“అభివృద్ధే మా ఆయుధం.. సంక్షేమమే మా నినాదాం..ఈ రెండింటినీ అమలు చేస్తూ దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తున్నాం. వందల కోట్లతో అభివృద్ధి పనులు చేశాం. ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటింటికీ చేరుస్తున్నాం. మంచిర్యాల జిల్లా ఏర్పాటు అనేది కాంగ్రెస్, టీడీపీ పాలనలో సాధ్యం కాలేదు. సీఎం కేసీఆర్ మాత్రమే జిల్లా కలను సాకారం చేసినందుకు ధన్యవాదాలు. జిల్లాకు మెడికల్, నర్సింగ్ కాలేజీలను మంజూరు చేయించాం. ఇంజినీరింగ్, బీఈడీ కాలేజీల ఏర్పాటునకు కృషి చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను త్వరలోనే ప్రారంభించు కోనున్నాం. కాళేశ్వరం జిల్లావాసుల దాహాన్ని తీరుస్తు న్నది. ముంపునకు గురయ్యే ప్రాంతాల గురించి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తా. పార్టీలో అసంతృప్తులు ఉండడం సహజం. వారందరితో మాట్లాడతా. కలిసి ముందుకు సాగుతామని చెబుతా. ప్రజలకు చివరగా ఒక్కటి చెబుతున్నా. అక్రమ మార్గంలో సంపాదించిన సొమ్ముతో ప్రతిపక్ష నాయకులు వస్తే తీసుకోవద్దు. తర్వాత గోసపడొద్దు.’ అని మంచిర్యాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దివాకర్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
– మంచిర్యాల టౌన్, ఆగస్టు 24
మంచిర్యాల టౌన్, ఆగస్టు 24 : ‘తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జిల్లా ప్రగతి పథంలో పయనిస్తోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్షాలు జంకుతున్నాయి. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నన్ను మంచిర్యాల అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి సీఎం కేసీఆర్ ప్రకటించడం ఆనందంగా ఉంది. మంచిర్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించా. ప్రజలు, కార్యకర్తలే మా బలం. ఈసారి కూడా కచ్ఛితంగా బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టలేదు. కాంగ్రెస్ నాయకుల చేష్టతో జనం విస్తుబోయి ఉన్నారు. మంచిర్యాల ప్రశాంతంగా ఉండాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలి. మంచిర్యాల అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నా’ అని మంచిర్యాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
నమస్తే : మంచిర్యాల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏమిటీ?
ఎమ్మెల్యే దివాకర్‌రావు : రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఎల్లంపల్లి ప్రాజెక్టు, రాయపట్నం వంతెనను ఆరు నెలల్లోనే నిర్మించుకుని ప్రారంభించుకున్నాం. గూడెం లిఫ్టు ఇరిగేషన్ పనులు పూర్తిచేసి, కరెంటు సబ్‌స్టేషన్‌ను నిర్మించుకుని రెండు పంటలకు నీరందించుకోగలుగుతున్నాం. నియోజకవర్గంలో సింగిల్‌గా ఉన్న రోడ్లను వెడల్పు చేయడానికి రూ.కోట్లు వెచ్చించాం. కొత్తగా మున్సిపాలిటీలను ఏర్పాటు చేసుకున్నాం. మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణం పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. పట్టణాలు, గ్రామాల్లో రోడ్లు, మురికి కాలువలు నిర్మిస్తున్నాం. ఓపెన్ జిమ్‌లు, పార్కులు, స్టేడియాలు, ప్రకృతివనాలు, వైకుంఠధామాలు, పీహెచ్‌సీలను అన్ని పట్టణాలు, గ్రామాల్లో ఏర్పాటు చేసుకున్నాం. మంచిర్యాలలో రూ.14 కోట్లు వెచ్చించి బైపాస్ రోడ్డు నిర్మించాం. రూ.15 కోట్లతో అంతర్గత రహదారులను వెడల్పు చేస్తున్నాం. రూ.60 కోట్లతో జంక్షన్స్ అభివృద్ధి చేస్తున్నాం. మంచిర్యాల-అంతర్గాం మధ్య గోదావరిపై రూ.164 కోట్లతో వంతెన నిర్మిస్తున్నాం. మంచిర్యాలలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలు చేపడుతాం. లక్ష్మీ టాకీసు నుంచి గోపాల్‌వాడ వరకు కొత్త ఆర్వోబీ నిర్మాణానికి రైల్వేశాఖకు ప్రతిపాదనలు పంపిస్తున్నాం.
నమస్తే : జిల్లా ఏర్పాటులో మీ పాత్ర ఏమిటీ?
ఎమ్మెల్యే : దాదాపు 50 ఏండ్ల క్రితమే మంచిర్యాలను జిల్లాగా చేయాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. మంచిర్యాలలో పర్యటించిన సందర్భంలో ఎన్టీఆర్, 1998 సంవత్సరంలో శ్రీరాంపూర్‌లో పర్యటించినపుడు చంద్రబాబు నాయుడు జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న నేను అసెంబ్లీలో మంచిర్యాల జిల్లా ఏర్పాటు ప్రస్తావన తీసుకొచ్చా. సీఎం కేసీఆర్ సారథ్యంలోనే జిల్లా ఏర్పాటు సాకారమైంది. జిల్లాల ఏర్పాటు జాబితాలో మొదట మంచిర్యాల పేరే ఉండడం సంతోషమనిపించింది.
