ఆసిఫాబాద్ అంబేద్కర్‌చౌక్, ఫిబ్రవరి 11 : తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరేమోనని ఓ మైనర్ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చోర్పల్లిలో జరిగింది. చోర్‌పల్లికి చెందిన బాలుడు (18), అదే గ్రామానికి చెందిన తమ బంధువులైన బాలిక (17) ఏడాదిగా ప్రేమించుకుంటున్నా రు. ఇద్దరు మైనర్లు కావడంతో తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకుంటా రో.. లేదోనని మనస్తాపం చెందారు. గురువారం రాత్రి తమ ఇళ్ల సమీపంలోని పెరట్లో ఇద్దరూ పురుగుల మందు తాగారు. అనంతరం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని వేర్వేరు వాహనాల్లో ఆసిఫాబాద్‌లోని ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా అబ్బాయి మార్గమధ్యంలో మృతిచెందాడు. ఆసిఫాబాద్‌లో అమ్మాకికి ప్రథమ చికిత్స అందించి 108లో మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి శుక్రవారం తెల్లవారు జామున మరణించింది. ఇరువురు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో అశోక్ తెలిపారు.