ఆదిలాబాద్, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. యేడాది గడిచినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని తెలిపారు.
రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, రైతు కూలీలకు ఆర్థిక సాయం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు సంక్రాంతి అంటూ మరోసారి ముహూర్తం నిర్ణయించారని తెలిపారు. ఈ లోగా ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశలుండగా.. కోడ్ పేరిట తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే రైతులకు రెండు విడుతలుగా రైతు భరోసా ఎగ్గొట్టిన ప్రభుత్వం, రుణమాఫీ విషయంలో అన్నదాతలకు అన్యాయం చేసిందన్నారు. ముఖ్యమంత్రి చెప్పిన విధంగా రాష్ట్రంలో ఇప్పటికే 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరుగగా.. ఇంకా 11 లక్షల మంది రైతుల బ్యాంక్ లోన్లు రద్దు కాలేదని తెలిపారు.
రూ.2 లక్షల రుణమాఫీకి సంబంధించి బీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లో సర్వే చేస్తున్నారని, ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగిందనే విషయాలను తెలుసుకుంటున్నారన్నారు. నాలుగో విడుతలో జిల్లాలో 6,600 మందికి రుణమాఫీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించినా.. ఇప్పటి వరకు డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదని తెలిపారు. జిల్లాలో చాలా మంది రూ.2 లక్షల రుణమాఫీకి అర్హులుగా ఉన్నారని, వారి వివరాలు సేకరించి కలెక్టర్, ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. జిల్లాలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ఇన్చార్జి మంత్రి సీతక్క, వ్యవసాయ శాఖ మంత్రి తమ్మల నాగేశ్వర్రావులు గ్రామాల్లో పర్యటించాలని సూచించారు.
ప్రభుత్వం అర్హులైన రైతులకు రుణమాఫీ చేయకపోతే మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో రైతులతో కలిసి ఆందోళన చేస్తామని తెలిపారు. జిల్లాలో పంటల కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందన్నారు. జిల్లాలో సోయాబిన్ కొనుగోళ్లు నిలిచిపోయాయన్నారు. రైతుల వద్ద ఇంకా 2 లక్షల క్వింటాళ్ల పంట ఉత్పత్తుల నిల్వలు ఉన్నాయని, ప్రైవేటు వ్యాపారులకు పంటను విక్రయించి నష్టపోతున్నారన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు సాజిదొద్దీన్, సెవ్వ జగదీశ్, విజ్జిగిరి నారాయణ, రాజన్న, గండ్రత్ రమేశ్, కుమ్ర రాజు, పరమేశ్వర్, గంగయ్య, బట్టు సతీశ్, ఉగ్గే విఠల్, దయాకర్, తదితరులు పాల్గొన్నారు.