హైదరాబాద్/మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగం పోరాటానికి సర్కార్ తలవంచింది. కేటీఆర్ అల్టిమేటం, అన్నదాతల ఆందోళనతో ఎట్టకేలకు దిగొచ్చింది. జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీటి విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నది. సమాంతర కెనాల్‌కూ నీటిని విడుదల చేసేందుకు సర్కార్ సంసిద్ధత వ్యక్తంచేసింది. బుధవారం లేదా గురువారం తెల్లవారుజామున నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్టు ఇరిగేషన్ శాఖ అధికారులు వెల్లడించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో హుటాహుటిన సెక్రటేరియట్లో మంగళవారం సీఎం భేటీ అయ్యారు. ఐదు రోజుల క్రితం ఐదు రోజుల క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ డిమాండ్ చేసినట్టే.. హడావుడిగా కర్ణాటక సీఎంకు లేఖ రాస్తూ ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి నీటిని దిగువకు విడుదల చేయాలని కోరేందుకు బెంగళూరుకు వెళ్లిపోయారు. మరోవైపు రైతుల ఆక్రందనను చూసి సర్కార్ దిగిరాకపోవడంతో ప్రకృతి కనికరించి ఎగువన కురుస్తున్న వర్షాలకు గత 36 గంటలుగా 2,600 క్యూసెక్కుల వరద నీరు జూరాలకు వచ్చి చేరుతుండటం రైతాంగానికి శుభపరిణామం. మంగళవారం కూడా రైతులు పోరుబాట పట్టారు. పోలీసులు బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్టులను కొనసాగించారు.
ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు పడుతున్న గోస చూసి బీఆర్ఎస్ రంగంలోకి దిగడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గత పది రోజులుగా రైతులు ఆందోళన చేస్తుంటే.. ‘ఒక్కసారి పంటలు పోతే ఏమైతది.. రైతుబంధు ఇచ్చాం కదా’ అని రైతులను వెటకారం చేసిండో మంత్రి. జూరాల కింద నీళ్లివ్వలేమని మరో జిల్లా మంత్రి తేల్చిచెప్పిన వైనం. సాగునీటి కోసం రైతులు తండ్లాడుతుంటే.. బర్త్‌డే సెలబ్రేషన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మునిగిపోవడంపై రైతుల నిరసన మరింత పెల్లుబికింది. బీఆర్ఎస్ ఇచ్చిన ‘చలో జూరాల’ పిలుపు రాష్ట్ర సర్కార్‌ను ఒక్క కుదుపు కుదిపేసింది. కుడి, ఎడమ కాలువలతోపాటు పేరలాల్ కెనాల్‌కు సాగునీటిని విడుదల చేయాల్సిన సర్కార్ చోద్యం చూస్తున్నది.
బీఆర్ఎస్ నేతల గృహనిర్బంధం
బీఆర్ఎస్ నేతలను మంగళవారం కూడా పోలీసులు గృహనిర్బంధంలోకి తీసుకున్నారు. జూరాల ప్రాజెక్టుకు రైతులెవరూ రాకుండా రెండు వైపులా భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. అడుగడుగునా పోలీసులు మోహరించడంతో రైతులు సాగునీటి కోసం మళ్లీ ఆందోళనకు దిగారు. రైతుల ఆందోళనకు ప్రజాసంఘాలు కూడా మద్దతుగా నిలిచాయి. ఆందోళన చేస్తున్న రైతులపై పోలీస్ జులుం ప్రదర్శించి వారిని చెదరగొట్టారు.
జూరాల ప్రాజెక్టు నీరు విడుదల చేయాలని కోరుతూ స్థానిక బీజేపీ సిట్టింగ్ ఎంపీ డీకే అరుణ లేకుండానే ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు జిల్లాలోకి ప్రవేశించడంతో జడ్చర్ల వద్ద ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూరాల నీటి విడుదలపై ఎంపీ మౌనంగా ఉండటం, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఒక్కరే రావడం, అరెస్ట్ అనంతరం తిరిగి వెళ్లిపోవడంపై రైతుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత 10 రోజులుగా జూరాల ఆయకట్టుకు నీళ్లివ్వాలని రైతుల మొరను సర్కార్ వినిపించుకోలేదు. ఫలితంగా కండ్లముందే చేతికొచ్చిన పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
జూరాల వద్ద పోలీస్ బందోబస్తు.. ఆందోళనలు
జూరాల ప్రాజెక్టు వద్ద పోలీస్ బందోబస్తు మంగళవారం కూడా కొనసాగింది. ఎడమ, కుడి కాలువలకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు పెద్ద ఎత్తున ప్రాజెక్టు వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. భారీ ఎత్తున వచ్చిన రైతులు పోలీస్ చెక్‌పోస్టులను దాటుకొని నందిమల్ల క్రాస్‌రోడ్డు వద్దకు చేరుకొన్నారు. గత నాలుగు రోజులుగా జూరాల ప్రాజెక్టు మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకొన్న పోలీస్ బలగాలు ఎవరినీ రాకుండా అడ్డుకుంటున్నారు. సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న రైతులపై పోలీస్ యంత్రాంగం తమ ప్రతాపం చూపిస్తున్నది. రైతులకు మద్దతుగా వచ్చిన ప్రజాసంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించి రైతులను చెదరగొట్టారు.
