దండేపల్లి, ఫిబ్రవరి4: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికి వదిలేసి పగ, ప్రతీకారాలతో పాలన సాగిస్తున్నదని, ఈ మోసకారి సర్కారుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పిలుపునిచ్చారు. మంగళవారం దండేపల్లి మండల కేంద్రంలోని పద్మశాలీ భవన్లో ని ర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నదని మండిపడ్డారు.
కార్యకర్తలకు బీఆర్ఎస్ ఎప్పటికీ అండగా ఉంటుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారికే ప్రాధాన్యత ఇస్తామన్నారు.ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. కాంగ్రెస్ మోసాలను గడపగడపకూ వివరించి ప్రజలను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల్లో బీఆర్ఎస్ జెం డా ఎగరవేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రం లో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలో రావడం ఖాయమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్, యువ నాయకులు విజిత్‌రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ కాసనగొట్టు లింగన్న, వైస్ చైర్మన్ అక్కల రవి, మాజీ వైస్ ఎంపీపీ అనిల్, బీఆర్ఎస్ నాయకులు గోళ్ల రాజమల్లు, గొట్ల భూమన్న, రేని శ్రీనివాస్, బచ్చల అంజన్న, రాజిరెడ్డి, ఇసాకర్, మల్లయ్య, అఫ్సర్, ఉస్మాన్‌ఖాన్, రవికుమార్, అజయ్, రాకేశ్, సాయి, హరీశ్, పవన్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.