ఆదిలాబాద్, నవంబర్ 18(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) పర్యటించారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని రోల్మామడ టోల్ ప్లాజాకు 10.30 గంటలకు చేరుకోగానే ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. శాలువా కప్పి పుష్పగుచ్ఛ అం దించి స్వాగతించారు. బాణసంచా కాల్చారు. నాయకులు, కార్యకర్తలు జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. అ క్కడి నుంచి భారీ కాన్వాయ్ మధ్య ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు వెళ్లారు. అక్కడ రైతులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు నిర్మల్ బయలుదేరారు. సోన్ మండలంలోని గంజాల్ టోల్‌ప్లాజా వద్ద నాయకులు స్వాగతం పలికారు. సాయం త్రం భైంసా పట్టణంలోని గాంధీగంజ్‌లో రైతులతో మాట్లాడారు.

పత్తి, సోయా పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న నిబంధనల ఫలితంగా తాము పంటలు మద్దతు ధరతో అమ్మే పరిస్థితులు లేవని రైతులు కేటీఆర్‌కు విన్నవించారు. అధిక వర్షాలతో ఇప్పటికే పంటలు నష్టపోయిన తాము ఉన్న పంటలను అమ్ముకొని మద్దతు ధర పొందాలంటే సీసీఐ, మార్క్‌ఫెడ్ నిబంధనలతో పంట తిరస్కరణకు గురువుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక వర్షాలతోపాటు ఉష్ణోగ్రతలు 7 నుంచి 8 డిగ్రీలు నమోదవుతున్న కారణంగా.. పత్తిలో తేమ ఎక్కువగా ఉంటుందని, సీసీఐ అధికారులు తేమ పేరిట పంటను తిరస్కరిస్తున్నారని తెలిపారు. దీంతో తాము ప్రైవేటు వ్యాపారులకు పంటను విక్రయించి రూ.1500 నష్టపోతున్నామని రైతులు పేర్కొన్నారు. ఎకరాకు ఏడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తుండడంతో మిగతా పత్తిని తక్కువ ధరకు ప్రైవేటులో విక్రయించి నష్టపోతున్నట్లు తెలిపారు.
లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి ఎండనకా, వాననకా పండిస్తే.. కొనుగోళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు షరతులు పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం సోయాను ఎకరాకు ఏడు క్వింటాళ్లు కొంటుందని, పంటల అమ్మకంలో రైతుల వేలిముద్రలు తప్పనిసరిగా చేశారని, ఓటీపీ లేకపోవడంతో వృద్ధ రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. యాసంగి సాగులో వ్యవసాయానికి కరెంటు కోతల కారణంగా నష్టపోతున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఎగ్గొడుతుందన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ కాకపోవడంతోపాటు యూరియా దొరకక పంటలు నష్టపోయినట్లు పేర్కొన్నారు.

పంటల కొనుగోళ్లలో ఇబ్బందులు పడుతున్న రైతులకు అండగా ఉంటామని, మద్దతు ధర లభించేలా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా కల్పించారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు వస్తున్నారనే విషయం తెలుసుకొని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు భారీ సంఖ్యలో కదలివచ్చారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలు తెలుపడానికి ఉత్సాహం చూపారు. పోటీ పడుతూ పంట అమ్మకాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు ఏ కరువు పెట్టారు. యువనేత కేటీఆర్‌తో కరచాలనం చేయడానికి పోటీ పడ్డారు. కేటీఆర్ మాట్లాడుతున్న సమయంలో కేరింతలు కొడుతూ ఉత్సాహం చూపారు.

