మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి పొర్లుతున్నాయి. గోదావరి, పెన్‌గంగ ఉగ్రరూపం దాల్చాయి. ఎల్లంపల్లి, కుమ్రం భీం, వట్టివాగు ప్రాజెక్టుల గేట్లను ఎత్తారు. పెద్దఎత్తున నీరు దిగువకు పరుగులుపెడుతున్నది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది. పరీవాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు పర్యటించారు.
మంచిర్యాలటౌన్, సెప్టెంబర్ 2 : ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని వదలడంతో గోదావరి నిండుగా ప్రవహిస్తున్నది. పుష్కరఘాట్ ప్లాట్‌ఫాంలు మునిగిపోయాయి. దీంతోపాటు రాళ్లవాగు ప్రవాహం కూడా పెరిగింది. రంగంపేట కాజ్వే పైనుంచి నీరు ప్రవహించింది. దీంతో ఎన్టీఆర్నగర్లోకి వరదనీరు వచ్చిచేరింది. నాలుగు ఇళ్లలోకి నీరువచ్చింది. ఆ కుటుంబాలను భవన నిర్మాణ సంఘం భవనంలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. ముందస్తు చర్యల్లో భాగంగా రాళ్లవాగు సమీప కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ఎన్టీఆర్నగర్, రాంనగర్, పద్మశాలీకాలనీ ప్రాంతాల ప్రజలు వరదలపై ఆందోళన చెందుతున్నారు. ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు పరిశీలించారు.
సీసీసీ నస్పూర్, సెప్టెంబర్ 2 : నస్పూర్ మున్సిపాలిటీ పరిధి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు పర్యటించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి కాలనీని వాడల్లో తిరిగారు. ప్రజల సమస్యలను అడిగితెలుసుకున్నారు. మున్సిపల్ చైర్మన్ సుర్మిళ్ల వేణు, కౌన్సిలర్లు, అధికారులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
జన్నారం, సెప్టెంబర్ 2 : పొనకల్ పంచాయతీప రిధి శ్రీలంక కాలనీకి వెళ్లే ప్రధాన రోడ్డు పై నుంచి వ రద ప్రవాహంతో ప్రజలు ఇబ్బందులు పండుతన్నా రు. ధర్మారం రోడ్డులో భారీ వర్షానికి ఇళ్ల చుట్టూ నీ రు నిలిచింది. రోటిగూడకు వె ళ్లే ప్రధాన రోడ్డు కల్వర్టుపై నుంచి వరద ప్రవాహంతో కొన్ని గంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి. పొనకల్‌లోని వాగు ఒడ్డున ఉన్న బుడగజంగాల కాలనీ ప్రజలను ఎంపీడీవో శశికళ కలిసి, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తపాలాపూర్, రోటిగూడ గ్రామాల్లో ప్రాతాల ను పరిశీలించారు. తహసీల్దార్ రాజమనోహర్‌రెడ్డి, ఎస్ఐ రాజవర్దన్, ఎంపీవో జలేందర్, కార్యదర్శులు రాహుల్, అర్ఐ బానుచందర్ ఉన్నారు. బుడుగజంగాల కాలనీ బాధితులకు మాజీ జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. మాజీ కోఆప్షన్ మున్వర్అలీఖాన్, మధుసూదన్‌రావు, రాజ్‌కుమార్, ఐద్వా నాయకురాలు విజయ ఉన్నారు.
చెన్నూర్, సెప్టెంబర్ 2 : చెన్నూర్ పట్టణం 7వ వార్డులోని వడ్డెపల్లి కాలనీకి వెళ్లే దారిలో కల్వర్టు తెగిపోయింది. కాలనీవాసుల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది తలెత్తింది. మున్సిపల్ అధికారులు మరమ్మతులు చేయించారు.ప ట్టణం సమీపంలోని గోదావరి ఉధృతంగా ప్రహిస్తున్నది.
భీమారం, సెప్టెంబర్ 2 : గొల్లవాగు నిండుకుండలా మారింది. మత్తడి దుంకింది. నాలుగు నెలల క్రితం చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ ఆలసత్వంతో సుద్దాల వాగుకు నీరు విడుదల చేయడంతో సాగునీరు వృథాగాపోయి, డెడ్ స్టోరేజీకి చేరింది. మండల రైతులతో పాటు, చెన్నూర్ ఆయకట్టు రైతులు సాగుకు నీరు అందక తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది. ఇప్పుడు నిండు కుండలా మారడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గొల్లవాగు కిందల సహజ సిద్ధంగా ఏర్పడిన వాటర్‌ఫాల్స్ చూపరులను ఆకట్టుకుంటున్నది. ప్రాజెక్టుతోపాటు, నర్సింగాపూర్, బూర్గుపల్లి మధ్యలో లోలెవల్ వంతెనను డీటీ కృష్ణ, జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్‌తో కలిసి తహసీల్దార్ సదానందం పరిశీలించారు.
