నార్నూర్, మే 12: గాదిగూడ, నార్నూర్ మండలాల్లో నీటి వనరులకు కొదవ లేదు. ఈ మండలాల్లో చెక్‌డ్యాంలు, చెరువులు, కుంటలు ఉన్నాయి. ఇన్ని వనరులున్నా గత ప్రభుత్వాల హయాంలో పంటలకు నీళ్లందక ఎండిపోయేవి. సాగు భూములకు చుక్క నీరు లేక బీడు భూములుగా మారేవి. దీంతో రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకొని కన్నీళ్లు పెట్టేవారు. ఈ తరుణంలో స్వరాష్ట్రంలో ఏర్పడిన సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతుల జీవితాల్లో మార్పు తెచ్చింది.
మిషన్ కాకతీయ పథకం కింద రూ.కోట్లతో చెక్‌డ్యాంలు, చెరువులు, కుంటలు మరమ్మతులు చేయించింది. ప్రస్తుతం రైతులకు కావాల్సిన నీరు సమృద్ధిగా నిల్వ ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెక్‌డ్యాంలు, చెరువులు, కుంటల్లో ప్రస్తుతం ఏడాది పొడవునా నీళ్లుంటున్నాయి. వానకాలం, యాసంగి పంటలు వేలాది ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఏడాదికి రెండు పంటలు సాగు చేసి అధిక దిగుబడి సాధిస్తున్నారు.
యాసంగి సాగులో వేల ఎకరాలు..
జలాశయాలు అందుబాటులో ఉండడంతో సాగు విస్తీర్ణం పెరిగింది. గతంలో చుక్క నీరు అందక ఆయకట్టు చుట్టు పక్కల భూములు బీళ్లుగా దర్శనమిచ్చేవి. బోరు బావులు, బావులు ఉండే రైతులు మాత్రమే యాసంగి పంట వేసే వారు. కాగా చెరువు, కుంటలు, చెక్‌డ్యాంల మర్మమతుతో ఆయకట్ట రైతులు రెండు పంటలు సాగు చేస్తున్నా రు. నేడు వందలాది ఎకరాల భూమి సాగులోకి రావడంతో అన్నదాతల్లో చిరునవ్వు వెల్లివెరిస్తుంది. యాసంగిలో శనగ 8.54 ఎకరాలు, వేరు శనగ ఐదెకరాలు, గోధుమ 176, మక్క,20 ఎకరాలు, ఇలా మరిన్ని పంటలు సాగు చేస్తున్నారు.
మిషన్ కాకతీయ ద్వారా..
మిషన్‌కాకతీయ పథకం కింద ఉమ్మడి మండలాల్లో 42 చెరువులు, కుంటలు, 6 చెక్ డ్యాంలను మంజూరు చేసింది. కోట్లాది రూపాయలతో మరమ్మతులు చేసింది. దీంతో ఎంతో మంది రైతులకు మేలు జరిగింది. ఇదే కాకుండా ప్రభుత్వం రైతు బంధు కింద ఏడాదికి రెండు సీజన్లకు కలిపి రూ.10 వేలు సకాలంలో చెల్లిస్తుండడంతో అప్పు చేయకుండా విత్తనాలు, ఎరువులు కొంటూ పంటలు సాగు చేస్తున్నారు. అధిక దిగుబడులు సాధిస్తూ తమ కుటుంబాలతో సంతోషంగా ఉంటున్నారు.
రెండు పంటలు పండిస్తున్న..
మిషన్ కాకతీయ పథ కం ద్వారా చెరు వు, కుంటలు, చెక్ డ్యాంలు బాగ య్యాయి. తెలం గాణ సర్కారు పుణ్యమాని అన్ని మరమ్మతులు పూర్త య్యాయి. దీంతో ఆయకట్టు రైతులు రెం డు పంటలు సాగు చేస్తున్నరు. దిగుబడి కూడా మంచిగనే వస్తున్నది. రైతులు మంచిగుంటే దేశం మంచిగున్నట్లే. అదే సీఎం కేసీఆర్ చేస్తున్నరు. ఇయ్యాల రైతు కుటుంబాలు సంతోషంగా ఉన్నది ఆయన వల్లే.
-కొడప జాకు(మాజీ సర్పంచ్, సావిరి పంచాయతీ)
గోదారిగూడ లో ఫుల్లు నీళ్లు
గోదారిగూడ చెరువుకు ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం కింద మరమ్మతు చేయించింది. ఇందుకోసం లక్షలు ఖర్చు పెట్టింది. ప్రస్తుతం చెరువులో నీటికి కొదవ లేదు. చెరువు ఆయకట్ట రైతులు రెండు పంటలు సాగు చేస్తున్నరు. దీంతో భూగర్భజాలలు కూడా పుష్కలంగా పెరిగాయి. రైతులమంతా సర్కారుకు రుణపడి ఉంటం.
-ఆత్రం ఇంద్రభాను(రైతు,లోకారి(కే))