మంచిర్యాల, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చెన్నూర్‌లోని శనిగకుంట మత్తడి పేల్చివేత కేసు ‘హస్తం’ నేతలను చుట్టుముడుతున్నది. ఈ ఘటనలో కాంగ్రెస్ లీడర్ల అరెస్టు దాదాపు ఖాయమైనట్లే తెలుస్తున్నది. ఎవరు చేసిన పాపానికి వారే శిక్ష అనుభవించక తప్పదన్నట్లు.. మత్తడి పేల్చివేత కేసులో కీలక సూత్రధారులుగా ఉన్న అధికార పార్టీ లీడర్లు, రియల్ఎస్టేట్ వ్యాపారులు కటకటాల పాలు కానున్నట్లు స్పష్టమవుతున్నది.
ఈ కేసులో స్థానిక కౌన్సిలర్ భర్త పెండ్యాల లక్ష్మణ్ సహా మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసినప్పటికీ… హస్తం పార్టీ నాయకులే ఈ వ్యవహారంలో కీలకమంటూ ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలను ప్రచురించింది. అసలైన వ్యక్తులను వదిలి.. అమాయకులను పట్టుకున్నారని స్పష్టం చేసింది. అరెస్టు చేసిన వారి విచారణలోనూ ఇదే తేటతెల్లం కావడంతో కాంగ్రెస్ కీలక నాయకులైన గొడిసెల బాపురెడ్డి, పెద్దింటి శ్రీనివాస్, లక్కం రాజబాబును శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేశారు.
శనిగకుంట బఫర్‌జోన్‌లో మట్టిపోసిన 10 మందిని అరెస్టు చేయాలనుకున్నప్పటికీ ఈ ముగ్గురే దొరికారు. ఇక్కడే ఈ కేసు కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టింది. కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న షాడో ఎమ్మెల్యేగా చెప్పుకునే ఓ నాయకుడు వందల మంది అనుచరులతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. పోలీసులతో వాగ్వాదానికి దిగి.. వారిపై ఒత్తిడి తెచ్చి మరీ అరెస్టు చేసిన వారిని బయటికి తీసుకువచ్చాడు.
ఈ నేపథ్యంలో పోలీసుల వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తాయి. విచారణ కోసమే తీసుకువచ్చామంటూ పోలీసులు చెప్పినా.. షాడో ఎమ్మెల్యే ఒత్తిడితోనే వదిలేశారనే చర్చ నడిచింది. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ శనివారం ఉదయాన్నే మంచిర్యాలలో ఎమ్మెల్యే వివేక్‌ను కలిసి పరిస్థితిని వివరించినట్లు తెలిసింది. ఈ మేరకు త్వరలోనే కాంగ్రెస్ లీడర్లు సహా ఈ వ్యవహారంలో ప్రయేయమున్న ఇతర పార్టీల నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను అరెస్టు చేయడం ఖాయమైపోయిందని విశ్వసనీయ సమాచారం.
కేసు నుంచి తప్పించకుంటే రాజీనామాలు..
శనిగకుంట బ్లాస్టింగ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గొడిసెల బాపురెడ్డి, మరో నాయకుడు పెద్దింటి శ్రీనివాస్‌లను పోలీసులు అవమానకరమైన రీతిలో తీసుకెళ్లడంపై.. ఆ వర్గం లీడర్లు ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వారిని కూడబలుక్కున్న షాడో ఎమ్మెల్యే చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం జరిగిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కార్యక్రమాలను బహిష్కరించారు. ఈ మేరకు సదరు నాయకుడి ఇంట్లో సమావేశమైన లీడర్లు ఎమ్మెల్యే దిగివస్తే సరేనని.. లేకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని చర్చించుకున్నట్లు తెలిసింది.