జూరాల నీటి విడుదలపై హైడ్రామా
ఒకవైపు పంటలు ఎండిపోతుంటే మరోవైపు పుష్కలంగా నీళ్లు ఉన్నా జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంలో హైడ్రామా కొనసాగుతున్నది. రైతుల కోసం పోరాటానికి దిగిన బీఆర్ఎస్కు ఎక్కడ మైలేజీ వస్తుందోనని ఆందోళన చెందిన ఇద్దరు జిల్లా మంత్రులు, ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరి సీఎంతో భేటీ అయ్యారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే చాలా కష్టమని వివరించారు. అధికార పార్టీ నేతలు చెప్పాకే నీటిని విడుదల చేస్తే రైతుల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించినట్టు అవుతుందని సూచించారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ నేతలకు ఇరిగేషన్ శాఖ అధికారులు ఫోన్‌చేసి నీటి విడుదలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరడం గమనార్హం.
రైతన్నకు దన్నుగా రామన్న గర్జన
జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల కింద రైతులు పంటల సాగు చేపట్టారు. అయితే 10 రోజుల నుంచి నీళ్లివ్వడం నిలిపేశారు. ఇదే విషయమై వారం నుంచి ఆయకట్టు రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ధర్నాలు చేస్తున్నది. నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. అయినా సాగునీటి పారుదలశాఖ అధికారులు కానీ, ప్రభుత్వం కానీ పట్టించుకున్న పరిస్థితి లేకుండా పోయింది. ఇదిలా ఉండగా పితృవియోగంలో ఉన్న కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి కుటుంబీకులను ఇటీవల కేటీఆర్ పరామర్శించారు. అనంతరం వనపర్తి జిల్లా పెబ్చేరులో భారీ రోడ్‌షో నిర్వహించారు.
ఈ సందర్భంగా జూరాల ప్రాజెక్టు ఆయకట్టు పక్షాన రేవంత్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశారు. ‘జూరాల, ఆల్మట్టి, నారాయణపూర్‌లో ఉన్నాయి.. కింద శ్రీశైలంలో ఉన్నాయి.. పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీయే కదా! రేవంత్‌రెడ్డీ.. నీకు చేతనైతే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాయ్.. లేదా మమ్మల్ని పంపినా మా రైతులకు నీళ్లు విడుదల చేయండి అని అడుగుతం’ అని అల్టిమేటం జారీచేశారు. నీళ్లు అడిగి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
రామన్న గర్జనతో కాంగ్రెస్ సర్కార్‌లో కదలిక వచ్చింది. అదేరోజున ఆయకట్టు రైతులు సైతం ప్రాజెక్టు వద్దకు భారీగా చేరుకున్నారు. సర్కార్‌పై తిరుగుబాటు ప్రకటించారు. హెడ్‌రెగ్యులేటరీని స్వయంగా తెరచి నీళ్లు వదులుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు సైతం రైతాంగానికి ఎక్కడికక్కడ మద్దుతుగా నిలుస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నేతృత్వంలోనూ మరోసారి రైతులు ప్రాజెక్టు వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. అమరచింత, ధరూర్, ఇటిక్యాల ఇలా ప్రాజెక్టు పరిధిలోని ప్రతిచోటా ఇదే పరిస్థితి. ఎక్కడికక్కడ రైతాంగం సర్కార్‌పై తిరుగుబాటును ప్రకటిస్తుండగా, బీఆర్ఎస్ శ్రేణులు బాసటగా నిలుస్తున్నాయి.
సర్కార్‌లో జడుపు.. కర్ణాటకకు పరుగు..
ఇక రామన్న అల్టిమేటం, మరోవైపు బీఆర్ఎస్ శ్రేణుల దన్నుతో రైతాంగం తిరుగుబాటుతో రేవంత్‌రెడ్డి సర్కార్ జడిసింది. అనివార్య పరిస్థితుల్లో ప్రభుత్వానికి ముందుకు కదలక తప్పలేదు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే రంగంలోకి దిగారు. కేటీఆర్ డిమాండ్‌కు అనుగుణంగా కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో సంప్రదింపులకు దిగారు. సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సైతం కర్ణాటక సీఎమ్‌కు లేఖ రాశారు.
