కాసిపేట, అక్టోబర్ 16 : మంచిర్యాల జిల్లా సోమగూడెం, బెల్లంపల్లి రహదారి ప్రాంతం మొత్తం జన సంద్రమైంది. ప్రముఖ కల్వరీ చర్చి పాస్టర్ ప్రవీణ్ 50 రోజుల ఉప వాస దీక్షల ముగింపు సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి ఏడాది పాస్టర్ ప్రవీణ్ 50 రోజులు ఉపవాస దీక్షలు చేపడుతారు. జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో క్రైస్తవులు తరలిరానుండగా సుమారు 100 ఎకరాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 2 లక్షల మంది హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేసి, అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.
ఒక రోజు ముందుగానే దేశ నలమూలల నుంచి భారీగా క్రైస్తవులు సభ వద్దకు చేరుకుంటుండగా, బెల్లంపల్లి, సోమగూడెం ప్రాంతాలు జనసంద్రమయ్యాయి. చర్చి సమీపం నుంచి సభ వరకు రహదారి పక్కన భారీగా హోటళ్లు, తినుబండరాలు, బొమ్మలు వివిధ రకాల తాత్కాలిక షాపులను ఏర్పాటు చేశారు. దీంతో పాటు రాష్ట్ర, జిల్లా ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు హాజరుకానున్నారు. పోలీస్ ఉన్నతాధికారులు భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించి, పలు సూచనలు చేయగా, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.