మంచిర్యాల, జూలై 13(నమస్తే తెలంగాణ ప్రతినిధి) ః సబ్సిడీపై యూరియా, కాంప్లెక్స్ ఎరువులు కావాలంటే లంచం ఇవ్వాలని మంచిర్యాల జిల్లా వ్యవసాయశాఖ అధికారులు తెగేసి చెప్తున్నారట. పీఏసీఎస్, డీసీఎంఎస్, హాకా ఏజెన్సీల కింద ఎరువుల దుకాణాలు ఉన్న వారంతా కలిసి ఒకరిని తమ దగ్గరికి పంపించాలని, మేం ఆయనతో మాట్లాడాక అంతా కలిసి మాకు డబ్బులు ఇస్తేనే యూరియా ఇస్తామని ఓ హాకా సెంటర్ నిర్వాహకుడికి వ్యవసాయశాఖ అధికారి చెప్పారట. చెన్నూర్‌కు సంబంధించిన మరో ఫర్టిలైజర్ డీలర్‌కు ఎరువుల ఇండెంట్ పెట్టేందుకు జిల్లా అధికారి ఒకరు రూ.10 వేలు లంచం డిమాండ్ చేశారు. సదరు డీలర్ బుధవారం మంచిర్యాల వచ్చి సార్‌కు మామూలు ఇచ్చాకే పని పూర్తయి పోయినట్లు తెలిసింది.
ఇలా ఎవరికి యూరియా, ఎరువులు కావాలన్నా చేతులు తడపక తప్పడం లేదని ఫర్టిలైజర్ షాపుల డీలర్లు, ఏజెన్సీల ఆధ్వర్యంలో ఎరువుల సెంటర్లు నడిపే నిర్వాహకులు చెప్తున్నారు. ప్రైవేట్ డీలర్లు అంటే ఏమో కానీ.. ఏజెన్సీల కింద నడిచే సెంటర్ల వారిని డబ్బులు డిమాండ్ చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారం, పది రోజుల్లో మేము బదిలీపై వెళ్తున్నాం. వెళ్లే ముందైనా నాలుగు డబ్బులు సంపాదించుకోవాలంటూ అధికారులు చెబుతున్నట్లు తెలిసింది. ఇలా జిల్లా వ్యవసాయశాఖ అధికారుల తీరుతో రాష్ట్ర ప్రభుత్వం అభాసుపాలు కావాల్సిన పరిస్థితులు తలెత్తాయి.
చెన్నూర్ రూరల్ మండలంలోని ఓ గ్రామంలో హాకా సెంటర్ నిర్వాహకుడు ఈ నెల 8వ తేదీన 30 టన్నుల యూరియాకు ఇండెంట్ పెట్టమని ఏవోకు లెటర్ ఇచ్చాడు. దానికి సదరు అధికారి మీరంతా కలిసి నేను చెప్పినట్లు ఓ పర్సన్‌కు ఎంచుకుని ఆయనతో డబ్బులు పంపిస్తేనే ఫైల్ ముందుకు కదులుతుందని చెప్పాడు. ఈ విషయాన్ని ఏడీ దృష్టికి తీసుకెళ్లగా అయిపోతుంది ఏవోతో నేను చెప్తానని చెప్పి మరునాడు ఆఫీసుకు పిలిపించుకుని లంచం ఇవ్వాలంటూ సున్నితంగా అడిగినట్లు సదరు సెంటర్ నిర్వాహకుడు ఆరోపిస్తున్నాడు.
తాను లంచం ఇవ్వనని చెప్పడంతో అధికారులు నేను హాకా సెంటర్‌తోపాటు ప్రైవేట్ ఫర్టిలైజర్ షాప్ లైసెన్స్ ఉందని, రెండింటిలో ఒకటి క్యాన్సల్ చేసుకుంటేనే యూరియా ఇస్తామని కొర్రీ పెట్టారట. దీంతో బాధితుడు గత సీజన్లో హాకా సెంటర్ పెట్టుకునేందుకు అప్పుడున్న అధికారులు రూ.2 లక్షలు లంచం ఇచ్చానని, రూ.లక్ష డిపాజిట్ కట్టానని మొత్తం రూ.3 లక్షలు ఖర్చు పెట్టుకున్నానని చెప్తున్నారు. గతంలో లంచాలు ఇచ్చి, మళ్లీ ఇప్పుడు కూడా డబ్బులు ఇవ్వాలంటే తాను ఎక్కడికి పోవాలని ప్రశ్నిస్తున్నాడు. గత సీజన్లో ఒక లైసెన్స్ ఉండగానే, రెండో లైసెన్సు జారీ చేసిన అధికారులు అప్పుడెందుకు యూరియా, ఎరువులు ఇచ్చారంటూ ప్రశ్నిస్తున్నాడు. ఇప్పటికిప్పుడు లైసెన్సు రద్దు చేసుకోమంటే ఎలాగని, ఇంకొకరి పేరు మీదకు మార్చుకునేందుకైనా సమయం ఇవ్వాలి కదా అని అడుగుతున్నాడు.