ఆదిలాబాద్, నవంబర్ 18(నమస్తే తెలంగాణ): పత్తి కొనుగోళ్లలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) అమలు చేస్తున్న కఠిన నిబంధనలు సడలించాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం ఆదిలాబాద్ సీసీఐ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి సీసీఐ అధికారులను కలిసిన కేటీఆర్ రైతుల సమస్యలు వివరించారు. జిల్లాలో వర్షాలు, చలితీవ్రత కారణంగా తేమ ఎక్కువగా ఉందని డిసెంబరు వరకు ఎలాంటి నిబంధన లేకుండా పంటను కొనాలన్నారు.
ఎకరాకు ఏడు క్వింటాళ్లు కాకుండా 13 క్వింటాళ్లు కొనాలని, కపాస్ కిసాన్ యాప్‌ను రద్దు చేసి పాత పద్ధతిలో కొనుగోళ్లు జరపాలన్నారు. జిన్నింగ్ మిల్లుల గ్రేడింగ్ విధానంలో ఎల్1, ఎల్2, ఎల్3 పద్ధతిని రద్దు చేసి అన్ని మిల్లులకు కొనుగోలు చేసే అవకాశం కల్పించాలన్నారు. కౌలు రైతులు, ఏజెన్సీలోని ఆర్వోఎఫ్ఆర్ పట్టాలున్న గిరిజన రైతుల పంటను నిబంధనలు లేకుండా కొనుగోలు చేయాలని సూచించారు. నిబంధనల కారణంగా రైతులు పత్తిని అమ్ముకోకుండా ఇండ్లలో నిల్వ చేసుకుంటన్నందున ప్రమాదవశాత్తు కాలిపోయి నష్టపోతున్నారన్నారు.
ఇచ్చోడ, నవంబర్ 18 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ముక్రా(బీ) చౌరస్తాలో ముక్రా(కే), ముక్రా(బీ) గ్రామస్తులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు బొట్టు పెట్టి శాలువాతో సన్మానించారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ముక్రా(కే) మాజీ సర్పంచ్ మీనాక్షి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంకెళ్లు త ప్ప అనే శ్రీశ్రీ మాటలతో రైతులు సమస్యలపై బీఆర్ఎస్ పోరాటాలు చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, యువనేత కేటీఆర్ అన్నారు. అందరూ కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని.. పత్తి, సోయా కొనుగోళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా రైతులకు ఆందోళనలు నిర్వహించాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో రైతుల సమస్యలపై ఈనెల 21వ తేదీన ఎన్‌హెచ్-44పై భోరజ్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాను సక్సెస్ చేయాలని కోరారు.
సీసీఐ తేమతో సంబంధం లేకుండా పత్తిని కొనుగోలు చేయాలని, ఎకరాకు 12 క్వింటాళ్లు సేకరించాలని, సోయా కొనుగోళ్లలో మార్క్‌ఫెడ్ ఎకరాకు ఏడు క్వింటాళ్ల నిబంధన, వేలిముద్రలు తీసివేయాలన్నారు. తాము వస్తున్నామని తెలిసి సోయ కొనుగోళ్ల పరిమితి పది క్వింటాళ్లకు పెంచిందన్నారు.కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనిల్‌జాదవ్, కోవలక్ష్మి, సంజయ్, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు సుమన్, చిన్న య్య, కొనప్ప, మాజీ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్ నాయక్ పాల్గొన్నారు.

భైంసా, నవంబర్ 18 : కేసీఆర్ సర్కారు హయాంలోనే రైతులు బాగుండే అని, రైతు బీమా, రుణమాఫీ, రైతుబంధుతోపాటు ఎరువుల కొరత లేకుండా ఉండేదని రైతు భూమారెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు స్పష్టం చేశారు. మంగళవారం నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గాంధీగంజ్‌లో రైతులకు భరోసా కల్పించేందుకు కేటీఆర్ వచ్చారు. ఈ సందర్భంగా ముందుగా గాంధీగంజ్‌లో సోయా కొనుగోళ్ల తీరును పరిశీలించారు. అక్కడే ఉన్న రైతు భూమారెడ్డితో కేటీఆర్ మాట్లాడారు. ఈయనతోపాటు బీఆర్ఎస్ ముథోల్ నియోజకవర్గ సమన్వయ సమితి సభ్యులు విలాస్ గాదేవార్, పడకంటి రమాదేవి, కిరణ్ కొమ్రేవార్ ఉన్నారు.
సోన్, నవంబర్ 18 : నిర్మల్ జిల్లా భైంసాలో రైతుల సమస్యలు తెలుసుకొనేందుకు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, యువనేత కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) కు మంగళవారం ఉదయం సోన్ మండలంలోని గంజాల్ టోల్ ప్లాజా వద్ద నాయకులు స్వాగతం పలికారు. టపాసులు పేల్చి పూల మొక్కను అందించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ నియోజకవర్గ సమన్వయకర్త రాంకిషన్‌రెడ్డి, ఖానాపూర్ ఇన్చార్జి జాన్సన్‌నాయక్, నిర్మల్ పట్టణాధ్యక్షులు మారుగొండ రాము, సీనియర్ నాయకులు డా క్టర్ సుభాష్‌రావు, భూషన్‌రెడ్డి, ముత్యంరెడ్డి, నిర్మల్, లక్ష్మణచాంద మం డలాల కన్వీనర్లు మహేశ్‌రెడ్డి, కృష్ణారెడ్డి, సురేష్‌యాదవ్ పాల్గొన్నారు.

