కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలోని పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యనభ్యసిస్తున్న ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కోవలక్ష్మి, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జిల్లా రెవెన్యూ అధికారి సురేష్ తో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని, విద్యార్థుల రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, వైద్య సేవలు అవసరం ఉన్నవారిని వెంటనే ఆసుపత్రులకు తరలించడం జరుగుతుందని తెలిపారు.
ప్రతి మండలంలో మండల ప్రత్యేక అధికారి ఆయా పాఠశాలలు, వసతి గృహాలలో విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించి నివేదిక అందించాలని ఆదేశించారు. విద్యాశాఖ, వైద్య ఆరోగ్యశాఖలో సమన్వయం చేసుకుంటూ పరీక్షలు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలలలో 25 వేల మంది విద్యార్థులు ఉన్నారని, మూడు రోజులపాటు వైద్య శిబిరాలు నిర్వహించి పరీక్షలు జరపాలని అధికారులను ఆదేశించారు.
విద్యార్థుల హాజరు, బోధన, బోధ నేతర సిబ్బంది ఇతరత్రా వివరాలను జిల్లా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. మూత్రశాలలు, వంటగది, భోజనశాల పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
విద్యార్థులకు అందించే మెనూ నోటీసు బోర్డులో ఉంచాలని, మెనూ ప్రకారంగా భోజనం అందించాలన్నారు. సంబంధిత వార్డెన్లు స్థానికంగా ఉండాలని, ఆర్. ఓ. ప్లాంటును వినియోగంలో ఉంచాలని తెలిపారు.