ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ (Asifabad) మండలంలో భారీ వర్షం దంచికొట్టింది. దీంతో గుండి పెద్దవాగుపై ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. ఈ క్రమంలో వంతెనపైనుంచి వెళ్తున్న ఆటో వరద ఉధృతికి కొట్టుకుపోయింది. అదృష్టవశాత్తు ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పింది. వంతెన కొట్టుకపోవడంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి.
ప్రతి వానాకాలంలో ఇదే పరిస్థితి ఉంటున్నదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా గుండి వాగుపై వంతెన మాత్రం ఏండ్లుగా అసంపూర్తిగానే ఉంటుందన్నారు. ఈ వానాకాలంలోనైనా వంతెన పూర్తవుతుంది అనుకుంటే అది కలగానే మిగిలిపోయేల ఉందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిన వంతెన నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.