MLA Prem Sagar Rao | కాసిపేట, డిసెంబర్ 3 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఇలాకాలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాగా వేశారు. ప్రేమ్ సాగర్ సోదరుడు, దేవాపూర్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం అధ్యక్షుడు కొక్కిరాల సత్యపాల్ రావు తన వర్గం కాంగ్రెస్ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించి ప్రత్యర్థి ఎమ్మెల్యే వినోద్ వర్గానికి సవాల్ విసిరారు.
ఈ పరిణామం ఒకింత బెల్లంపల్లి ఎమ్మెల్యే వర్గానికి ఇబ్బందయ్యే విషయమే. ఈ మేరకు కాసిపేట మండలంలో ధర్మారావుపేటలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సొంత గ్రామంలోని నివాసంలో తన సోదరుడు కొక్కిరాల సత్యపాల్ రావు సమావేశం బుధవారం నిర్వహించి తన కాంగ్రెస్ వర్గం అభ్యర్థులను ప్రకటించారు. అసలైన కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులమని, తమ కాంగ్రెస్ అభ్యర్థులను అందరిని గెలిపించుకుంటామని స్పష్టం చేశారు.
మొత్తం 13 మంది సర్పంచ్ అభ్యర్థులను ప్రకటించారు. పెద్దనపల్లి వేముల కృష్ణ, దేవాపూర్ రాయి సిడం రాందాస్, గట్రావ్పల్లి మెస్రం విమల, మల్కెపల్లి కొట్నాక రఘు, ధర్మారావుపేట జుగునాక రాధ(ఏకగ్రీవం), కొండాపూర్ ఒల్లపు శైలజ, మద్దిమాడ భీమిని మాధవి లత, మామిడిగూడ భూక్య సౌజన్య, లంబాడితాండ(కే) బోడ బలరాం, రొట్టెపల్లి ఆత్రం కళావతి, వెంకటాపూర్ ఆడె శంకర్, సోనాపూర్ మహేందర్, కోమటిచేను జాడి శంకర్లను ప్రకటించారు. అందరినీ గెలిపించుకొని తమ సత్తా చాటుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్ధం తిరుపతి, మాజీ ఎంపీటీసీ పర్వతి మల్లేష్, శేఖర్ రావు, కనక రాజు, ఎంబడి కిషన్, కూకట్ల దేవేందర్, చారి, అనంత రావు తదితరులు పాల్గొన్నారు.