మంచిర్యాల, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నస్పూర్ మున్సిపాలిటీలో ఐదంతస్తుల భవనాన్ని గురువారం మున్సిపల్ అధికారులు నేలమట్టం చేశారు. కలెక్టరేట్‌కు వెళ్లే మార్గంలో సర్వేనంబర్ 42లోని ప్ర భుత్వ భూమిని ఆక్రమించి ఇంటి నిర్మాణం చేశారని, పలుమార్లు నోటీసులిచ్చినా పట్టించుకోలేదని, అందుకే కూల్చివేశామంటూ అధికారులు చెబుతున్నారు. గురువారం ఉదయం 6 గంటలకే జేసీబీలతో మున్సిపల్, పోలీసు అధికారులు భవనం దగ్గరికి చేరుకున్నారు. మొదట ఐదో ఫ్లోర్లో నివాసముంటున్న ఆ ఇంటి యాజమాని డీకొండ అన్నయ్య భార్య విజయ, కుమారుడు డీకొండ నవీన్‌ను కింద కు తీసుకొని వచ్చారు.
ఎందుకు తీసుకెళ్తున్నా రో చెప్పాలని అడిగినా వినకుండా జీపులో ఎ క్కించుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఉద యం 5 గంటలకు వాకింగ్ వెళ్లిన అన్నయ్య ఇంటికి చేరుకోగానే అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మున్సిపల్ సిబ్బంది పై ఫ్లోర్లో ఉన్న ఇంటి సామగ్రిని కిందకు దిం పారు. ఆపై కూల్చివేత మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే అన్నయ్య ఇద్దరు కూతుళ్లు వచ్చా రు. ఇంటిని కూల్చవద్దని అధికారులతో గొడవకు దిగారు. ఇల్లు కూల్చితే ఇక్కడే చచ్చిపోతామంటూ బెదిరించడంతో పోలీసులు వారి ని అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 6 గంటలకు మొదలైన కూల్చివేత ప్రక్రియ మధ్యాహ్నం మూడు గంటల వరకు కొనసాగింది.
2019లో సింగరేణి కార్మిక సంఘం నాయకుడు డీకొండ అన్నయ్య నస్పూర్ సర్వేనంబర్ 40/2లో 350 గజాల భూమిని పొనగోటి ప్రేమలత-గోపాల్‌రావు వద్ద కొనుగోలు చేశారు. ఇంటి నిర్మాణ కోసం మున్సిపల్ కా ర్యాలయంలో దరఖాస్తు చేశారు. అనుమతు లు రావడంతో ఆయన ఇంటి నిర్మాణాన్ని మొ దలుపెట్టారు. ఈయన పర్మిషన్ తీసుకున్న స ర్వే నంబర్ 40లో కాకుండా 42లో నిర్మాణం చేపట్టారని అధికారులు పేర్కొంటున్నారు. ఇ ది ఇల్లీగల్ అని, గతంలో అనేకసార్లు నోటీసు లు ఇచ్చామని, పట్టించుకోకపోవడంతో నిర్మాణాన్ని కూల్చివేస్తున్నామని అధికారులు అం టున్నారు.
మరోవైపు బాధిత కుటంబ సభ్యు లు, బంధువులు మాత్రం ఇంటి నిర్మాణానికి అధికారులే పర్మిషన్ ఇచ్చారంటున్నారు. కట్టేటప్పుడు అడ్డుకోకుండా ఇప్పుడు కోట్లాది రూ పాయల భవనాన్ని కూల్చడం ఏమిటని ఏంట ని ప్రశ్నిస్తున్నారు. కూల్చివేతలకు సంబంధించిన నోటీసులు చూపించాలని అడిగినా అధికారులు స్పందించడం లేదంటూ మండిపడ్డా రు. పర్మిషన్లు ఇచ్చేప్పుడు అది సర్వే నంబర్ 42నా.. లేక సర్వేనంబర్ 40లో ఉందా అనే విషయం మున్సిపల్ అధికారులకు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు.
కూల్చివేత జరుగుతున్న సమయంలో అక్కడికి వచ్చిన డీకొండ అన్నయ్య కూతుళ్లు, బంధువులు ఈ విషయాన్ని మీడియాతో చెప్పుకుంటూ బోరున విలపించారు. కాగా, కూల్చివేతల సమయంలో విధులకు ఆటంకం కలిగించారంటూ మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు డీకొండ అన్నయ్య, ఆయన భార్య, కుమారుడు, ఇద్దరు కూతుళ్లు సహా బంధువులైన మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
ఈ భవనం మంచిర్యాల కలెక్టర్ కార్యాల యం దారిలో ఉండడం.. సమీపంలోనే జాతీ య రహదారి ఉండడంతో జనం పెద్ద ఎత్తున గుమిగూడి తిలకించారు. మరోవైపు ఈ విష యం తెలుసుకున్న మంచిర్యాల, శ్రీరాంపూ ర్, సీసీసీ ప్రాంత ప్రజలు ఘటనా స్థలానికి పెద్ద సంఖ్యతో తరలివచ్చారు. హైడ్రా తరహాలో కూల్చివేత పర్వం కొనసాగడంతో అం దరూ ఆసక్తిగా చూశారు. దీంతో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఇది హాట్ టాపిక్‌గా మారిం ది. సర్వే నంబర్ 42లో అనుమతులు లేకుం డా ఇండ్లు నిర్మించుకున్న అక్రమదారుల్లో అలజడి మొదలైంది. ఇంత పెద్ద భవనాన్నే కూల్చివేశారంటే ఇంకెన్ని కూల్చివేతలు ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు.
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు కనుసన్నల్లోనే కూ ల్చివేత జరిగిందంటూ అక్కడికి వచ్చిన జనం చర్చించుకోవడం కనిపించింది. బీఆర్ఎస్ నే తల ఇళ్లనే టార్గెట్‌గా చేసి కూల్చివేతలు ఉంటాయంటున్నారు. మరోవైపు జనం పెద్ద సంఖ్య లో తరలిరావడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు సీఐలు ఆకుల అశోక్, మోహన్, నరేశ్‌తో పాటు ఐదుగురు ఎస్ఐలు సుగుణాకర్, సంతోష్, రాములు, సురేష్, ప్రసన్నతో పాటు పోలీస్ బలగాలను మోహరించి బందోబస్తు నిర్వహించారు.
సర్వే నంబర్ 42లోని ప్రభుత్వ భూమిలో డీకొండ అన్నయ్య అక్రమంగా ఇల్లు నిర్మించడంతోనే కూల్చివేశామని నస్పూర్ తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ చిట్యాల సతీష్ తెలిపారు. డీకొండ అన్నయ్యకు సర్వేనంబర్ 40లో 350 గజాల భూమి ఉందని, దీనిపై మున్సిపాలిటీలో ఇంటి అనుమతుల కో సం దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఇల్లు మాత్రం సర్వేనంబర్ 42 ప్రభుత్వ భూమిలో నిర్మించారని తెలిపారు. స్థలం ఒకచోట ఉంటే.. మరోచోట ఇల్లు కట్టడంతో నిర్ధారణ కోసం తహసీల్దార్‌కు పంపించామన్నారు.
రెండు సార్లు సర్వేచేసి ప్రభుత్వ భూమిలో భవనం నిర్మించినట్లు నిర్ధారించుకున్నాకే చర్యలకు ఉపక్రమించినట్లు చెప్పారు. మున్సిపాలిటీలో ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు చేపడితే చర్యలు తప్పవన్నారు. అక్రమంగా ఇంటినిర్మాణం చేపట్టారని 2022 నుంచి అన్నయ్యకు నోటీసులు జారీ చేయడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. సర్వే నంబర్ 42 పరిధిలో మరో 60 నిర్మాణాలకు సంబంధించి నోటీసులు ఇచ్చామని, వారి నుంచి సరైన సమాధానం రాకపోతే కచ్చితంగా కూల్చివేతలు ఉంటాయని స్పష్టం చేశారు.