శనిగకుంట కేసు నుంచి బయటపడేయాలని.. లేకపోతే రాజీనామాలు తప్పవని సదరు లీడర్లు ఎమ్మెల్యే వివేక్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఆ షాడో లీడరైతే చెన్నూర్, కోటపల్లి మండలంలోని తన అనుచరులకు ఫోన్లు చేసి మరీ ఎవరూ ఎమ్మెల్యే ప్రోగ్రామ్‌కు రావద్దంటూ హుకుం జారీ చేశారనే ప్రచారం జరుగుతున్నది. అందుకే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో నిర్వహించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, గృహలక్ష్మి ధ్రువీకరణ పత్రాల పంపిణీకి కీలక లీడర్లు ఎవరూ హాజరుకాలేదు. ఇది అక్కడ కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
కాగా, ఎమ్మెల్యే సాయంత్రం క్యాంప్ ఆఫీసు నుంచి బయటికి వచ్చి అధికారుల రివ్యూ మీటింగ్‌కు వెళ్తుండగా కొందరు కాంగ్రెస్ నాయకులు షాడో ఎమ్మెల్యే సహా శనిగకుంట కేసులో కీలక సూత్రధారులుగా ఉన్న లీడర్ల వద్దకు మీరు వెళ్లవద్దంటూ వేడుకున్నారు. మీరు అక్కడికిపోతే పరువుపోతుందని.. పార్టీ కోసం కష్టపడే నాయకులు ఉరేసుకోవాల్సి వస్తుందంటూ ఎమ్మెల్యేకు స్పష్టం చేశారు. దీంతో ఆయన మండల రివ్యూ మీటింగ్ చూసుకొని, నేరుగా వెళ్లిపోతానని.. తాను ఎవరి వద్దకు వెళ్లనని చెప్పినట్లు తెలిసింది.
ఎమ్మెల్యే వర్సెస్ షాడో ఎమ్మెల్యే
శనిగకుంట కేసులో ఎవరున్నా వదిలేది లేదని ఎమ్మెల్యే వివేక్ గతంలోనే చెప్పారు. ఇది ఆ కేసుతో ప్రమేయం ఉన్న కీలక కాంగ్రెస్ లీడర్లకు నచ్చడం లేదని ఈ రోజు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఎమ్మెల్యే వివేక్‌ను కాదని షాడో ఎమ్మెల్యే మిగిలిన వారందరినీ కలుపుకొని చెన్నూర్‌లో ఎమ్మెల్యే వివేక్ మీటింగ్ జరుగుతుండగానే, మరో మీటింగ్ ఏర్పాటు చేశారు. దీంతో ఈ కేసులో ఆ పార్టీ నాయకులను అరెస్టు చేస్తే అంతా కలిసి రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
అదే జరిగితే చెన్నూర్‌లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి కావడం ఖాయంగా కనిపిస్తున్నది. ఈ దెబ్బతో ఎవరికి వారు షాడో ఎమ్మెల్యేలుగా చెప్పుకునే వారంతా అధికార పార్టీకి దూరం అవుతారని, వారిని కాదని ఎమ్మెల్యే వివేక్ నియోజకవర్గంలో ఏం చేయలేరనే చర్చ నడుస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే వివేక్ వారికి లొంగిపోతారనే భయం క్షేత్రస్థాయి కాంగ్రెస్ శ్రేణుల్లో కనిపిస్తుంది.
అలాంటి వారిని వెనకేసుకొస్తే పార్టీ కోసం కష్టపడే వారు నొచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఎమ్మెల్యేను కాదని ఆయనకు వ్యతిరేకంగా కొట్లాడుతున్న వాళ్లు పార్టీకి రాజీనామా చేయడానికి ముందే పార్టీ నుంచి వారిని సస్పెండ్ చేయాలనే డిమాండ్ సైతం వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది.. ఎమ్మెల్యే ఏం నిర్ణయం తీసుకుంటారు.. అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. మొత్తానికి శనిగకుంటు కేసు కాంగ్రెస్ పార్టీని చుట్టుముట్టిందన్న చర్చ జోరుగా నడుస్తున్నది.