తాండూర్, సెప్టెంబర్ 2 : మండలంలో కంది, పత్తి, వరి పంటలు పాక్షికంగా నీట మునిగాయి. అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోయపల్లిలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో డ్రైనేజీ నిర్మాణం లేక వర్షాలకు ఇళ్లలోకి నీరు వచ్చింది. ఎంపీడీవో శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ వీవీఆర్కేడీ ప్రసాద్, ఆర్ఐ అంజన్‌కుమార్ గ్రామాన్ని సందర్శించారు.
ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, సెప్టెంబర్ 2 : అడ, వట్టివాగు ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. అడ ప్రాజెక్ట్ ఐదు గేట్ల (3,4,5,6,7)ను 2 మీటర్లు ఎత్తి 14,860 క్యూసెకుల నీటిని దిగువకు విడుదల చేశారు. వట్టి వాగు ప్రాజెక్ట్‌లో 7,150 క్యూసెకుల నీరు వచ్చి చేరుతుండగా, 2, 5 నంబర్ గేట్లను 1.60 మీటర్లు, 3,4 గేట్ల ను. 2.0 మీటర్లు ఎత్తి 13,140 క్యూసెకుల నీటిని దిగువకు వదులుతున్నారు. అప్పపల్లి గ్రామానికి వెళ్లే దారిలో వాగు ఆదివారం రాత్రి నుంచి ఒప్పొంగిం ది. తాతాలిక వంతెన వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి.
తిర్యాణి, సెప్టెంబర్ 2 : మండలంలోని చెలిమెలవాగు ప్రాజెక్టు, డోల్పులవాగు ప్రాజెక్టు పూర్తిగా నిండింది. మత్తడి దుంకుతున్నాయి. గుండాల, చింతలమాధర జలపాతాలు పెద్ద ఎత్తున జలసవ్వడితో ఉప్పొంగాయి. రెండు రోజులపాటు సందర్శనను నిలిపివేసినట్లు ఈటీసీ చైర్మన్ తుంరం గోపాల్ తెలిపారు. కౌఠగాం, గుండాల, మంగీ, గోపెర, మొర్రిగూడ, అలీగూడ, లోహ తదితర గ్రామాల్లోని మట్టి రోడ్లన్నీ బురదమయంగా మారాయి.
వాంకిడి, సెప్టెంబర్ 2 : మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ రియాజ్ అలీ ఒక ప్రకటనలో తెలిపారు. వాగులు వంకలు, చెరువులకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. టోల్ ఫ్రీ 94924 81143, 63056 69406 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
దహెగాం, సెప్టెంబర్ 2 : కుమ్రం భీం, వట్టివాగు ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో పెద్దవాగుకు భారీగా వరద వచ్చింది. బ్యాక్‌వాటర్‌తో దహెగాం, కమ్మర్పల్లి, లగ్గాం, చౌక, ఎడ్డుగూడ, చిన్నరాస్పల్లి, గెర్రె, గిరివెల్లి, ఖర్జీ తదితర పంచాయతీల్లో వరి, పత్తి, మిరప పంటలు నీట మునిగాయి.
సిర్పూర్(టీ), సెప్టెంబర్ 2 : సిర్పూర్(టీ) మండ లం మీదుగా పెన్‌గంగా ఉధృతంగా ప్రవహిస్తున్నది. పరీవాహక మాకిడి, జక్కాపూర్, నవేగాం, వెంకట్రావ్‌పేట్, పారిగాం, లోనవెల్లి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్ఐ కమలాకర్ సూచించారు. కాగా, వెంకట్రావ్‌పేట్-పోడ్సా అంతర్రాష్ట్ర వంతెనపై నుంచి రాకపోకలను అధికారులు నిలిపివేశారు. హడ్కులీలో లెవల్ వంతెనపై పెన్‌గంగా బ్యాక్ వాటర్ నిలిచి హడ్కులీ, జాక్కాపూర్, మాకిడి గ్రామాలతో పాటు మహరాష్ట్రకు రాకపోకలను అధికారులు నిలిపివేశారు.
