“ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తాం. రెవెన్యూ రికార్డుల్లో పాత కాలం నాటి పట్టేదారు, అనుభవదారు, మన్యందారు కాలాలు చేరుస్తాం. కౌలుదారు పేరును రికార్డుల్లో కచ్చితంగా రికార్డు చేస్తాం. రైతు తన భూమిని కౌలుకు ఇవ్వాలనుకుంటే కౌలుదారుతో రాతపూర్వకంగా ఒప్పందం చేసుకోవాలని చట్టం తెస్తాం. గతంలో ఏ చట్టాల ద్వారా ఎవరెవరికీ భూమి మీద హక్కులు వచ్చాయో వాటన్నింటినీ తిరిగి తెస్తాం.” అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన ప్రకటనపై రైతులోకం మండిపడుతున్నది.
అలా జరిగితే పైరవీలు, లంచాలు మళ్లీ పుట్టుకొస్తాయని.. పటేల్, పట్వారీ వ్యవస్థ వచ్చి సమస్యలు, వేధింపులు తప్పవని పాత రోజులను గుర్తు చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ మూడేండ్లు కష్టపడి ధరణిని తీసుకొస్తే బంగాళాఖాతంలో వేస్తామని ఒకరు, రద్దు చేస్తామని మరొకరు ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాకు సులువుగా, వేగంగా 20 నిమిషాల్లో క్రయ, విక్రయాలు పూర్తవుతున్నాయని, ధరణే ఉండాలని రైతన్నలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతులను పీక్కతిన్న కాంగ్రెస్ కుట్రలు తిప్పికొడుతామని, ఓటుతో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు.
– ఆదిలాబాద్, నవంబర్ 18(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, నవంబర్ 18(నమస్తే తెలంగాణ) : ధరణి రద్దుతో రైతుల భూములకు అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం నిజాం కాలం నాటి భూముల రికార్డులను సరిచేసి అసలైన రైతులకు రికార్డులతో తయారు చేసిన ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చింది. ఈ ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యానించడంపై రైతులోకం మండిపడుతున్నది. గతంలో అస్తవ్యస్తంగా ఉన్న భూముల రికార్డుల ఫలితంగా తమ భూములు ఎవరి పేరిట మారుతున్నాయో తెలియని పరిస్థితి ఉండేదని అన్నదాతలు పేర్కొంటున్నారు. తమకు తెలియకుండా అధికారుల అక్రమాల ఫలితంగా భూముల అమ్మకాలు, కొనుగోళ్లు జరిగేవని రైతులు అంటున్నారు. రెవెన్యూ రికార్డుల్లో ఇంతకు ముందు మాదిరిగా పట్టేదారు, అనుభవదారు, మాన్యందారు ఇతర వివరాలు కౌలుదారు పేరిట రికార్డుల్లో నమోదు చేస్తామనడం, రైతు తన భూమిని కౌలుదారుతో రాతపూర్వకంగా ఒప్పందం చేసుకోవాలని చట్టం తెస్తామని భట్టి అనడంపై దుమారం లేస్తున్నది.
భూమాత పోర్టల్ తీసుకొచ్చి పాత విధానంలో ఉండే అన్ని కాలమ్స్ పెడితే రైతులకు తిరిగి ఇబ్బందులు రానున్నాయని.. పటేల్, పట్వారీ వ్యవస్థ తిప్పలు తప్పవని రైతులు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మూడేండ్లపాటు కష్టపడి తీసుకొచ్చిన ధరణి పోర్టల్ గతంలో ఉన్న భూముల సమస్యలకు పరిష్కారం లభించిందని తెలుపుతున్నారు. పటేల్, పట్వారీ వ్యవస్థ లేకుండా ఎవరికి ఎలాంటి నయాపైసా ఇవ్వకుండా భూముల కొనుగోళ్లు, అమ్మకాలు 20 నిమిషాల వ్యవధిలో జరిగిపోతున్నాయన్నారు. గతంలో భూముల క్రయ, విక్రయాల కోసం అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఏడాది తిరిగినా పని అయ్యేది కాదని, అడుగడుగునా లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత రైతులు తమ భూముల వివరాలను ఫోన్లో చూసుకునే అవకాశం లభించిందని, బంగారం లాంటి భూములకు రక్షణ ఏర్పడినట్లు రైతులు అంటున్నారు. ధరణి రద్దుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అసలుకే మోసం చేయాలని ప్రయత్నిస్తున్నదని, ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు పీక్కుతిన్న కాంగ్రెస్ మరోసారి కుట్రలు చేస్తున్నదని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతామని రైతులు అంటున్నారు.
