జైనథ్, డిసెంబర్ 12 : ఆరు గ్యారెంటీలపై ఉదయం 6 గంటలకే సంతకం చేస్తానని మాట తప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసంపై ప్రజలు మేల్కొని నిలదీయాలని మాజీమంత్రి జోగు రామన్న డప్పుకొట్టి దండోరా వేస్తూ ప్రచారం చేశారు. శుక్రవారం ఉదయం జైనథ్ మండలం కేంద్రంలో అభ్యర్థి లక్ష్మి, గణేశ్ యాదవ్ గెలిపించాలని ప్రచారం చేశారు. అంతకుముందు జైనథ్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజినీరింగ్ కాలేజ్, బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్, సీసీఐ పునరుద్ధరణ, రైతు సమస్యలను ఆదిలాబాద్‌కు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రస్తావించకపోవడం జిల్లా అభివృద్ధిని అడ్డుకోవడమే అవుతుందన్నారు.
ఆరు గ్యారెంటీలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి సీఎంను పొగడ్తలతో ముంచేయడం స్వలాభం కోసమేనా ? అని ప్రశ్నించారు. అధికార పార్టీతోనే అభివృద్ధి పనులు జరుతాయంటూ ఓటర్లను మాటలతో మభ్యపెడుతున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. యారియా కోసం, సోయా, పత్తి, కందుల కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ పోరాడిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేవరకూ పోరాడుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్.లింగారెడ్డి, మెట్టు ప్రహ్లాద్, లచ్చిరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎదులాపురం, డిసెంబర్12: బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ రూరల్, మావల మండల కేంద్రాల్లో ప్రచారంలో పాల్గొన్నారు. మావలలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి వై.సుధీర్‌ను గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేశారు. స్థానికంగా నెలకొన్న సమస్యలపై బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.