బోథ్/భైంసా టౌన్/ముథోల్/బజార్హత్నూర్/కుభీర్, ఏప్రిల్ 21 : ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో మంగళవారం అకాలవర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో పంటలు నేలకొరిగాయి. కోత దశలో ఉన్న జొన్న కంకులు తడిచిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలోని ధన్నూర్(బీ), బోథ్, మర్లపెల్లి ప్రాంతాల్లో జొన్నతోపాటు మక్క, నువ్వుల పంటలు దెబ్బతిన్నాయి. బోథ్ మార్కెట్ యార్డులో రైతులు అమ్మకానికి తెచ్చిన శనగలు, మక్కలు, జొన్న కుప్పల కిందికి వర్షపు నీరు చేరింది. ధన్నూర్(బీ)లో వాగు ఒడ్డున నిల్వ ఉంచిన జొన్న కుప్పలు టార్పాలిన్లు గాలివానకు లేచిపోయాయి.
మర్లపెల్లి రూట్లో కరత్వాడ ప్రాజెక్టు సమీపంలో విద్యుత్ స్తంభంతోపాటు చెట్టు రోడ్డుపై విరిగిపడడం కొంతసేపు రాకపోకలు నిలిచాయి. బజార్హత్నూర్లో గాలికి పూలాజీ బాబా నగర్ కాలనీ వెళ్లే దారిలో విద్యుత్ స్తంభం విరిగిపడింది. బజార్హత్నూర్ సమీపంలో 33 కేవీ విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. నిర్మల్ జిల్లా భైంసాలో కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన మక్కలు తడిశాయి. ముథోల్‌లో మొక్కజొన్న కోత కోసి కుప్పలు వేయడంతో తడిశాయి. ప్రభుత్వం సకాలంలో కేంద్రాలు ఏర్పాటు చేస్తే.. ఈ పరిస్థితి ఉండేది కాదని రైతులు పేర్కొన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కుభీర్ మండలంలోని రంగశివుని తాండకు చెందిన రాథోడ్ రాందాస్ ఎద్దుపై పిడుగు పడడంతో మృతి చెందింది.
బోథ్, ఏప్రిల్ 21 : అకాల వర్షం మూలంగా తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని ధన్నూర్(బీ) గ్రామంలో వర్షంతో తడిసిన జొన్న కుప్పలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జొన్న, మక్క, శనగ పంటలను కొనుగోలు చేయాలన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు తుల శ్రీనివాస్, ప్రీతంరెడ్డి, బి.శ్రీధర్‌రెడ్డి, జె.శ్రీధర్‌రెడ్డి, వెంకట్ రమణ, సూర్యప్రకాశ్‌రెడ్డి, సాగర్ రెడ్డి, దేవేందర్‌రెడ్డి, సురేందర్ యాదవ్, పంద్రం శంకర్, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ స్వామి ఉన్నారు.