దిలావర్పూర్, నవంబర్ 18: ధరణి పోర్టల్ తీసేస్తమని కాంగ్రెసోళ్లు చెబుతున్నరు. ఇదంతా రైతుల భూములను దోచుకో వడం కోసమే. మల్లా పటేల్, పట్వారీ వ్యవస్థను తెచ్చి రైతులను ఇబ్బంది పెడుతమని చెబుతున్నది. ఇగ రోజుల తరబడి అధికారులు, లీడర్ల సుట్టూ తిరిగే రోజులు మళ్లా తెస్తమ ని కాంగ్రెస్ అంటున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువా త ధరణి పోర్టల్ తీసుకవచ్చి రైతుల కష్టాలను తీర్చింది. రైతుకు నేరుగా పెట్టుబడి సాయం అందిస్తుంటే, కాంగ్రెస్ పార్టీకి మిం గుడు పడడం లేదు. వారి హయాంలో రైతుల చెప్పులరిగేలా ఆఫీసుల చుట్టూ తిప్పుకున్నరు. ధరణి పోర్టల్ తీసేస్తమని అంటున్న కాంగ్రెస్‌ను రైతులంతా బంగాళాఖాతంలో కలపాలి. గట్లయితనే రైతుల బతుకులు బాగుపడుతయ్.
– కొమ్ముల పెద్ద దేవేందర్‌రెడ్డి, గుండంపల్లి
బెజ్జూర్, నవంబర్ 18 : నా పేరు గుర్లె శంకర్. నాది కుకుడ గ్రామం. మా అయ్య.. కాలంలో భూముల కోసం ఎట్ల గోస పడ్డరో చెప్పేటోడు. నాకు కూడా కొంత ఎరుకే. రైతుల భూముల గుట్టు మొత్తం పట్వారీల దగ్గరే ఉండేది. కోడి అడిగితే ఇయ్యకుంటే కూడా భూ రికార్డుల్లో పేర్లు మార్చెటోళ్లు. డబ్బులిస్తే ఒకరి భూమి ఇంకొకరికి రాస్తుండే. గిసొంటి లెక్కలన్నీ పట్వారీలు చేసేటోళ్లు. ఇగ భూమి పట్టా చేసుకోవాల్నంటే ఆసిఫాబాద్‌కు పోయేటోళ్లం. ఇగ పట్టేదారు సచ్చి పోతే భార్య, కొడుకులకు విరాసత్ చేయాలంటే పట్వారీలు వేలకు వేలు గుంజేటోళ్లు. ఇయ్యకుంటే గా భూములను సచ్చిపోయిన వారి పేరుమీదనే ఉంచేటోళ్లు. మా అయ్య చనిపోయి 15 ఏండ్లు అయితంది. ఆయన పేరుమీద ఐదెకరాలు ఉంది.
మేము ముగ్గురం అన్నదమ్ములం. మనిషికింత విరాసత్ పట్టా చేసుకుందామని పట్వారీల దగ్గరికి పోతే లంచం అడిగిన్రు. గరీబోళ్లం. పైసలు దొరకక గట్లనే ఉన్నం. కానీ తెలంగాణ వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంక ధరణిని తీసుకొచ్చిండు. మేము కూడా విరాసత్ పట్టాలు చేసుకున్నాం. పైసలు మస్తు తక్కువైనయ్. ఇగ ఇప్పుడు పట్టేదార్లు పోయి బొటన వేలు పెట్టనిదే భూమి ఎవ్వరికి మారదు. గిసొంటి మంచిపని ధరణితోనే అయితున్నది. గా.. కాంగ్రేసోళ్లు భూముల విషయంలో మళ్లీ మునుపటి లెక్కనే చేస్తామంటున్నరు. గట్లయితే రైతులకు మళ్లా గోస తప్పదు. రైతులు జర ఆలోచించాలే. భూముల విషయంలో ధరణే మంచిగున్నది.
