ఆదిలాబాద్, నవంబర్ 21(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్‌కు ఓటేస్తే ఏమైతది.. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు పోయి మూడు గంటల విద్యుత్ వస్తది. ఈ మూడు గంటల కరెంటుతో ఒక్క మడి కూడా పారదు. ఫలితంగా పంటలు ఎండి, భూములు నెర్రలువారి దిగుబడులు తగ్గుతయ్. పెట్టిన పెట్టుబడి కూడా రాక రైతులు కాడి వదిలేసే పరిస్థితులు వస్తాయి. మన వద్ద సాధారణంగా 3,5 హెచ్‌పీ మోటర్ వాడుతం. కాంగ్రెసోళ్లు 10 హెచ్‌పీ వాడాలని చెబుతున్నరు. ఈ పెద్ద మోటర్ కొనాలంటే మోటర్, పంపు సెట్లు, పైపులు, వైర్లు, స్టార్టర్లు, మెకానిక్‌లు, కూలీలకు కలిపి రూ.ఒక లక్షకుపైగా డబ్బులు అవుతాయి. ఈ డబ్బులు ఎవరిస్తరు. కాంగ్రెసోళ్లు చెప్పడం తప్పా ఇవ్వరు. మరీ రైతన్నలే భరించాలి. వీటిని కొనాలంటే అప్పులు చేయాలి. లేకపోతే భూములు అమ్ముకోవాలి. పాత మోటర్లను తుక్కు కిందికే అమ్మాలి. ఇంకా.. పంట నష్టం వస్తది. పెద్ద మోటర్లతో అదనపు భారం పడి తడిసి మోపెడు అవుతది. దీనికితోడు ట్రాన్స్ఫార్మర్ల మీద లోడు పడి కాలిపోయే దుస్థితి ఉంది. వీటన్నింటికంటే కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వకుంటే సరిపోతుందని రైతన్నలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు సరఫరా చేస్తుండడంతో రైతులు రెండు పంటలు వేస్తున్నారు. అవసరాన్ని బట్టి 3, 5 హెచ్‌పీ మోటర్లను వినియోగిస్తున్నారు. యాసంగి, వానకాలంలో పంటలు వేస్తూ ఆనందంగా జీవిస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో పరిస్థితి ఇలా ఉంటే.. కాంగ్రేస్ నేతలు మాత్రం వ్యవసాయానికి మూడు గంటల కరెంటు సరిపోతుందంటున్నారు. 10హెచ్‌పీ మోటర్లు పెట్టుకుంటే మూడు గంటల్లో మూడెకరాలు పారుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మరోవైపు 10హెచ్‌పీ మోటర్లు పెట్టాల్సి వస్తే భూములన్నీ బీళ్లుగా మారడం ఖాయమని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం రైతులు తమ బోరు బావులకు వినియోగిస్తున్న 5 హెచ్‌పీ మోటర్లకు బదులుగా 10 హెచ్‌పీ మోటర్లను వాడితే రైతులపై రెట్టింపు భారం పడనున్నది. రైతులు 5 హెచ్‌పీ మోటర్లను కొనుగోలు చేయాలంటేనే అనేక ఇబ్బందులు పడతారు. అలాంటిది ఏకంగా 10 హెచ్‌పీ మోటర్లను కొనుగోలు చేయాలంటే రూ.80 వేల నుంచి రూ. ఒక లక్ష వరకు అదనపు భారం పడనుంది. ఈ క్రమంలో లోడ్‌ను నియంత్రించేందుకు ఎక్కడికక్కడ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని కూడా పెంచాల్సి ఉంటుంది. ఇప్పుడున్న వాటితో సామర్థ్యంతో 10 హెచ్‌పీ మోటర్లను నడిపిస్తే అవి కాలిపోయే పరిస్థితి నెలకొంటుంది. దీంతో రైతులు మళ్లీ పాత రోజు ల మాదిరిగా కాలిపోయిన మోటర్లను బాగు చేయించేందుకు మోటర్ వైండిం గ్ దుకాణాలకు పరుగులు పెట్టాల్సి వస్తుంది. కాంగ్రెస్‌కు ఓటేస్తే పంటలకు నీరందక, మోటర్లను బాగు చేయించలేక బతుకులు ఆగమయ్యే పరిస్థితులు పునరావృతం అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
