నార్నూర్, ఏప్రిల్ 24 : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని కొత్తపల్లి(హెచ్) గ్రామ పంచాయతీ ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. ఈ పంచాయతీలో 312 కుటుంబాలు ఉండగా.. 1,150 జనాభా ఉన్నది. సమైక్య రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న గ్రామం.. తెలంగాణ సర్కారు హయాంలో సకల సౌకర్యాలతో మెరుగైన స్థాయిలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతో సదుపాయాలు కల్పిస్తున్నది. గ్రామానికి నెలకు రూ.1.70 లక్షలు మంజూరవుతుండగా.. పంచాయతీ రూపురేఖలు మారిపోయాయి. రూ.15 లక్షలతో 300 మీటర్ల సీసీ రోడ్డు, రూ.2.80 లక్షలతో పల్లె ప్రకృతివనం, రూ.60 వేలతో నర్సరీ, రూ.2.60 లక్షలతో సెగ్రిగేషన్ షెడ్డు, డంపింగ్యార్డు నిర్మించారు.
తడి-పొడి చెత్త సేకరణకు ఇంటింటికీ రెండు బుట్టలు పంపిణీ చేశారు. సేకరించిన చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేసి మొక్కలకు వాడుతున్నారు. రూ.13 లక్షలతో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ను కొనుగోలు చేశారు. రూ.5 లక్షలతో డ్రైనేజీ, రూ.36 వేలతో ఇంకుడు గుంతలు, మన ఊరు-మన బడి కింద బడిలో రూ.21 లక్షలతో వసతులు, రూ.10 లక్షలతో కమ్యూనిటీ షెడ్డు, రూ.10 లక్షలతో గ్రావెల్ రోడ్డు, రూ.20 లక్షలతో మిషన్ భగీరథ పథకం కింద నీటి ట్యాంకులు, రూ.2 లక్షలతో ముఖద్వారం, రూ.లక్షతో నీటితొట్టెలు, రూ.5 లక్షలతో కొలాంగూడలో అంగన్వాడీ భవనం నిర్మాణం చేపట్టారు. గతంలో ఎన్నడు లేని అభివృద్ధిని కళ్ల ముందే కనిపిస్తుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అభివృద్ధి పనులు కనిపిస్తున్నాయి..
పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నారు. ప్రజల సమస్యలను సర్పంచ్ రాథోడ్ సుభద్రబాయి పరిష్కరిస్తున్నారు. పారిశుధ్య పనులు చేసి గ్రామాల్లో శుభ్రత పాటిస్తున్నారు. పంచాయతీ పరిధిలోని అన్ని విధాల అభివృద్ధిని దశలవారీగా చేపడుతున్నారు.
-కే.తెలంగ్రావ్, ఉప సర్పంచ్, కొత్తపల్లి
అభివృద్ధి చేస్తా..
పంచాయతీ అభివృద్ధి సాధించేందుకు నా వంతు కృషి చేస్తా. ప్రజలందరూ అభివృద్ధికి సహకరిస్తున్నారు. ప్రభుత్వం అందించే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం. జిల్లా, మండల స్థాయి అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ ముందుకు సాగుతున్నాం. పంచాయతీ నిధులను అభివృద్ధికి సక్రమంగా వినియోగిస్తున్నాం.
– రాథోడ్ సుభద్రబాయి, సర్పంచ్, కొత్తపల్లి(హెచ్).
రూ.కోటితో అభివృద్ధి చేశాం..
ముఖ్యమంత్రి కేసీఆర్ పంచాయతీ వ్యవస్థతో ప్రజల ముంగిటకు పాలనను తీసుకొచ్చారు. అవినీతికి తావులేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. దీంతో పాటు అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నారు. 2014లో నుంచి నేటి వరకు సుమారు రూ.కోటి వరకు నిధులు మంజూరు చేయడంతో అభివృద్ధి పనులు చేపట్టారు.
– రాథోడ్ రామేశ్వర్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు.