మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 13: మంచిర్యాలలో (Mancherial) విషాదం చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఎలకల మందు తాగి ఆత్మహత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బెల్లంపల్లి మండలం అకెనపల్లికి చెందిన ఎగ్గే రమేష్ రాజక్క దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. వారికి ముగ్గురు ఆడపిల్లలు. వారిలో రెండో అమ్మాయి ఎగ్గే సుప్రియ (14) అకెనపల్లిలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నది. శుక్రవారం ఉదయం 4 గంటలకు ఇంట్లోనే బాత్రూమ్ కని వెళ్లి ఎలుకల మందు సేవించిందని తెలిపారు. కాసేపటి తరువాత ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలుపగా వెంటనే ఆటోలో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మంచిర్యాల ప్రభుత్వ జనరల్ దవాఖానకు తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా సుప్రియ ఆత్మహత్యకు పాల్పడటానికి కారణాలు తెలియదన్నారు. గత మూడు రోజులుగా బడికి వెళ్లడం లేదన్నారు.