అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయాల్లో సీఎం రేవంత్‌రెడ్డి రైతులకిచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా దాటవేత ధోరణి అవలంబిస్తుండడంపై రైతన్నలు భగ్గుమన్నారు. ప్రధానంగా ధాన్యానికి బోనస్ విషయంలో రేవంత్ మాట మార్చడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోనస్ సన్నవడ్లకే ఇస్తామని, రైతులు అధికంగా పండించే దొడ్డురకం ధాన్యానికి ఇవ్వబోమంటూ రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనపై రైతులు నిరసన బాట పట్టారు. రైతుల ఆందోళనలకు బీఆర్ఎస్ పార్టీ బాసటగా నిలిచింది. ఇందులో భాగంగానే రైతులకు మద్దతుగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగాయి. రైతులు, గులాబీ శ్రేణులు వడ్ల గింజలతో నిరసన తెలిపారు. రహదారులపై రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. అధికారులకు వినతిపత్రాలు కూడా అందించారు.
ఆదిలాబాద్/నిర్మల్, మే 16(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, మాజీ ఎమ్మెల్యే ఆ త్రం సక్కు, రైతులు, గులాబీ శ్రేణులతో కలిసి మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చక రేవంత్ రైతులను మో సం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.500 బోనస్ చెల్లించి వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఐదు నెలల కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా మారిందని, రై తులు కష్టపడి పండించిన పంటలను కొనుగోలు చేయడంలో ప్ర భుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నదాతలు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో రుణమాఫీ విషయంలో దేవుళ్లపై ఓట్లు పెట్టుకుంటూ రైతులను మభ్యపెట్టే ప్రయత్నాలు చేశారన్నారు. రాష్ట్రంలో 90 శాతం రైతులు దోడ్డు వడ్లను పండిస్తారని, కేవలం 10 శాతం మంది సన్నాలను పండిస్తారన్నారు. సన్న వడ్లు పండించే 10 శాతం మంది రైతులకు మాత్రమే రూ.500 బోనస్ చెల్లిస్తామని సీఎం ప్రకటించడం వారిని దగా చేయడమే అని తెలిపారు. రైతులకు న్యాయం జరిగింత వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు రోకండ్ల రమేశ్, అజయ్, సాజిదొద్దీన్, వేణుగోపాల్, మార్సెట్టి గోవర్ధన్, లింగారెడ్డి, రాంకుమార్, పర్వీన్ పాల్గొన్నారు. కాగా.. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు బోథ్ తహసీల్దార్ సుభాష్చందర్కు గులాబీ శ్రేణులు వినతి పత్రం సమర్పించాయి.
ఖానాపూర్ పట్టణంలో నిర్మల్-ఖానాపూర్-జగిత్యాల ప్రధాన ర హదారిపై తెలంగాణ తల్లి చౌరస్తాలో నిర్వహించిన ధర్నా, రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు గంట పాటు రాకపోకలు స్తంభించాయి. భైంసా పట్టణంలో పార్టీ నాయకులు విలాస్ గాదేవార్ ఆధ్వర్యంలో నిరసనకు తెలిపి, ఆర్డీవో కోమల్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆ పార్టీ పట్టణాధ్యక్షుడు రాము ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట ప్ర ధాన రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రై తులు మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి రైతులందరిని మోసం చేశారని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఇష్టానుసారంగా హామీలిచ్చి, అధికారం చేపట్టిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. ముఖ్యంగా రుణమాఫీ, రైతు భరోసా విషయంలో ప్రభుత్వం కనీస స్థాయిలో స్పందించలేదన్నారు. యాసంగి దిగుబడులు చేతికొచ్చి నెల రోజులవుతున్నా క ల్లాల్లోనే ధాన్యం నిల్వలు పేరుకుపోయాయని, సకాలంలో కొనుగోళ్లు చేపట్టకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా.. ఎంపీ ఎన్నికలు కాగానే బోనస్‌పై కూడా మాట మార్చాడని మండిపడ్డారు. నిన్న మొన్నటి వరకు ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని, ఇప్పుడు తిరకాసులు పెడుతూ కేవలం సన్న రకం ధాన్యానికి బోనస్ ఇస్తామని, దొడ్డు రకాలకు ఇవ్వమని ప్రకటించడం దారుణమన్నారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని పూటకో మాట మారిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. కాగా జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నాయి.