10 హెచ్‌పీ మోటర్లతో అడుగంటనున్న భూగర్భ జలాలు
నిర్మల్ జిల్లా పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఇక్కడి రైతులు బోరుబావుల కింద రెండు సీజన్లతో వరి పంట వేస్తుంటారు. నీటి నిల్వలను బట్టి 3, 5 హెచ్‌పీ మోటర్లను వినియోగిస్తారు. రేవంత్‌రెడ్డి చెప్పినట్లు 10 హెచ్‌పీ మోటర్లు వినియోగిస్తే బోర్లలోని నీటి నిల్వలు తగ్గిపోయి, భూగర్భ జలాలు అడుగంటి పోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బోర్లకు 5 హెచ్‌పీ మోటర్లే సరిపోతాయని అధికారులు చెబుతున్నారు. కాంగ్రెస్ హ యాంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థి తి ఉండేది. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్‌కు అవకాశమిస్తే కరెంటు కష్టాలతోపాటు రైతు ఆత్మహత్యలు తప్పవని జిల్లా రైతాంగం పేర్కొంటున్నది. వ్యవసాయంపై ఎలాంటి అవగాహన లేకుండా 3గంటల కరెంటు చాలు, 10 హెచ్‌పీ మోటా ర్లు పెట్టుకోవాలని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జిల్లా రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఇప్పుడు రెండు పంటలకు సరఫరా అవుతున్న నీరు.. రేపు 10 హెచ్‌పీ మోటర్లు పెడితే ఒక్క పంటకు కూడా సరిపోదని పేర్కొంటున్నారు. బోర్లలోని నీటిని రెండు రోజుల్లో తోడేస్తే ఆరు నెలల దాకా పంటలను ఎలా కాపాడుకునేదని ప్రశ్నిస్తున్నారు. రేవంత్‌రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడి రైతుల జీవితాలతో ఆడుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరంతరాయంగా ఉచిత కరెంట్ ఇచ్చి బీడు భూములను సాగులోకి తెచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వానికే తమ మద్దతు ఉంటుందని రైతులు స్పష్టం చేస్తున్నారు.
రెండు పంటలు సాగు చేస్తున్నం..
ఆదిలాబాద్, నవంబర్ 21(నమస్తే తెలంగాణ): నాకు గ్రామంలో ఐదెకరాల భూమి ఉంది. గతంలో పంటలు వేద్దామంటే కరంటు సక్కగా ఉండేది కాదు. వానలు పడితే పంట దిగుబడులు మంచిగ వచ్చేటియి. లేదంటే పెట్టుబడులు కూడా రాకపోయేది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్నరు. ఇగ గప్పటి నుంచే రెండు పంటలు సాగు చేస్తున్నం. వానకాలంలో పత్తి, సోయాబీన్, కంది, యాసంగిలో శనగ, పల్లి పంటలు వేస్తున్నం. కరంట్ ఉండడంతో నీళ్లు పుష్కలంగా ఇస్తున్నం. దీంతో నీళ్లు దిగుబడులు కూడా మస్తుగ అస్తున్నయ్. ఇదంతా సీఎం కేసీఆర్ అచ్చినంకనే మాకు మంచి జరుగుతున్నది.
-నాగోరావు, రైతు, అంకోలి
రైతులను మోసం చేస్తరు..
