నెన్నెల: మంచిర్యాల జిల్లా నెన్నెల (Nennela) మండలంలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తున్నది. శనివారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పంట పొలాలు వరద నీటిలో మునిగి పోయాయి. చెరువులు కుంటలు మాత్తడి పోస్తున్నాయి. నెన్నెల కుమ్మరి వాగు చెరువు నిండుకుండాలా మారింది. జోగాపూర్ మత్తడి వాగు వరద నిటితో నిండు కుండను తలపిస్తున్నది. లంబాడితండా ఎర్రవాగు, జంగళపేట వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పత్తి చెన్లు, వరి పొలాలు వరదలో మునిగి పోయాయి.
కోణంపేట, నెన్నెలలో లోతట్టులో ఉన్న ఇండ్లలో నీళ్లు చేరాయి. పాత ఇండ్లు, పూరి గుడిసేల్లో ఎవరూ ఉండవద్దని గ్రామాలలో డప్పు చాటింపు వేశారు. మండల వ్యాప్తంగా 77 మిల్లి మీటర్ల వర్షం పాతం నమోదయ్యింది. మరో 24 గంటల పాటు భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో పంటలు కొట్టుకు పోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలిస్తున్నారు.