ఎదులాపురం, మే 10 : భారత ఆర్మీ దళానికి అండగా నిలుస్తూ.. వారి ధైర్య, సాహసాలను చేకూరుస్తూ ప్రతి భారతీయుడు అండగా నిలవాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి భారత్-పాకిస్తాన్ యుద్ధ అంశాలపై చర్చించారు. భారత్ ఆర్మీ సేవలను కొనియాడారు. ఈనెల 12వ తేదీ(సోమవారం)న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి భారత ఆర్మీ అమరులకు నివాళులు అర్పిస్తూ ర్యాలీ నిర్వహిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒకరూ పాల్గొని జాతీయ భావాన్ని చాటి చెప్పేలా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ప్రధాన వీధుల గుండా ర్యాలీ ఉంటుందన్నారు. కుమ్రం భీం చౌరస్తా, తెలంగాణ తల్లి చౌక్, వినాయక చౌక్ మీదుగా అమరులకు నివాళులు అర్పించి అశోక్ రోడ్, గాంధీచౌక్, అంబేదర్ చౌక్‌లో మానవహారం చేపట్టి నివాళులు అర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇజ్జగిరి నారాయణ, పట్టణ అధ్యక్షుడు అజయ్, యునీస్ అక్బాని, సాజిదుద్దీన్, మెట్టు ప్రహ్లాద్, లింగారెడ్డి, మారిశెట్టి గోవర్ధన్ పాల్గొన్నారు.