తాండూర్, ఆగస్టు 19 : పోలీస్ ఉద్యోగ నియామకాల్లో ఆదివాసీలకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ, రాజ్యాంగబద్ధ హక్కుల సాధన కోసం ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ సంఘాలు, తుడుందెబ్బ నాయకులు ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా బుధవారం మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలో చేపట్టిన బంద్ విజేయవంతమయ్యింది. ఈ బంద్ కారణంగా మండలంలో సాధారణ జనజీవనం, వర్తక వాణిజ్య వ్యాపార సంస్థలు, విద్యాసంస్థల నిర్వహణ ప్రభావితమైంది. ఈ సందర్భంగా ఆదివాసి సంఘాల, తుడుందెబ్బ నాయకులు బంద్ ను పర్యవేక్షించారు. అనంతరం ఆదివాసీ హక్కుల పోరాట సమితి తాండూరు మండల అధ్యక్షుడు యపాల సమ్మయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గడ్డం మణికుమార్, జిల్లా కార్యనిర్వహక అధ్యక్షుడు కుర్సెంగ బాపురావు మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగ నియామకాల్లో స్థానిక ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు.
అయితే ప్రస్తుతం విడుదలైన నోటిఫికేషన్లో ఏజెన్సీ ప్రాంత అభ్యర్థులకు ప్రాధాన్యత లేకుండా ఉందని, సాధారణ విధానంలో నియామకాలు చేపట్టడం వల్ల ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వేలాది మంది ఆదివాసీ యువత ఉద్యోగ అవకాశాలను కోల్పోయే ప్రమాదం కూడా ఉందని వాపోయారు. ఏజెన్సీ ప్రాంతంలో విద్యా, ఆర్థిక, ఉపాధి పరంగా ఇప్పటికే అనేక సమస్యలు ఎదుర్కొంటున్న ఆదివాసీ యువతకు ఉన్న ప్రత్యేక అవకాశాలను కూడా తొలగించడం సరైన నిర్ణయం కాదని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంత యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్షణమే స్పందించి, పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో గతంలో అమలులో ఉన్న 1/70 చట్టం పూర్తిస్థాయిలో అమలు చేయాలని, గిరిజనుల రక్షణకు సంబంధించిన జీవో నెం. 3 పునరుద్ధరణ చేయాలని, 75 శాతం ప్రత్యేక రిజర్వేషన్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం తుడుందెబ్బ ఆధ్వర్యంలో చేపట్టిన బందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అరికిల శంకర్, మండల గౌరవ అధ్యక్షుడు అల్లకొండ భీమయ్య, మండల ప్రధాన కార్యదర్శి బుర్స ప్రవీణ్, విద్యార్థి సంఘం మండల అధ్యక్షుడు పసుల ధర్మయ్య, మండల నాయకులు మండిగ చిన్నయ్య, మండిగ జగదీష్, మేడి రాజు, మండిగ పోశెట్టి, చింటూ తదితరులు పాల్గొన్నారు..