ఎదులాపురం , ఏప్రిల్ 18: బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో జోగు రామన్న స్వయంగా పెయింటింగ్ వేసి సభ విజయవంతం చేయాలని ప్రచారం చేశారు. ఈ నెల 27న వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ప్రతి ఒకరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమ నాయకుడు కేసీఆర్ సాధించారని తెలిపారు. సమైక్య రాష్ట్ర పాలనలో తెలంగాణకు నిధుల కేటాయింపు, అభివృద్ధి పనుల్లో ప్రాధాన్యం దక్కేది కాదన్నారు.
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత విద్యా, ఉద్యోగం వైద్యం, పారిశ్రామిక, వ్యవసాయం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండేలా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్యూహాత్మకంగా, ముందుచూపుతో కృషి చేశారని గుర్తు చేశారు. రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, లాంటి మహోన్నతమైన పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచారన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, ప్రతిష్టను దెబ్బ తీసే ప్రయత్నంలో కాంగ్రెస్ మోసపూరిత పాలన కొనసాగిస్తుందన్నారు. ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ బీసీ పట్టణ అధ్యక్షుడు దాసరి రమేశ్, నాయకులు ఇజ్జగిరి నారాయణ, అలాల అజయ్, పండ్ల శ్రీనివాస్, గండ్రత్ రమేశ్, సంతోష్, నర్సాగౌడ్, ఉగ్గే విఠల్, కుమ్ర రాజు, అశోక్, వినోద్, రాహుల్, తదితరులు పాల్గొన్నారు, సభకు పెద్ద సంఖ్యలో తరలిరావాలి.
భైంసా, ఏప్రిల్, 18 : ఈ నెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ముథోల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయ సమితి సభ్యుడు విలాస్ గాదేవార్ అన్నారు. శుక్రవారం భైంసా పట్టణంలో వాల్ పెయింటింగ్ వేసి ప్రచారం చేశారు. తెలంగాణకు మళ్లీ మంచి రోజులు రావాలంటే కేసీఆర్ రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేశ్, సురేశ్, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.