తాండూర్, నవంబర్ 10 : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) రాష్ట్రస్థాయి సీనియర్ వాలీబాల్ పోటీలకు మంచిర్యాల జిల్లా అచ్చలాపూర్ జెడ్పిహెచ్ఎస్ విద్యార్థిని ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు ఏ సాంబమూర్తి తెలిపారు. ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ వాలీబాల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సోమగూడెం సింగరేణి గ్రౌండ్స్‌లో సీనియర్ మహిళల వాలీబాల్ ఎంపిక పోటీలలో అచ్చలాపూర్ విద్యార్థిని ఎం అమూల్య (9వ తరగతి) అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అయినట్లు పేర్కొన్నారు.
ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు మేడ్చల్‌లోని వేముల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొననున్నట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థినిని పాఠశాల హెచ్ఎం పీ ఉమాదేవి, ఏఏపీసీ చైర్మన్ చిలుకమ్మ, ఉపాధ్యాయ బృందం, గ్రామ పెద్దలు, విద్యార్థులు అభినందించారు.