కాంగ్రెసోళ్ల్లు రైతులను మోసం చేసే ప్రయ త్నం చేస్తున్నరు. ఏవేవో హామీలు చెప్పి ఓట్లడుగుతున్నరు. వాళ్లు గతంలో చేసిందేమిటో అందరికీ తెలుసు. ఇయ్యాల ఏదో చేస్తమని అంటే ఎవ్వలూ ఆ పార్టీని పట్టించుకుంటలేరు. ఇగ మూడు గంటల కరెంటు చాలని ఆ పార్టీ లీడర్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నడు. నాకు ఆరెకరా ల భూమి ఉన్నది. అందులో మూడెకరాల్లో పత్తి, 3 ఎకరాలు సోయా వేసిన. గిప్పుడు సోయా చేతికి వచ్చింది. ఇగ శనగ వేస్తున్న. పొలా లకు 10 హెచ్‌పీల మోటర్లు పెట్టి నీళ్లు ఇయ్యాల్నని ఆ పెద్దమనిషి అంటున్న డు. గివ్వి కొంటే లోడ్ పెరిగి మోటర్లతో పాటు ట్రాన్స్ఫార్మర్లు కాలిపో తాయి. 24 గంటల కరెంట్ ఉండనేవట్టే. గిప్పుడు 5 హెచ్‌పీ మోటర్లు మస్తు సరిపోతాయ్. రైతులను ఆగం చేసే ప్రయత్నం కాంగ్రెసోళ్లు చేస్తున్నరు.
– తలకొక్కుల రామన్న, రైతు, కాప్రి , జైనథ్ మండలం
మొదటి మడి కూడా తడిసింది లేదు..
సొనాల,నవంబర్21: కాంగ్రెస్ పాలనలో నీళ్లు లేక మొదటి మడి కూడా పారేది కాదు. కరెంటు ఎప్పుడొస్తదో.. ఎప్పుడు పోతదో తెల్వక పోయేది. నీళ్లు పెట్టేందుకు బాయి కాడికి రాత్రి పూట లైటు పట్టుకుని పోయేది. లైటు ఎప్పుడు వెలుగుతదోనని నిద్రపోకుండా కావలి కాసేది. ఎప్పుడో అర్ధరాత్రి కరెంటు వస్తే, స్విచ్చ్ వేస్తే మొదటి మడి కూడా పారకపోయేది. తెలంగాణ అచ్చినంకనే కేసీఆర్ దయతోనే 24 గంటల ఉచిత కరంటు వస్తున్నది. వ్యవసాయం మంచిగైంది. అందరూ ఎవుసం పనులకే వస్తున్నరు. ఎప్పుడు మోటరు పెట్టుకోవాలని అనిపిస్తే అప్పుడు బాయి కాడికి పోయి పెట్టుకుంటున్నం. ఇగ గిప్పుడు కాంగ్రెస్‌కు ఓటేస్తే కరెంటు ఇచ్చేది తెల్వదు, సచ్చేది తెల్వదు. మళ్లా కష్టాలు కొని తెచ్చుకునుడే అయితది. గందుకే ఓటేసేముందు అందరూ ఆలోచించాలె. -చెట్లపెల్లి శ్రీకాంత్, యువ రైతు, సొనాల.
3 గంటలకే నీళ్లందుతయా..
మా కుటుంబానికి అంకోలి శివారులో ఐదెకరాల భూమి ఉన్నది. మేము గతంలో కరెంటు కష్టాలతోటి, బిల్లులతోటి ఒకటే పంట తీస్తుంటిమి. గిప్పుడు సీఎం కేసీఆర్ సారు రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్నరు, ఇగ రెండు పంటలు తీస్తున్నం. కాంగ్రెస్ లీడరు రేవంత్‌రెడ్డి అన్నట్లు రైతులకు 3 గంటల కరెంటు ఎట్ల చాలుతది. మూడు గంటల్ల ఐదెకరాలకు నీళ్లెట్ల పారుతయ్. గిప్పుడు 24 గంటల పాటు ఉచిత కరంటు ఇస్తున్నా, కూడా రైతులు పంటలకు కావాల్సినంతే వాడుకుంటరు.. ఇక 10 హెచ్‌పీ మోటార్లు అనేటివి నేను వినుడే కానీ ఇప్పటికైతే చూసింది లేదు. మా మండలంల అసుంటి మోటర్లు లేవు. అవ్వీటి అవసరం లేదు కూడా. అందుకు కాంగ్రెస్ చెప్తున్న మాటలల్ల అసలు పసనే లేదని అర్థం అవుతున్నది. రైతులు ఎప్పటికీ దళారి దగ్గరికి పోకుండా సంతోషంగా పంటలు తీస్తూ అన్నదాతగా ఉండాలంటే బీఆర్ఎస్ సర్కారే రావాల. లేకుంటే బతకు ఆగమైతది.
