మంచిర్యాల, మార్చి 5(నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తున్నది. వారి కోసం అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాల నేపథ్యంలో మహిళా దినోత్సవ సంబురాలకు టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమాల వివరాలు శ్రేణులకు వివరించారు. 6,7,8 తేదీల్లో మూడు రోజులపాటు మహిళా బంధు కేసీఆర్ పేరిట సంబురాలు నిర్వహించాలని సూచించారు.
6వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాఖీలు కట్టడం. పారిశుధ్య కార్మికులు, డాక్టర్లు, ప్రతిభ కలిగిన విద్యార్థినులు, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, స్వయం సహాయక సంఘాల నాయకులు, తదితర మహిళలకు గౌరవ పూర్వక సన్మానం. కేసీఆర్ కిట్, షాదీ ముబారక్, థ్యాంక్యూ కేసీఆర్ వంటి ఆకారం వచ్చేలా మానవహారాలు ఏర్పాటు చేయడం. 7వ తేదీన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్లు, ఇతర మహిళా సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులను నేరుగా ఇంటివద్దకు వెళ్లి కలవడం, లబ్ధిదారులతో సెల్ఫీలు తీసుకోవడం. 8వ తేదీన నియోజకవర్గస్థాయిలో మహిళలతో సమావేశం. సంబురాలు. గతంలో పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రైతుబంధు వారోత్సవాలతోపాటు కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలపడం. వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమాల నిర్వహణపై శనివారం దిశానిర్దేశం చేశారు.