పెంచికల్పేట్, సెప్టెంబర్ 2 : పెంచికల్పేట్ మం డలం కమ్మర్ గాం, నందిగాం, జిల్లెడ, మొర్లిగూడకు రాకపోకలు నిలిచిపోయాయి. కమ్మర్గాం-గుండెపెల్లి మధ్య వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఓ వైపు ప్రాణహిత, మరోవైపు పెద్దవాగు ఉధృతితో పరీవాహక ప్రాంతాల పంట చేలు నీట మునిగిపోయాయి.
జైపూర్, సెప్టెంబర్ 2 : జైపూర్ మండలం ఇందారం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎల్లంపల్లి గేట్లు ఎత్తడంతో మండలంలోని గోదావరి తీరాన గల వేలాల, శివ్వారం, కిష్టాపూర్, పౌనూర్ గ్రామాల్లో గల పత్తి చేలు నీట మునిగాయి. ఉన్నతాధికారుల ఆదేశాలతో తహసీల్దార్ వనజారెడ్డి, ఎస్ఐ శ్రీధర్ తమ సిబ్బందితో కలిసి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. టేకుమట్లలో రెండు ఇళ్లు పూర్తిగా, శెట్పల్లిలో పాక్షికంగా కూలినట్లు తెలిపారు.
కోటపల్లి, సెప్టెంబర్ 2 : కోటపల్లి మండలం నక్కలపల్లి గ్రామానికి వెళ్లే దారిలో లోతొర్రె ఉప్పొంగగా, రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తడం వల్ల గోదావరి, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రాణహిత ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
దండేపల్లి, సెప్టెంబర్ 2 : దండేపల్లి మండలం గూడెం వద్ద గోదావరి ఉధృతిని స్థానిక నాయకులతో కలిసి రాష్ట్ర గిరిజన ఆర్థిక అభివృద్ది కోఆపరేటివ్ కార్పోరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి పరిశీలించారు. ఆయన వెంట తోట మోహన్, కంది సతీష్, వనపర్తి రవి తదితరులున్నారు. ద్వారక గ్రామానికి చెందిన మునిమడుగుల సతీశ్.. పొలాల అమావాస్య సందర్భంగా ఎద్దుకు స్నానం చేయించేందుకు గోదావరి సమీపంలోని వాగుకు తీసుకెళ్లాడు. ఉధృతి పెరగడంతో ఎద్దు ప్రవాహంలో కొట్టుకుపోయింది. పండుగపూట రైతు కుటుంబంలో విషాదం నెలకొంది.
బెల్లంపల్లి, సెప్టెంబర్ 2 : బెల్లంపల్లి పట్టణంలోని కాల్టెక్స్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద ముంపునకు గురవుతున్న రైల్వే క్వారర్లు, తోతట్టు ప్రాంతాల ఇళ్లను ఆర్డీవో హరిప్రసాద్ పరిశీలించారు. తొలగింపునకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులు, రైల్వే అధికారులకు సూచించారు. తహసీల్దార్ జ్యోత్స్న, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, చైర్పర్సన్ జక్కుల శ్వేత ఉన్నారు. స్టేషన్ రోడ్డు కాలనీలో ఐదు సింగరేణి క్వార్టర్లలోకి వర్షపు నీరు చేరింది. అశోక్‌నగర్, హన్మాన్ బస్తీకి మధ్య రామ్‌నగర్ అండర్ బ్రిడ్జి ఉప్పొంగింది. రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కన్నాల బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే దారిలో రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడింది. కన్నాల గ్రామానికి చెందిన పిల్లలు గుంతను గమనించి, వాహనాదారులకు చెప్పడం వారి సామాజిక బాధ్యతకు అద్దంపడుతున్నది. విషయం తెలుసుకున్న సంబంధిత పంచాయతీ అధికారులు గుంతను వెంటనే సిమెంట్, కంకరతో పూడ్చి వేశారు.
వేమనపల్లి, సెప్టెంబర్ 2 : వేమనపల్లి సరిహద్దు ప్రాణహిత ఉప్పొంగింది. పుష్కరఘాట్ మునిగిపోయింది. కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ప్రాణహిత బ్యాక్ వాటర్‌తో లోతట్టు ప్రాంతాలకు నీరు చేరే అవకాశం ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ రమేశ్ సూచించారు.