కుంటాల, ఏప్రిల్ 10 : మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతులకు మద్దతు ధర కల్పించి ఆదుకోవడంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ కుంటాల మండల అధ్యక్షుడు పడకంటి దత్తాత్రి ఆరోపించారు. మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం కుంటాల తహసీల్దార్ కమల్సింగ్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు లేక, ప్రభుత్వం మద్దతు ధర అందక రైతులు ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయించి నష్టపోతున్నారని తెలిపారు. కొనుగోళ్లలో జాప్యం కావడంతో మండలంలో ఇటీవల ఓ రైతుకు చెందిన 50 క్వింటాళ్ల మక్కల బస్తాలు చోరీకి గురయ్యాయన్నారు. మక్క పంటలు కోత దశలో ఉన్నందున ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కల్లూర్ సర్పంచ్ పెంటవార్ దశరథ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు 24 గంటలు వ్యవసాయ విద్యుత్, రైతుబంధు, రైతులకు వ్యవసాయ బీమా సౌకర్యం, రైతులకు సరిపడా ఎరువులను సరఫరా చేసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెంట దశరథ్, పార్టీ మండల ఉపాధ్యక్షుడు దత్తు, మాజీ సర్పంచ్ దాసరి కిషన్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బొంతల పోశెట్టి, వంశీకృష్ణ, రాజు, రమేశ్, రైతులు పాల్గొన్నారు.
కుభీర్, ఏప్రిల్ 10 : రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడంలో రేవంత్రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ కుభీర్ మండల అధ్యక్షుడు ఎన్నీల అనిల్ విమర్శించారు. మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం కుభీర్లోని తహసీల్దార్ శివ్రాజ్కు బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని మండిపడ్డారు. వానకాలంలో సాగు చేసిన సోయా, కందులు, శనగల కొనుగోళ్లు పంట వచ్చిన నెల రోజుల తర్వాత ప్రారంభించడంతో ఆ పాటికే రైతులు ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించి నష్ట పోయారన్నారు. యాసంగిలో ఈ ఏడాది మక్క పంట గతేడాది కంటే రెట్టింపు సాగు చేశారని పంట చేతికొచ్చి 20 రోజులైనా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయడం లేదని ధ్వజమెత్తారు. ఇటీవలే ఈదురుగాలులతో కూడిన అకాల వర్షంతో మక్క చేలు నేలవాలడంతో రైతులు తీవ్ర నష్టాల పాలయ్యారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, మద్దతు ధరతో మక్కలను వెంటనే కొనుగోలు చేయాలని లేదంటే రైతుల పక్షాన తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలకు సిద్ధమని హెచ్చరించారు. ఉద్యమ నాయకుడు పుప్పాల పీరాజీ, మాజీ వైస్ ఎంపీపీ ఎస్కే మొహియొద్దీన్, నాయకులు వడ్నం దత్తాత్రి, జీ.కాశీనాథ్, పోగుల పోతన్న, లింగన్న, నాగేశ్, ఆయా గ్రామాల రైతులు, తదితరులు పాల్గొన్నారు.