స్వరాష్ట్రంలోనే ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని, సర్వ మతాల అభివృద్ధే బీఆర్ఎస్ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాకేంద్రంలోని దివ్య గార్డెన్లో బుధవారం పట్టణంలోని 11 వార్డుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. మొదట మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్ పార్టీ జెండాను ఎగుర వేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. స్థానికంగా యువత ఐటీ ఉద్యోగాలు చేసుకునేందుకు ఐటీ హబ్, చదువుకునేందుకు ఇంజినీరింగ్ కళాశాలను తీసుకొస్తానని హామీ ఇచ్చారు. నిర్మల్ జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికల్, నర్సింగ్ కళాశాల నుంచి యేటా 100 మంది వైద్యులు కానున్నారని సంతోషం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఐరన్‌లెగ్ అని విమర్శించారు. ఆయన ఏ పార్టీలో చేరిన అంతేనని పేర్కొన్నారు. అలాగే ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని ఫంక్షన్హాల్లో జరిగిన 13 వార్డుల ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే జోగు రామన్న ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
నిర్మల్ అర్బన్, మే 16 ః పద్నాలుగేండ్లపాటు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలోనే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నిర్మల్ జిల్లాకేంద్రంలోని దివ్య గార్డెన్లో పట్టణంలోని 7,8,9,10,11,12,13,28, 29,30,31 వార్డుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొని భావాలను పంచుకున్నారు. మొదటగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్ పార్టీ జెండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతోపాటు ప్రజల అవసరాలు గుర్తించి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక బాధలను దూరం చేసేందుకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తూ ఆదుకుంటున్నారన్నారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు గ్రామాల్లోనే కాంటాలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకు 2 వేల డబుల్ బెడ్రూంలు అందించామని, 1000 నిర్మాణ దశలో ఉన్నాయని వాటిని కూడా త్వరలోనే పంపిణీ చేస్తామన్నారు. సొంత స్థలం ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.3 లక్షల రుణం అందిస్తామని, ఈ లోన్ పూర్తిగా ఉచితమని ఒక్క రూపాయి ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. నిర్మల్ పట్టణంలో తాగు నీటి ఇబ్బందులు తీర్చడానికి రూ.42 కోట్లతో ఐదు ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించి, ఇబ్బందులు దూరం చేశామన్నా రు. అన్ని మతాలను బీఆర్ఎస్ పార్టీ సమన్యాయంతో చూస్తున్నదని తెలిపారు. నిర్మల్‌లో రూ.3.50 కోట్లతో ఈద్గా నిర్మిస్తే కొందరు మత పిచ్చితో దాన్ని ఆపేందుకు కోర్టుకు వెళ్లడం సిగ్గు చేటన్నారు. స్థానికంగానే ఐటీ ఉద్యోగాలు చేసుకునేందుకు ఐటీ హబ్, ఇంజినీరింగ్ కళాశాలను తీసుకొస్తానని హామీఇచ్చారు. ఇప్పటివరకు మెడికల్, నర్సింగ్ కళాశాలలు తీసుకొచ్చామని, యేటా 100మంది వైద్యులు కానున్నారని సంతోషం వ్యక్తం చేశారు. రూ.42 కోట్లతో సమీకృత కోర్టు భవన నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించుకోనున్నామని తెలిపారు.
మహేశ్వర్‌రెడ్డిపై మండిపడ్డ మంత్రి
ప్రజల సమస్యలు పట్టించుకోకుండా సండే ఎమ్మెల్యేగా గెలిచిన ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రజలకు చేసిందేమీ లేదని, ఆయన కాలు మోపిన చోట పార్టీ అంతే సంగతని గుర్తు చేశారు. టీడీపీలో చేరగానే పార్టీ నామరూపాలు లేకుండా పోయిందని, అక్కడి నుంచి ప్రజారాజ్యం, కాంగ్రెస్, బీజేపీలో చేరాడని బీజేపీ కూడా ఆయన రాకతో అదేగతి పట్టనుందని అన్నారు. ఆయనను ఐరన్ లెగ్గా అంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండె విఠల్, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ, పార్టీ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, ప్రముఖ పారిశ్రామిక వేత్త అల్లోల మురళీధర్‌రెడ్డి, అల్లోల సురేందర్‌రెడ్డి, యువ నాయకులు గౌతం రెడ్డి, సీనియర్ నాయకులు రామలింగం, నాయకులు పాకాల రాంచందర్ పాల్గొన్నారు.
కేంద్రంపై నిరసనలు..
పేద, మధ్య తరగతి ప్రజలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు పట్టించుకోకుండా యేటా సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంతో మహిళలు వినూత్న నిరసనకు దిగారు. ఆత్మీయ సమ్మేళనంలో గ్యాస్ సిలిండర్‌కు పూలదండ వేసి వాటికి ఇక బీజేపీ పాలన వద్దని దండం పెట్టగా.. మరి కొందరు మహిళలు సిలిండర్, పెట్రోల్, డీజిల్ డబ్బాల చుట్టూ బతుకమ్మ ఆడి నిరసన వ్యక్తం చేశారు. ఆత్మీయ సమ్మేళనంలో సిలిండర్‌తో ప్ల కార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.