లైసెన్స్ మీద ఎరువులు తీసుకోవడానికి నాకు ఓ ఫామ్ ఉందని, ఎరువులు తీసుకోవడానికి అన్ని విధాలుగా అర్హుడిని. నాకు ఇండెంట్ ఎలా పెట్టరో చూస్తానని అధికారులు గట్టిగా చెప్పడంతో ఈ రోజు(13వ తేదీ)న ఇండెంట్ పెట్టారంటున్నాడు. రెండు రోజులు సెలవుల సమయంలో ఇండెంట్ పెడితే సోమవారం వరకు ఆగక తప్పని పరిస్థితి ఉందని ఆయన వాపోయారు. ఇక.. ఇదే చెన్నూర్ మండలంలో మరో హాకా ఫార్మర్ సర్వీస్ సెంటర్ నిర్వాహకుడు 20 టన్నుల యూరియా కోసం జూన్ 24వ తేదీన ఇండెంట్ పెట్టుకుంటే ఇప్పటివరకు స్టాక్ రాలేదని తెలిసింది.
డబ్బులు ఇచ్చిన డీలర్లకు మాత్రమే అధికారులు ఇండెండ్ పెడుతున్నట్లు తెలిసింది. ఇలా చాలా మంది డీలర్లు డబ్బులు ఇచ్చి ఇండెండ్ పెట్టుకుని వచ్చిన యూరియాను మహారాష్ట్రకు తరలిస్తున్నారు. కొన్ని రోజులు వర్షాలు పడుతుండడంతో యూరియాకు డిమాండ్ పెరిగింది. మన రైతులకు రూ.290కి రావాల్సిన యూరియా బస్తా మహారాష్ట్రకు తీసుకెళ్లి విక్రయిస్తే రూ.400 వరకు వస్తుంది. దీంతో డీలర్లు మన రైతులకు యూరియా ఇవ్వడం కంటే పొరుగున ఉన్న మహారాష్ట్రకు తరలించేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అధికారులు కూడా డబ్బులు తీసుకుని ఇండెంట్ పెడుతూ ఈ దందా చేసే డీలర్లకు పరోక్షంగా సహకరిస్తున్నారు. మొన్నటికి మొన్న మహారాష్ట్రకు తరలించేందుకు సిద్ధమైన ఎరువుల లోడ్ ఒకటి దొరికింది.
దీనితోనైనా కఠినంగా వ్యవహరించాల్సిన అధికారులు మామూళ్ల కోసం డిమాండ్ చేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు నుంచి యూరియా తీసుకునే అవకాశం లేకపోవడంతో రైతులు డీలర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. పెద్దపెద్ద డిస్ట్రిబ్యూటర్లు దగ్గర యూరియా ఉన్నప్పటికీ వాళ్ల అవసరాలకు సరిపడా ఉంచుకుని మిగిలిన యూరియాను మహారాష్ట్రకు తరలిస్తున్నరు. ఇటు ప్రైవేటు నుంచి యూరియా రాక, అటు ప్రభుత్వం నుంచి సపోర్టు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సీజన్ ప్రారంభంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే, రానున్న రోజుల్లో పరిస్థితి ఏంటని వాపోతున్నారు. ఈ విషయమై జిల్లా వ్యవసాయ అధికారి సురేఖను ఫోన్లో వివరణ కోరగా.. మా అధికారులు, ఎవరైనా లంచం అడిగినట్టు ఆధారాలు ఉంటే చర్యలు తీసుకుంటాం. గత సీజన్లోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చినపుడు ఏవో, ఏడీలను సస్పెండ్ చేశాం.