ఆదిలాబాద్, మే 11(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు నామమాత్రంగా మారుతున్నాయి. రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా పథకాలు పూర్తిస్థాయిలో అమలు కాకపోగా, ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఆర్భాటంగా ప్రకటించిన మహాలక్ష్మీ పథకం ప్రచారానికే పరిమితమవుతున్నది. ఈ పథకంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500 గ్యాస్ సిలిండర్‌ను పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించింది. గతేడాది ఫిబ్రవరి 27న ప్రారంభించారు. రేషన్‌కార్డులు కలిగిన వారు పథకానికి అర్హులు అని ప్రకటించడంతో ప్రజాపాలనలో జనం రూ.500 సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పథకం ప్రారంభంలో చాలా మందికి సబ్సిడీ సిలిండర్లు పంపిణీ కాలేదు. దీంతో మున్సిపల్ కార్యాలయాలు, గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తులుదారులు మరోసారి తమ వివరాలను సమర్పించారు. మహాలక్ష్మీ పథకంలో భాగంగా రూ.500 సిలిండర్ పొందాలంటే రేషన్‌కార్డు తప్పనిసరితోపాటు ఇతర నిబంధనల కారణంగా చాలా మంది పేదలు సబ్సిడీ సిలిండర్లకు దూరమయ్యారు.
ప్రజాపాలన దరఖాస్తులను పరిశీలించిన అధికారులు ఆదిలాబా ద్ జిల్లా వ్యాప్తంగా 98,660 మంది అర్హులుగా గుర్తించారు. సి లిండర్ ధర రూ.882 ఉండగా కేంద్ర ప్రభుత్వం రూ. 47.38 సబ్సిడీ ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మీ ఫథకంలో భాగం గా రూ.334.62 రాయితీ ఇస్తుంది. లబ్ధిదారుడు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత సంబంధిత గ్యాస్ ఏజెన్సీలు డెలివరీ చే స్తాయి. లబ్ధిదారుడు మొదటగా సిలిండర్ ధర మొత్తం రూ.882 చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స బ్సిడీలు వేర్వేరుగా లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతా యి. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ రూ.47.38 ప్రతి వినియోగదారుడికి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మీ పథకంలో ఎం పిక చేసిన వారికి మాత్రం రాయితీ డబ్బులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ కావడం లేదు. ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయో? ఎప్పుడు రావో? తెలియని దుస్థితి నెలకున్నది. ఒక్కొక్కరికి మూ డు నెలల సమయం పడుతుండగా.. మరికొందరికి ఇంకా ఎక్కు వ సమయం పడుతుంది. లబ్ధిదారులు నెల నుంచి 45 రోజులకోక సిలిండర్ వారి అవసరాల మేరకు వాడుతుంటారు. వీరికి నెలల తరబడి సబ్సిడీ డబ్బులు జమపోవడంతో ఆందోళన చెం దుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మీ పథకం ద్వారా రూ.500 సిలిండర్ లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.
మా ఐదో వార్డులో చాలా మందికి మహాలక్ష్మీ పథకానికి సంబంధించి రూ.500 సిలిండర్ డబ్బులు రావ డం లేదు. చాలా మంది పేదలు మా దగ్గరికి వచ్చి మాకు గ్యాస్ సబ్సిడీ రావడం లేదని అంటున్నారు. ఈ విషయంలో ప్రజావాణిలో దరఖా స్తులు ఇచ్చినా ప్రయోజనం లేదు. సివిల్ సప్లయ్ అధికారులు, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులను సంప్రదించినా తాము ఏమీ చేయలేమని అంటున్నారు. ప్రభు త్వం సబ్సిడీ నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తు న్నదని సమాధానం ఇస్తున్నారు. సిలిండర్ తీసుకుని మూడు నెలలు దాటినా సబ్సిడీ వస్తలేదు. ప్రభుత్వం లబ్ధిదారులకు సిలిం డర్ రాయితీ డబ్బులు వచ్చేలా చర్యలు తీసుకోవాలి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారం భించిన మహాలక్ష్మీ పథకం ప్రచారానికే పరిమితమైంది. పేదలకు రూ.500 సిలిండర్ అందడం లేదు. సిలిండర్ తీసుకుని మూడు, నాలుగు నెలలు దాటినా సబ్సిడీ పైసలు రావడం లేదు. లబ్ధిదారులకు సబ్సిడీ డబ్బుల విషయంలో ఎవరిని అడగాలో తెలియడం లేదు. ప్రభుత్వం విధించిన నిబంధనల కారణంగా చాలా మంది పేదలకు మహాలక్ష్మీ పథకం వర్తించడం లేదు. ఎంపిక చేసిన లబ్ధిదారులకు సబ్సిడీ డబ్బులు జమ కావడం లేదు. రూ.500 సిలిండర్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నది.