కుభీర్, జూన్ 20 : మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో గురువారం నుండి ఇంటర్నెట్ సేవలు స్తంభించడంతో కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై తమ పిల్లలకు వివిధ ధ్రువీకరణ పత్రాల కోసం మండలంలోని పలు గ్రామాల ప్రజలు వందలాదిగా వచ్చి సర్టిఫికెట్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. శుక్రవారం ఉదయం నుండి ఆ గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు, రైతులు వివిధ పనుల నిమిత్తం వచ్చి తహసిల్దార్ కార్యాలయం ముందు ఇంటర్నెట్ సేవల కోసం వేచి చూస్తున్నారు.
గత రెండు రోజులుగా బిఎస్ఎన్ఎల్ టీజీ స్వాన్ అండర్ గ్రౌండ్ కేబుల్ ద్వారా వచ్చే ఇంటర్నెట్ ఎక్కడో తెగిపోయి ఉండవచ్చన్న అభిప్రాయాలను అధికారులు వెల్లడిస్తున్నారు. అయినప్పటికీ రెండు రోజులుగా సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పరిష్కరించకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఒకపక్క రెవెన్యూ అధికారులను గ్రామాలలో రెవెన్యూ సదస్సులకు పంపడం మూలంగా సమాధానం చెప్పేవారు లేక గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ నెట్వర్క్ లేక సర్టిఫికెట్లు అందడం లేదన్న విషయం తెలియకపోవడంతో అధికారులపై దుమ్మెత్తి పోస్తున్నారు. కులం, ఆదాయ, నివాస, నాన్ క్రిమిలేయర్ తదితర సర్టిఫికెట్ల కోసం వచ్చిన యువకులు, విద్యార్థులు, మహిళలు కార్యాలయం ముందు కూర్చుని ఉన్నప్పటికీ అధికారులు వారికి నచ్చజెప్పి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టడం లేదని పలువురు ఆరోపించారు. మా పిల్లలు వివిధ పట్టణాల్లోని పాఠశాలలకు కళాశాలలకు వెళ్ళేది ఉన్నప్పటికీ సర్టిఫికెట్లు జారీ కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. సమస్య ఎప్పటికీ పరిష్కారం అవుతుందో ఎవరు చెప్పడం లేదని తాము నిన్నటి నుంచి ఇక్కడే వేచి చూస్తున్నామని పేర్కొంటున్నారు. ఈ విషయమై తాసిల్దార్ శివరాజ్ ను ఫోన్లో సంప్రదించగా బిఎస్ఎన్ఎల్ TG Swan అండర్ గ్రౌండ్ ఓ ఎఫ్ సి కట్ కావడంతోనే ఈ సమస్య ఇక్కడ తలెత్తిoదన్నారు. బిఎస్ఎన్ఎల్ అధికారులకు విషయాన్ని నివేదించామని తెలిపారు.