దండేపల్లి/చెన్నూర్ టౌన్/శ్రీరాంపూర్/తాండూర్/ కౌటాల/సీసీసీ నస్పూర్/మందమర్రి/కాసిపేట/ లక్షెట్టిపేట/జైపూర్/ జైపూర్/హాజీపూర్/రెబ్బెన/ బెజ్జూర్/దహెగాం/చింతలమానేపల్లి/ కన్నేపల్లి/ జన్నారం/భీమారం/వేమనపల్లి, సెప్టెంబర్ 16 : వినాయక నవరాత్రోత్సవాలు సోమవారంతో ప్రశాంతంగా ముగిశాయి. తొమ్మిదిరోజులపాటు విశేషపూజలందుకున్న గణనాథులు.. గంగమ్మ ఒడికి చేరుకున్నారు. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో గణేశ్ నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో ఏకదంతుడిని ఉంచారు. అనంతరం మహిళల కోలాటాలు, యువతీయువకుల నృత్యాల నడుమ శోభాయాత్ర నిర్వహించారు. మహిళలు ఇంటింటా మంగళహారతులతో తరలివచ్చి, కొబ్బరికాయలు కొట్టి మొక్కలు తీర్చుకున్నారు. గణపతి బప్పా మోరయా.. అంటూ నినాదాలు చేశారు.
అనంతరం ఆయా చెరువులు, నదుల్లో నిమజ్జనం చేశారు. దండేపల్లి మండలం గూడెం గోదావరికి ప్రతిమలు పెద్ద సంఖ్యలో తరలివచ్చాయి. దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాలతో పాటు మంచిర్యాల, మందమర్రి, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల నుంచి తీసుకువచ్చారు. గోదావరి వద్ద పోలీసులు, అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. క్రేన్ల సాయంతో నిమజ్జనం చేశారు. ఇక్కడ భారీ లైట్ సెట్టింగ్స్, భారికేడ్లు ఏర్పాట్లు చేశారు. గజ ఈతగాళ్లు, సింగరేణి రెస్క్యూ టీంలను అందుబాటులో ఉంచారు. చెన్నూర్ పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర, నిమజ్జనం.. సోమవారం ఉదయం 10 గంటల వరకూ కొనసాగింది. స్థానిక పెద్ద చెరువులో సుమారు 20 విగ్రహాలను ఉదయమే నిమజ్జనం చేశారు.
డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, పట్టణ సీఐ రవీందర్ ఏర్పాట్లను పరిశీలించారు. తాండూర్ మండల కేంద్రంలోని ఐబీ.. భక్తజనంతో కిక్కిరిసిపోయింది. శోభాయాత్రలో అన్ని వినాయక మండళ్లవారు ప్రసాదాలు అందించారు. తాండూర్ సీఐ కే కుమారస్వామి ఆధ్వర్యంలో తాండూర్, మాదారం ఎస్ఐలు డీ కిరణ్‌కుమార్, సౌమ్య, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మండపాల వద్ద కళశాలు, లడ్డూలు, బంగారు లక్ష్మి ప్రతిమలకు నిర్వాహకులు వేలం వేశారు. నస్పూర్ మున్సిపాలిటీ పరిదిలోని శ్రీరాంపూర్‌కాలనీ, సింగాపూర్, తాళ్లపల్లిలో, భగత్‌సింగ్‌నగర్, ఆర్కే-8 కాలనీ, ఆర్కే-6 గుడిసెలు, కొత్తరోడ్, ఆర్కే-6కాలనీ, కృష్ణకాలనీ, అరుణక్కనగర్‌లో శోభాయాత్ర నిర్వహించారు. శ్రీరాంపూర్ కాలనీలో టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు. స్థానిక గోదావరిలో నిమజ్జనం చేశారు. సీఐ మోహన్, ఎస్ఐ సంతోష్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
కౌటాల మండల కేంద్రంలోని సదాశివపేట శివాలయంలో గల వినాయకుడికి ప్రధాన అర్చకుడు అంబేద శంకరయ్య, సంతోష్ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళవాయిద్యాలతో ఊరేగింపు ప్రారంభించారు. పట్టు పరిశ్రమ సమీపంలోని చెరువులో నిమజ్జనం చేశారు. వినాయక కమిటీల ఆధ్వర్యంలో లక్కీ డ్రాలు, లడ్డూల వేలం నిర్వహించారు. ఎస్ఐ మధూకర్ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీసీ నస్పూర్‌లో మండపాల సభ్యులు ఆయా వాడల్లో ఇంటింటికీ ప్రసాదం పంపిణీ చేశారు. సీఐ ఆకుల అశోక్ ఆధ్వర్యంలో సీసీసీ నస్పూర్ ఎస్ఐ సుగుణాకర్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మందమర్రి పట్టణంలోని వార్డులు, కాలనీల్ల్లో వినాయక శోభాయాత్ర వైభవంగా సాగింది. మహిళలు మంగళహారతులతో గణనాథుడికి వీడ్కోలు పలికారు.
