ఉట్నూర్ రూరల్ : రైతులు సాంప్రదాయ విధానాలు వీడి ఆధునిక పద్ధతుల ( Modern methods ) ద్వారా వ్యవసాయం చేస్తే అధిక దిగుబడులతో పాటు లాభాలు వస్తాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు సూచించారు. మండలంలోని షాంపూర్ గ్రామంలో సోమవారం వ్యవసాయ శాఖ ( Agriculture) ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయంలో తక్కువ యూరియా వాడకం, అవసరం మేరకు రసాయన మందులను వినియోగించడం, ఎరువులు, పురుగు మందులు , గడ్డి మందుల రసీదులను భద్రపరచడం, సాగునీటి ఆదా చేయడం, పంట మార్పిడి పద్ధతి, చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడడం వంటి ఆరు అంశాల గురించి వివరించారు. జిల్లాలో సాగుచేసే ముఖ్యమైన పంట పత్తిలో అధిక సాంద్రత పద్ధతిలో సాగుపై చర్చించారు.
మండల వ్యవసాయ అధికారి రమేష్ మాట్లాడుతూ వ్యవసాయంలో సాంకేతిక పద్ధతులు , ప్రభుత్వo అందిస్తున్న సహాయ సహకారాలను వివరించారు. ఉద్యాన అధికారి క్రాంతి కుమార్ ,మండల పశువైద్యాధికారి డాక్టర్ విజయ్ కుమార్, సెంటర్ ఫర్ పీపుల్స్ ఫారెస్ట్రి ఎన్జీవో ప్రతినిధి కె సత్యనారాయణ , వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం సురేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్ , టీచింగ్ అసోసియేట్స్ డాక్టర్ ఎస్ కిరణ్ రెడ్డి, డాక్టర్ కె మౌనిక, ఆయా శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.