ఆదిలాబాద్, నవంబర్ 18(నమస్తే తెలంగాణ) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు కష్టపడి సాగు చేసిన పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేయడానికి షరతులు విధిస్తూ ఇబ్బందులు పెడుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న మండిపడ్డారు. మంగళవారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో నిర్వహించిన రైతులతో ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. సీసీఐ కపాస్ కిసాన్ యాప్‌లో పత్తి అమ్ముకొనే అవకాశం లేకపోవడంతో జైనథ్ మండలానికి చెందిన రైతు తిరుపతి, ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పొచ్చెర రైతు సురేశ్‌లు పత్తి పంట కాలిపోయిందన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో అధిక వర్షాలు, ఎనిమిది డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతల కారణంగా పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుందని తేమ నిబంధనలు సడలించాలన్నారు. సోయా పంటతో చెత్తా, చెదారం ఉందని మార్క్‌ఫెడ్ కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు రైతుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని తెలిపారు. ఈ నెల 21 న ఆదిలాబాద్ జిల్లా భోరజ్ వద్ద జాతీయ రహాదారి పై ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కుభీర్, నవంబర్ 18 : పదేండ్ల కేసీఆర్ పాలనలో ఏనాడూ రైతులను కష్టపెట్టలేదు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగో లు చేసిండ్రు. గీ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి మాకు కష్టాలు మొదలైనయి. వర్షాలు పడి పంట లన్నీ నష్టపోతే ఒక్క రూపాయి పరిహారం ఇవ్వలే దు. ఇక ఉన్న దిగుబడులనైనా అమ్ముకుందా మంటే ఏవేవో కొర్రీలు పెట్టి తిప్పల పెడుతున్న రు. ఇక పత్తికైతే పెద్దఫోన్ కావాలంటున్నరు. తేమ శాతం 8 ఉండాలంటు న్నరు. ఎకరాకు ఏడు క్వింటాళ్లు మాత్రమే జోకుతున్నరు. గీళ్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మమ్ముల నట్టేట ముంచుతున్నరు.
– దనరి భోజన్న, రైతు, బోరిగాం
కుభీర్, నవంబర్ 18 : రైతుల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా వెంటనే పత్తి, సోయాను మద్దతు ధరకు కొనాలి. ఎలాంటి షరతులు పెట్టద్దు. కపట ప్రేమ ఒలక బోస్తూ మళ్లీ నమ్మించే ప్రయత్నం చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బొందపెట్టడం ఖాయం. వర్షాలకు నష్టపో యిన రైతులను సర్కారు ఆదుకోవాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ రైతులకు ఇచ్చిన భరోసా కొండంత ఊరట నిచ్చింది.
– గాయక్వాడ్ తుకారాం, రైతు, పార్డి(బీ)
కుభీర్, నవంబర్ 18 : తెలంగాణ వచ్చి కేసీఆర్ సీఎం అయినంక మా బతుకులు మారినయి. అన్నితీర్ల మమ్ముల చూసుకున్నడు. వ్యవసా యానికి ఉచిత కరెంటు, రైతుబం ధు ఇచ్చిండు. ఎవరైనా రైతు చనిపోతే వాళ్ల కుటుంబానికి రూ. రూ.5 లక్షలిచ్చి ఆదుకున్నడు. పంటలన్నీ మద్దతు ధరకు కొన్నడు. మళ్లీ కేసీఆరే వస్తేనే మంచిగుంటది. గీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత సేపూ మాకు గోస తప్పదు.
– కుర్మ చిన్నన్న, రైతు, బోరిగాం
కుభీర్, నవంబర్ 18 : గీ కాంగ్రెసోళ్లు రైతులకు సుక్కలు చూపిస్తున్నరు. ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్న రేవంత్‌రెడ్డికి మా ఉసురు కచ్చి తంగా తగులుతుంది. ఇగ ఇప్పటికే రెండేండ్లు గడిచినయి. మూడేండ్లు అయితే గీ గవర్నమెం ట్ పోతది. మళ్లా కేసీఆర్ సర్కారే వస్తది. ఇది రాసి పెట్టు కోండి. కేసీఆర్ రైతులకు ధైర్యం చెబుతున్నడు. పంటల ను బేషరతుగా కొనాలని, లేదంటే ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తామని చెబుతున్నడు.
– ఉల్చ సాయినాథ్, రైతు, కుప్టి