కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర, తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇరు రాష్ర్టాల సరిహద్దు జిల్లాల అధికారులతో నాగపూర్ ఐజీ చెర్రింగ్ డోర్జే ప్రత్యేకంగా సమావేశమయ్యారు. చంద్రపూర్ జిల్లా ఎస్పీ ఎం సుదర్శన్, కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ఎస్పీలు సురేశ్ కుమార్, గౌస్ ఆలం, ఆదిలాబాద్ కలెక్టర్ రాజశ్రీ షా, చంద్రాపూర్ కలెక్టర్ వినయ్ గోద్వ, యావత్మల్ ఎస్పీ పవన్ ధన్సూద్, ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ వేణు ఈ సమావేశానికి హాజరయ్యారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ ఎస్పీ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాగపూర్ ఐజీ మాట్లాడుతూ ఇరు రాష్ర్టాల సరిహద్దు జిల్లాల అధికారులు నమన్వయంతో పనిచేసి ఎన్నికలు సజావుగా సాగేలా కృషిచేయాలన్నారు. సరిహద్దుల వద్ద భద్రతా చర్య లు పటిష్టంగా ఏర్పాటు చేయాలని సూచించారు. నేరాల కట్టడి, కేసుల విషయంలో ఒకరికొకరు సహకరించుకుందామని కోరారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఇరు రాష్ర్టాల అధికారులు చర్చించారు. చెక్‌పోస్టుల ఏర్పాటు, బందోబస్తు, పార్లమెంట్ ఎన్నికలు సజావుగా పూర్తయ్యేలా తీసుకోవాల్సిన ఏర్పాట్లపై సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.