చెన్నూర్ రూరల్, నవంబర్ 18 : మా నాన్న ఇటీవల అనారోగ్యంతో చనిపోయిండు. ఆయన పేరు మీదున్న మూడెకరాలను మా అన్నకు.. నాకు తలా ఎకరంన్నర రిజిస్ట్రేషన్ అయ్యింది. రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పోయిన అరగంటలోనే పని అయిపోయింది. మా ఇద్దరికి మొన్ననే పట్టా పాస్ బుక్‌లు కూడా వచ్చినయి. ఒక్క అధికారికి కలుసుడు లేదు, రేపు రా.. మాపు రా.. సార్ లేడు అనే ముచ్చటే లేదు. మీ సేవలో స్లాట్ బుక్ చేసినం అంతే.. అంత గొప్ప ధరణిని కాంగ్రెస్ ప్రభుత్వం తొలగిస్తా అనడం నిజంగా సిగ్గుచేటు. గతంలో మా అన్నయ్య రెండెకరాలు ఒకరి దగ్గర కొనుక్కున్నడు. ఆ భూమి మా అన్నయ్య పేరు మీదికి రిజిస్ర్టేషన్ కావడానికి మూడు నెలలు పట్టింది. రోజూ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగేటోడు. ఏదో ఒక కారణం చెప్పేవారు. మా అన్నయ్య ఒక్కడే కాదు ఇలాంటి సమస్యలతో ఎంతో మంది రైతులు అరిగోస పడ్డారు. రైతుల కష్టాలు గమనించిన కేసీఆర్ ధరణి అనే పోర్టల్‌ను తీసుకొచ్చి మేలు చేసిండు. ఇప్పుడు ఇట్లా పోయి.. అట్లా వస్తున్నం. అంత ఈజీగా పని అయిపోతుంది.
– సుంకరి శ్రీనివాస్, రైతు, చెన్నూర్
లక్ష్మణచాంద, నవంబర్ 18: కాంగ్రెస్ పార్టీ రెవెన్యూ వ్యవస్థలో మళ్లీ పాత పద్ధతులు తెస్తానంటున్నది. భట్టి విక్రమార్క మాట్లాడిన మాటలు గట్లనే ఉన్నయ్. పటేల్, పట్వారీ వ్యవస్థ మళ్లీ వస్తే మళ్లీ రైతులకు గోస మొదలైనట్లే. పట్టాదారు స్థానంలో తిరిగి అనుభవ దారు, మాన్యందారు కాలమ్‌లు పెట్టడంతో నిజమైన పట్టాదారుకు తిప్పలు తప్పవు. గతంలో భూములపై హక్కులు పొందిన వారికే తిరిగి ఎందుకు పట్టాలు ఇస్తరు. పట్టాలు ఉన్న నిజమైన రైతుల పరిస్థితి ఏం కావాలె. వారికే పట్టాలు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయం వారి తెలివితక్కువ తనాన్ని బయటపెడుతున్నది. ఈ నిర్ణయంతో నిజమైన రైతుల స్థానంలో ఆనాటి పెద్దోళ్లకు పట్టాలు ఇచ్చినట్లయితది. దీంతో చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్ట పోతరు. పటేల్, పట్వారీ వ్యవస్థతో తిరిగి లంచగొండి, దోపిడి వ్యవస్థ వస్తది. రైతు వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీని తరిమి కొడితేనే రాష్ట్రం బాగుపడుతది. గిప్పుడిప్పుడే రైతులు ప్రశాంతంగా ఉంటున్నరు. మల్లా ఆ ప్రశాంతతను పోగొట్టేలా కాంగ్రెసోళ్ల మాటలు ఉంటున్నయ్.
-ఏలేటి గంగారెడ్డి, చామన్‌పెల్లి