మరోవైపు మంత్రులు జూపల్లి, వాకిటి, ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి బృందాన్ని హుటాహుటిన బెంగళూరుకు పంపారు. నారాయణపూర్ నుంచి 5 టీఎంసీల జలాలను జూరాలకు విడుదల చేయాలని, తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేయాలని వారికి సూచించారు. సీఎం ఆదేశాలతో ఆ బృందం కర్ణాటకకు చేరుకున్నది. కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో భేటీ కోసం బృందం యత్నించింది. అయితే ఇప్పటికీ అపాయింట్మెంట్ లభించలేదు. మొత్తంగా బీఆర్ఎస్ నిలదీతతో తప్ప నీళ్లు అడగాలని, రైతాంగానికి ఇవ్వాలనే సోయి కాంగ్రెస్‌లో లేకుండా పోయిందని తేలిపోయింది.
పంటలను కాపాడుతం: మంత్రి ఉత్తమ్
సచివాలయంలో విలేకరులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. ఎల్ నినో వర్షాలను తగ్గించిందని వివరించారు. ప్రస్తుత నీటికరువుకు బీఆర్ఎస్సే కారణమంటూ ఆరోపణలకు దిగారు. గత ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం, రిజర్వాయర్లను నిర్మించకపోవడం వల్లే ప్రస్తుత కరువుకు కారణమని నెపం మోపేందుకు యత్నించారు. జూరాలపై ఆధారపడిన పంటలను కాపాడేందుకు అందుబాటులో ఉన్ని ప్రతి అవకాశాన్నీ పరిశీలిస్తున్నామని ఉత్తమ్ వెల్లడించారు.
నారాయణపూర్ నుంచి నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరామని, ఆ నీరు వస్తే అత్యవసర ప్రాంతాలకు అందించి పంటలను కాపాడుతామని వెల్లడించారు. సాగునీరు, వేసవి తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి చుకనూ జాగ్రత్తగా వినియోగిస్తున్నామని, ప్రకృతి పరీక్ష పెడితే రైతును ఒంటరిగా వదిలేయకుండా పంటల రక్షణకు సాధ్యమైన ప్రతి చర్య తీసుకుంటామని వివరించారు.
ప్రతిసారీ ఇదే తరహా
ఇప్పుడే కాదు గతంలోనూ కాంగ్రెస్ పెద్దలు ఇదే తీరుగా వ్యవహరించారు. బీఆర్ఎస్ శ్రేణులు పోరాటానికి దిగడమే ఆలస్యం.. వెనువెంటనే హడావుడి చేయడం పరిపాటిగా మారింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నీటి కోటాను 90 టీఎంసీల నుంచి 45 టీఎంసీలకు కాంగ్రెస్ సర్కార్ కుదించింది. దీంతో పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయమని, కాంగ్రెస్ ద్రోహాన్ని బీఆర్ఎస్ నిలదీసింది. సర్కార్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రశ్నల అస్ర్తాలను సంధించింది. చారిత్రక తప్పిదాన్ని కప్పిపుచ్చుకోలేక, నోట మాట రాక ప్రభుత్వం నీళ్లు నమిలింది. సమర్థించుకునేందుకు సాకులను వెతికింది.
సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రాజెక్టులు, నీటివాటాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ఏర్పాటు చేసింది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మోటర్లను ఆన్ చేసి నీళ్లు ఇవ్వాలని, లేదంటే రైతులతో కలిసి మోటర్లను ఆన్‌చేస్తామని బీఆర్ఎస్ అల్టిమేటం జారీ చేసింది. దానికి జడిసిన ప్రభుత్వం ఆ వెంటనే మోటర్లను ఆన్ చేసింది. ఇక పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు చేపట్టకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు పాదయాత్రకు పిలుపునివ్వగానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి ప్రాజెక్టుల పురోగతిపై వరుసగా సమీక్షలు నిర్వహించారు. సీఎం రెండురోజుల పాటు పాలమూరులో పర్యటించారు. తాజాగా మరోసారి నీటి విడుదల అంశంలోనూ అదే పరిస్థితి నెలకొన్నది. రామన్న అల్టిమేటంతో కర్ణాటకు పరుగులు తీసింది.
కర్ణాటక సీఎంతో మంత్రుల బృందం భేటీ

తెలంగాణ మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మేఘారెడ్డి, మధుసూదన్‌రెడ్డి బృందం కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో మంగళవారం భేటీ అయ్యింది. దక్షిణ తెలంగాణలోని రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కృష్ణా నది నుంచి దిగువకు నీటిని వదలాలని ఆయనను మంత్రుల బృందం కోరింది. ప్రస్తుతం జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఆయకట్టు పరిధిలో పంటలు కీలక దశలో ఉన్నందున, వాటిని కాపాడేందుకు కర్ణాటక ప్రాజెక్టుల నుంచి 5 వేల క్యూసెక్కుల చొప్పున నెలపాటు నిరంతరాయంగా విడుదల చేయాలని కోరారు. ఆ నాలుగు సాగునీటి పథకాల కింద దాదాపు 5.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నదని, వాటి పరిధిలో వేలాది రైతు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని వివరించారు. పొరుగు రాష్ర్టాల మధ్య సహకార స్ఫూర్తితో సానుకూలంగా స్పందించి నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వాన్ని తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు కోరారు.