నమస్తే : విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ఏ రకంగా కృషి చేస్తున్నారు?
ఎమ్మెల్యే : మంచిర్యాలలో మెడికల్ కాలేజీ ఏర్పాటు అనేది చరిత్రాత్మకమైది. చాలా ఏండ్లుగా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. రాష్ట్రంలో ఏడు కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోగా.. ఇందులో మొదటి స్థానం మంచిర్యాలకే దక్కింది. త్వరలోనే గుడిపేటలో శాశ్వత కాలేజీ భవనాన్ని నిర్మించుకోబోతున్నాం. దీనికి తోడు నర్సింగ్ కాలేజీని మంజూరు చేయించుకున్నాం. ఇంకా.. ఇంజినీరింగ్, బీఈడీ కాలేజీల ఏర్పాటునకు కృషి చేస్తున్నా. ఇప్పటికే మోడల్ స్కూళ్లు, కాలేజీలు, గురుకులం, కస్తూర్బా పాఠశాలలు, లక్షెట్టిపేటలో డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేసుకున్నాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను త్వరలోనే ప్రారంభించుకోనున్నాం.
నమస్తే : కాళేశ్వరంతో మనకు ప్రయోజనం ఏమిటీ?
ఎమ్మెల్యే : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించక ముందు గోదావరి ఎండాకాలంలో ఎండిపోయేది. గోదావరిపై ఆధారపడ్డ పట్టణ, గ్రామాల ప్రజలు తాగునీటికి అవస్థలు పడేది. రెండు, మూడు రోజులకోసారి నీటి సరఫరా జరిగేది. కానీ.. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యాక గోదావరి నిండుగా ప్రవహిస్తోంది. మున్సిపాలిటీలతోపాటు గ్రామాలకు తాగునీటి సమస్య తీరింది. మంచిర్యాల పట్టణంతోపాటు నస్పూర్, తదితర ప్రాంతాలు వర్షాకాలంలో ముంపునకు గురవుతున్నాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తా. మంచిర్యాల వద్ద గోదావరితోపాటు రాళ్లవాగుకు ఇరుపక్కలా కరకట్టలు నిర్మిస్తాం. ఇండ్లలోకి వరద నీరు రాకుండా చర్యలు చేపడుతాం.
నమస్తే : మీరు ఉద్యోగాలు ఇప్పించారని విన్నాం. ఎంత మందికి ఇప్పించారు?
ఎమ్మెల్యే : 1978లో 60 మందికి సింగరేణి ఉద్యోగాలు ఇప్పించా. 1000 మంది వరకు వివిధ ఉద్యోగాల్లో చేర్పించా. దేవాపూర్ సిమెంట్ కంపెనీ 20 మంది కార్మికుల ఉద్యోగాల విషయంలో కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఒక విషయంలో కంపెనీ యాజమాన్యం నా సాయం కోరింది. అయితే తొలిగించిన 20 మందిని విధుల్లోకి తీసుకుంటే పనిచేసి పెడతానని చెప్పడంతో కేవలం మూడు రోజుల్లో వారిని కంపెనీ విధుల్లోకి తీసుకుంది. నియోజకవర్గంలో దాదాపు రేషన్ డీలర్లందరినీ నేనే నియమించా. వ్యాపారస్థులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటున్నా. ఏ నాడు ఎవరి నుంచి ఏమి ఆశించలేదు.
నమస్తే : అసంతృప్తులకు ఎలా బుజ్జగిస్తారు?
ఎమ్మెల్యే : అసంతృప్తులందరినీ పిలిపించి మాట్లాడుతా. చాలా మంది ఎమ్మెల్యే సీటును ఆశించారు. కానీ.. అధిష్టానం అన్ని రకాల సర్వేలు చేసుకున్నాకే టికెట్ ఇచ్చింది. ఈ విషయాన్ని చెప్పి ముందు ముందు తగిన స్థానం కల్పిస్తామని కోరుతా. కొందరు చిన్న చిన్న విషయాలను దృష్టిలో ఉంచుకుని పార్టీకి దూరంగా ఉంటున్నారు. అలాంటి వారితో కూడా మాట్లాడుతా. పదవులు అందరూ ఆశిస్తారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. అందరితో సమన్వయం చేసుకుని, గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతా. పార్టీ విధేయులుగా ఉన్న వారికి మంచి అవకాశాలు ఉంటాయి.
నమస్తే : ప్రజలకు ఏం చెబుతారు?
ఎమ్మెల్యే : భూములు, విద్యుత్, నీరు, పరిశ్రమల అనుమతులు, విద్య, ఉపాధి, వైద్య రంగాల్లో జరిగిన అభివృద్ధిని చూసి ఓటేయాలని అభ్యర్థిస్తా. ప్రతిపక్ష నాయకులు అధికారంలోకి రావడానికి అనేక వాగ్దానాలు చేస్తుంటారు. వాళ్లు ఇచ్చే కానుకలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ప్రజలు గమనించాలి. అక్రమ మార్గంలో సంపాదించిన సొమ్ముతో ఇచ్చే కానుకలు మంచిది కాదు. అప్పుల ఎగవేత, రౌడీయిజం, గూండాయిజం, భూకబ్జాలు, సెటిల్మెంట్లు, పత్తాలాట క్లబ్ ద్వారా వచ్చిన సొమ్మును ప్రజలకు పంచి, మంచి వాళ్లలా నటించాలనుకునే వాళ్లకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి.