కుభీర్, జూలై 13 : చెరువే ఊరికి ఆదెరువు.. చెరువులో నీళ్లుంటే గ్రామంలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటాయి. రైతులతోపాటు మత్స్యకారులు, వివిధ కులవృత్తుల వారికి ఉపాధి దొరుకుతుంది. గతంలో ఈరిజర్వాయర్లో నీటి నిలువ చాలా తక్కువ ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ చెరువుల అభివృద్ధికి మిషన్ కాకతీయ పథకం రూపొందించి చెరువులకు నిధులు సమకూర్చారు. దీంతో మండలంలోని 35 చెరువుల్లో 16 చెరువులకు మరమ్మతులు చేపట్టారు. ఇందులో కాల్వల పునర్నిర్మాణం, పూడికతీత, తుమ్మ, పిచ్చిమొక్కల తొలగింపుతో చెరువుల్లో నీటి నిలువ సామర్థ్యం రెట్టింపైంది. ముఖ్యంగా ప్రభుత్వం సహకారం అందించడంతో మత్స్యకారులకు చేతినిండా ఉపాధి దొరుకుతోంది.
గతంలో చేప పిల్లలు పెంచినా నీరు నిలువ ఉండక మత్స్యకారులు నష్టపోయేవారు. జూన్ నెలలో వర్షాలు ముఖం చాటేసినా, జూలై మొదటి వారంలో కురిసిన రెండు పెద్ద వర్షాలకే చెరువులు, కుంటలు నిండాయి. కస్రా రిజర్వాయర్ సైతం నిండుకుండలా మారి అలుగు దూకుతూ జలకళను సంతరించుకుంది. చెరువులు, కుంటలు, సిల్ట్ అరెస్టింగ్ ట్యాంకులు ఉన్న గ్రామాల చుట్టుప్రక్కల ప్రాంతాల్లో బోర్లు తవ్వుకునే రైతులకు 150 నుంచి 200 అడుగుల లోతులోనే భూగర్భజలాలు ఉంటున్నాయని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. మండలంలో సుమారు వందకు పైగా మత్స్యకారుల కుటుంబాలకు ఉపాధి లభిస్తోంది. బోరుబావుల్లోనూ భూగర్భ జలాలు పెరగడంతో రెండు పంటలు పండిస్తూ రైతులు ఆర్థికంగా ముందుకు సాగుతున్నారు.
మృత్స్య కారులకు ఉపాధి
ప్రభుత్వ ప్రోత్సాహంతో మండలంలోని చెరువులకు ప్రభుత్వం మరమ్మతులు చేసింది. దీంతో పల్సి, డోడర్న, చాత, పార్డి(కే), పార్డి(బీ)పాంగ్ర చెరువుల్లో ప్రభుత్వం చేప పిల్లలను వదులుతూ ప్రోత్సహిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మత్స్యకారులకు ఉపాధి దొరుకుతుంది. జూలై నెలలోనే పిల్లల్ని వదిలితే ఇంకా చాలా బాగుంటది. అక్టోబర్-నవంబర్ నెలలో చేప పిల్లలు వదలడం వల్ల నష్టం వాటిల్లతోంది.
-తోకల శివాజీ, మత్స్యకారుల సంఘం మండలాధ్యక్షుడు, కుభీర్