– గుంజుల రామన్న, రైతు ,అంకోలి ,ఆదిలాబాద్ రూరల్
మాకు 24 గంటల కరెంట్ కావాలె..
గత ప్రభుత్వాల కాలంలో నీళ్లు లేక, కరెంట్ లేక భూమి బీడుగా మారింది. బతకడమే చానా కష్టమైంది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ చెరువుల పూడికతీత పనులు చేపట్టి కట్టలను నిర్మించిన్రు. దీంతో భూ గర్భజలాలు మస్తు పెరిగినయ్. బావి తవ్వుకున్న. మోటర్ పెట్టుకొని పొలంలో పత్తి పండిస్తున్న. మంచిగ బతుకుతున్న. అంత మంచిగ ఉన్నదనుకుంటే ఈ కాంగ్రెస్ మళ్లీ మూడు గంటల కరెంట్ ఇస్తామంటున్నది. ఆ కరెంట్‌తో నా మొదటి మడి కూడా పారదు. ఇంకా 10 హెచ్‌పీ మోటర్ పెట్టుకోవాలంటున్నది. ఎట్ల పెట్టుకుంటరు.. ఎవరు కొనిస్తరు.. వాళ్లు కొనిస్తరా.. చెప్పాలి. కాంగ్రెస్‌ను నమ్మితే మళ్లీ పాత కథే అయితది. మాకు మూడు గంటల కరెంట్ వద్దు.. 24 గంటలే కావాలి.
– తోట హరీశ్, యువరైతు, సాయిలింగి, తలమడుగు మండలం
10 హెచ్‌పీ మోటర్లు కాంగ్రెస్ కొనిస్తదా..?
జైనథ్, నవంబర్ 21: పదేండ్ల కిందట పంటల సాగంటే మస్తు ఇబ్బందయ్యేది. నాకు మూడెకరాల భూమి ఉన్నది. నాడు కరెంట్ లేక ఇబ్బంది పడేది. వర్షాలు పడితే పంటలు వేసేది. సీఎం కేసీఆర్ అచ్చినంకనే పంటలు మంచిగ పండుతున్నయ్. రైతుబంధు, 24 గంటల కరెంటుతోని రైతులకు మేలైతంది. పదేళ్లుగా రైతులు లాభాసాటి వ్యవసాయం చేసుకుంటున్నం. ఇగ గిప్పుడు కాంగ్రెసోళ్లు అధికారంలోకి రావడానికి ఏదేదో చెబుతున్నరు. కాంగ్రెస్ పెద్ద లీడరయితే ఇగ మూడు గంటల కరెంటు చాలంటున్నడు. 10 హెచ్‌పీ మోటర్ పెడితే సాలంటున్నడు. ఇగ మరి ఆ మోటర్ ఆయన కొనిస్తడా.. ఆయన పార్టీ కొనస్తదో కూడా చెప్పాలె. ఎందుకంటే అంత పెద్ద మోటర్ కొనుడు రైతులతోని కాదు. ఇగ 10 హెచ్‌పీ మోటర్లు పెడితే మనకాడ ఉన్న ట్రాన్సఫార్మర్లు కూడా వాళ్లే రిపేర్లు చేయిస్తరో కూడా చెప్పాలె. కాంగ్రెసోళ్లు మాట్లాడేది చూసి మా ఊళ్లో అంతా నవ్వుకుంటున్నరు. ఇగ 24 గంటల కరెంటు ఇస్తున్న బీఆర్ఎస్ సర్కారును కాదనుకోరు. – సిడాం గణేశ్, కూర గ్రామం, జైనథ్ మండలం
ఇంకా కండ్లముందే ఉన్నయ్..
కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఏ నాడూ కంటి నిండా నిద్ర కూడా పోలేదు. కరెంట్ కోసం రాత్రంతా జాగారాం చేసేటోళ్లం. రాత్రిళ్లు పొలాల దగ్గరకు పోతే పాములు, తేళ్లు కరిచేవి. అడవి పందులు ఎంబడి పడేటియి. గతంలో కరెంట్ షాకులతో ఎందరో రైతులు చనిపోయిన్రు. గా బాధలు మళ్లీ రావద్దు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆ బాధలు తీరినయి. 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తున్నరు. ఎప్పుడంటే అప్పుడు పోయి పొలానికి నీళ్లు పెట్టుకుంటున్నం. రాత్రిపూట బాయిల కాడ పండే బాధలు పోయినయి. గిప్పుడు సాగుకు 24 గంటలు ఎందుకు.. మూడు గంటలు చాలదా అని కాంగ్రెస్ నాయకులు అంటన్నరట. ఎట్ల సరిపోతది. వాళ్లు ఎన్నడన్నా ఎవుసం చేసిన్రా…? మా రైతులను మళ్లీ నరకంల పడేస్తరా..? మేం మోసపోం. 24 గంటల కరెంటిచ్చే బీఆర్ఎస్సే మాకు కావాలె. వీళ్లకు ఓటుతోనే కరెంట్ షాక్ ప్రజలు ఇయ్యబోతున్నరు.
– దేవంతుల లింగన్న, రైతు, కజ్జర్ల, తలమడుగు మండలం
ఊళ్లలో గొడవలైతయ్..
మాది ఆదిలాబాద్ మండలం తంతోలి. మా కుటుంబానికి పన్నెండెకరాల భూమి ఉన్నది. మా తండ్రి హయాంలో నాటి సర్కారోళ్లు సౌకర్యాలు కల్పించక, సగం భూమి పడీతుగానే ఉండేది. ఇక సీఎం కేసీఆర్ శ్రద్ధతోని వ్యవసాయానికి మంచి రోజులు వచ్చినయ్. మా భూమికి వచ్చిన రైతుబంధు డబ్బులతోని సాగునీటి సౌకర్యం కల్పించికున్నం. 5 హెచ్‌పీ మోటరుతోని తడులిస్తున్నాం. ఇక ధరణితోని మాకు ఏ సమస్యా రాలేదు. నాడు చిన్న పనికైనా పట్వారీ దగ్గరికి వెళ్లి పహణీ తీసుకోవాల్సిన అవసరం ఉండేది. ఇపుడు కొత్త పాసుపుస్తకాలు, ధరణి వలన రైతుల భూములకు పూర్తి రక్షణ వచ్చింది. ఒక వేళ కాంగ్రెసోళ్లు అన్నట్లు కౌలురైతు కాలమ్ తీసుకువస్తే గ్రామాల్లో గొడవలు పెరుగతయ్. వాళ్లు చేసే పని ఏ ఒక్కటీ సక్కగ ఉండదు. మాటలు మాత్రం మస్తు చెప్పుతది. వాళ్లనే నమ్మితే ఎవుసం నడిసంద్రంలో మునిగినట్లే. ప్రతి రైతు కుటుంబం ముఖంలో చిరునవ్వు ఉన్నదంటే నిస్సందేహంగా సీఎం కేసీఆరే కారణం. రైతురాజ్యం అంటే ఏంటో ఆయనే చూపించిండు.
– టింగ్రె సాయికుమార్, రైతు