ఆదిలాబాద్, జూన్ 19 ( నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరి 11 గంటలకు సిరికొండ మండలం పొన్న గ్రామానికి చేరుకుంటారు. పొన్న గ్రామానికి చెందిన రైతు నావర్గే పాండురంగ్ తన జొన్న పంటను కొనకపోవడంతో రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్యహత్య చేసుకున్నాడు. పాండురంగ్ కుటుంబసభ్యులను కేటీఆర్ పరామర్శించనున్నారు. వారితో మాట్లాడి భరోసా కల్పించనున్నారు. అనంతరం 12 గంటలకు నేరడిగొండ మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో జరిగే బోథ్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ హాజరై పార్టీ సభ్యత్వంపై దిశా, నిర్దేశం చేయనున్నారు. అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరుతారు. యువనేత పర్యటన ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొన్నది.