ఆదిలాబాద్ : జాతీయ రహదారి 363 పై ప్రమాదాలు జరగడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కారణమని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. బుధవారం బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లాలోని నేషనల్ హైవే 363 రెండేళ్ల పూర్తి కావాల్సి ఉన్న పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందని తెలిపారు. జైనథ్ మండలం ధర్నం వద్ద ఇటీవల రూ. 4.5 కోట్లతో నిర్మించిన వంతెన ప్రమాదాలకు కారణం అవుతుందని తెలిపారు.
మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి జైనత్ మండలం లక్ష్మీపూర్‌కు చెందిన దత్తు అనే యువకుడు మోటర్ సైకిల్ పై వంతెన దాటుతుండగా గల్లంతయినట్టు తెలిపారు. పాత వంతెన ద్విచక్ర వాహనదారులు ప్రయాణించడానికి అనుకూలంగా ఉండగా ఇటీవల నేషనల్ హైవే అధికారులు వంతెనను కూల్చివేసినట్లు తెలిపారు. రహదారి నిర్మాణం పనులు పర్యవేక్షణలో అధికారులు విఫలమయ్యారని నాణ్యత లోపించిందని విమర్శించారు.