ్యాప్తంగా శాస్త్ర వేత్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పరిశోధకుల యొక్క వినూత్న ఆలోచనలు, సాంకేతిక అభివృద్ధి, పరిశోధనలను ప్రదర్శించే అతిపెద్ద వేదికల్లో ఒకటి.
అత్యాధునిక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఉపాధ్యాయుడు జాడి ప్రవీణ్ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని (Scientific Temperament) పెంపొందించడంలో, అలాగే వివిధ వినూత్న, పర్యావరణ అనుకూల (Eco-Friendly) ప్రాజెక్టులలో విద్యార్థులకు మార్గ నిర్దేశం చేయడంలో పేరుగాంచారు. గ్రామీణ విద్యార్థులను సైన్స్, పరిశోధన ఆవిష్కరణల వైపు ప్రోత్సహిస్తున్నారు. ఈ మేరకు ఉపాధ్యాయులు ప్రవీణ్ ఎంపిక కాగా తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఆయన భాగస్వామ్యం గ్రామీణ విద్యార్థులను జాతీయ స్థాయి సైన్స్ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ప్రేరేపిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.