ఆదిలాబాద్, మే 27(నమస్తే తెలంగాణ) : సొంతింటి కలను నిజం చేసుకుందామనే సామాన్యులకు కొందరు అక్రమార్కుల ధనదాహం కారణంగా నష్టపోవాల్సి వస్తుంది. రియల్ వ్యాపారులతోపాటు భూముల క్రయవిక్రయాలు జరిపే వారు ప్రజల అవకాశాలను ఆసరాగా చేసుకుని అందిన కాడికి దోచుకుంటున్నారు. ఒకే స్థలాన్ని ఇద్దరికి విక్రయించి మోసాలకు పాల్పడుతున్నారు. లక్షల రూపాయల ఖర్చు చేసి కొనుగోలు చేసిన స్థలంలో ఇండ్లు నిర్మించుకునేందుకు కొనుగోలుదారులు ప్రయత్నాలు ప్రారంభిస్తే ఆ జాగా తమదని ఇతరులు రావడంతో గుండెలు బాదుకుంటున్నారు. స్థలం విక్రయించిన వారిని నిలదీస్తే వారు పొంతన లేని సమాధానాలు చెబుతూ భయందోళనలకు గురి చేస్తున్నారు. కొందరు దళారులు వారి వద్ద మరిన్ని పైసలు వసూలు చేసి వేరే స్థలాలను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నారు. రెండోసారి కొనుగోలు చేసిన స్థలాలు మొదటగా ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ అయి ఉండడంతో మోసగాళ్ల చేతిలో పడి నష్టపోతున్నారు. పైసా, పైసా జమ చేసి కొనుగోలు చేసిన స్థలం తమది కాకుండా పోయిందని బాధపడుతూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
మధ్య తరగతి ప్రజలు కష్టపడి కూడబెట్టుకున్న డబ్బులతో ఇంటి స్థలాలను కొనుగోలు చేస్తారు. పిల్లల చదువులు, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగం, ఇతర ఉపాధి పనుల కోసం గ్రామాల నుంచి ప్రజలు పట్టణాలకు వచ్చి స్థిరపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మహారాష్ట్రతోపాటు ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడి వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. దీంతో పట్టణంలోని పలు ప్రాంతాలతోపాటు సరిహద్దు ప్రాంతాల్లో రియల్ వ్యాపారులు ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. కొందరు దళారులు పట్టాదారులకు అడ్వాన్సుగా కొన్ని డబ్బులు చెల్లించి ప్లాట్లుగా మార్చి అమ్మకాలు జరుపుతున్నారు. కొందరు అక్రమార్కులు ఒకే స్థలాన్ని ఇద్దరు వ్యక్తులకు విక్రయించి మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో సొంతిళ్లు నిర్మించుకుందామని పైసా, పైసా కూడబెట్టి ఇంటి స్థలాలను కొనుగోలు చేసిన వారు మోసపోతున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగి లక్ష్మీనారాయణ పాత హౌజింగ్ బోర్డు కాలనీలో ఒకే స్థలాన్ని ఇద్దరి వ్యక్తులకు విక్రయించగా బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా పరిషత్లో నాల్గోవ తరగతి ఉద్యోగిగా పనిచేస్తున్న గంగాధర్ అనే వ్యక్తి అటెండర్ కాలనీలో ఓ ప్లాటును నకిలీ పత్రాలకు విక్రయించినందుకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
ఒకే స్థలాన్ని ఇద్దరికి విక్రయించకుండా రిజిస్ట్రేషన్ అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఎందుకు ఉండదనే అభిప్రాయాల ను జనం వ్యక్తం చేస్తున్నారు. విక్రయదారులు నకిలీ పత్రాలు సృష్టించి ఒకే ప్లాటును ఇద్దరు వ్యక్తులకు విక్రయిస్తే అమ్మిన వ్యక్తి లక్షలు సంపాదిస్తుండగా కొనుగోలు చేసిన వారు నష్టపోవాల్సి వస్తుంది. ఒకే ప్లాటును ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉం దని విషయాన్ని ఆదిలాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయం అధికారులను అడిగితే తాము పత్రాలు సరిగా చూసి రిజిస్ట్రేషన్ చేస్తామని తమకు మొదటి రిజిస్ట్రేషన్లకు సంబంధం లేదని జాయింట్ రిజిస్ట్రార్ తెలిపారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఒకే ప్లాటును రెం డు సార్లు రిజిస్ట్రేషన్ చేయకుండా, దళారుల అక్రమాలను అడుక ట్టు వేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.