పాత బస్టాండ్ చౌరస్తాలో హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు వాహనాలకు స్వాగతం పలికారు. కాసిపేట మండలంలో నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. ముత్యంపల్లి శ్రీ శివ సాయి గణేశ్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంలో వేల్పుల పోశం.. రూ.1,15,116కు లడ్డూ, కళశంను పుట్ట కుమార్ శేఖర్ రూ.55,016కు దకించుకున్నారు. లక్షెట్టిపేటలో పట్టణ సీఐ అల్లం నరేందర్, ఎస్ఐ సతీశ్ పోలీసు బృందంతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపల్ సిబ్బంది, పోలీసులు సమన్వయంతో గోదావరి వద్ద ఏర్పాట్లు చేశారు. కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపంలో లడ్డూను పట్టణానికి చెందిన ఫర్టిలైజర్ వ్యాపారి నరేందుల చంద్రశేఖర్ రూ.70,116కు దక్కించుకునానరు.
జైపూర్ మండలం పారుపల్లి, జనగామ, బబ్బెరచెలుక, దేవులవాడ, సర్వాయిపేట, నక్కలపల్లి, పంగిడిసోమారం గ్రామాల్లో వినాయకులను ప్రాణహిత, గోదావరిలో నిమజ్జనం చేశారు. జైపూర్ మండలకేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో భజనలు, మహిళల కోలాటాలతో శోభాయాత్ర నిర్వహించారు. ఎస్టీపీపీలో జీఎం రాజశేఖర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిమజ్ఞనానికి తరలించారు. ఇందారం గోదావరి వద్ద నస్పూర్, శ్రీరాంపూర్‌తో పాటు, జైపూర్ మండలంలోని వివిధ గ్రామాల వినాయకులను నిమజ్జనం చేశారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ సీఐ మోహన్, ఎస్ఐ శ్రీధర్ బందోబస్తు చర్యలు చేపట్టారు.
ఆసిఫాబాద్ టౌన్, సెప్టెంబర్ 16 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వాడ, బాపునగర్‌లో నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. శోభాయాత్ర సందర్భంగా మహిళలు ప్రత్యేక దుస్తులతో వచ్చి చేసిన కోలాటం ఎంతగానో ఆకట్టుకున్నది. సిర్పూర్(టీ) మండలం డౌనల్ ఏరియాలోని భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతిని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు పూజలు చేశారు. హాజీపూర్, రెబ్బెన, బెజ్జూర్, దహెగాం, చింతలమానేపల్లి, కన్నేపల్లి, భీమిని, జన్నారం, కెరమెరి, భీమారం, వేమనపల్లి మండలాల్లో నిమజ్జనోత్సవాలు ఘనంగా నిర్వహించారు.