కాసిపేట, డిసెంబర్ 3 : ‘గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల సందర్శనకు వెళ్తే అడ్డుకుంటున్నారు. అవి ఏమైనా జైళ్లా అంటూ బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ రేవంత్‌రెడ్డి సర్కారుపై మండిపడ్డారు. మంగళవారం రేగులగూడ ఆశ్రమ పాఠశాల సందర్శనకు నాయకులతో కలిసి వెళ్లగా, హెచ్ఎం, సిబ్బంది లోపలికి రాకుండా తాళాలు వేయించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల గేటు ముందు ధర్నా చేశారు. నిరసన తెలిపారు. సర్కారుది సిగ్గుమాలిన చర్య అంటూ ఫైర్ అయ్యారు. నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు నిలువరించారు.
ఈ సందర్భంగా శ్రావణ్ మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గురుకులాలను ఎంతో అభివృద్ధి చేసి సకల సౌకర్యాలు కల్పించారని, కానీ రేవంత్‌రెడ్డి సర్కారులో విద్యార్థులు ఫుడ్ పాయిజన్లతో విలవిల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్బంధించిన మాత్రాన పోరాటం ఆగదని, రేవంత్ చేసే పాపాలను ప్రజలకు వివరించి చెబుతామన్నారు. రాష్ట్రంలో 48 మంది విద్యార్థులను పొట్టన బెట్టుకున్న దుర్మార్గుడు సీఎం రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు అరుణ్, మండల అధ్యక్షుడు మారం మహేందర్ యాదవ్, మాజీ సర్పంచ్ ఆడే బాదు, మాజీ ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు బోయిని తిరుపతి యాదవ్, మాజీ ఉప సర్పంచ్ సుమన్, నాయకులు వేటేల్లి నరేశ్ యాదవ్, కైలాష్, పవన్ కల్యాణ్, రోషణ్, సాయికుమార్, హర్షవర్ధన్, కార్తీక్ పాల్గొన్నారు.
గురుకుల బాట అంటే కాంగ్రెస్‌కు భయం
బెల్లంపల్లి, డిసెంబర్ 3 : గురుకుల బాట అంటేనే కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకుందని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ్ పేర్కొన్నారు. మంగళవారం బెల్లంపల్లిలోని తెలంగాణ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల/కళాశాల సందర్శనకు వెళ్లగా సిబ్బంది లోనికి వెళ్లకుండా గేట్‌కు తాళం వేయడంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోపలికి వెళ్లకుండా తాళాలు వేయించడం సిగ్గుమాలిన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అరుణ్, రోషణ్, సాయికుమార్, హర్షవర్ధన్, కార్తీక్ పాల్గొన్నారు.