మంచిర్యాల, అక్టోబర్ 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అనుకున్నదే అయ్యింది.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే విధించింది. ఈ జీవో అమలును నిలిపివేయాలంటూ ఆదేశించింది. జీవో 9ను అనుసరించి ఖరారు చేసిన రిజర్వేషన్ల ఆధారంగా విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్పైనా కోర్టు స్టే విధించింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు బ్రేకులు పడ్డాయి.
తదుపరి విచారణను ఆరు వారాలపాటు కోర్టు వాయిదా వేసింది. అప్పటి వరకు లోకల్ బాడీ ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడం లేదు. హైకోర్టు తీర్పును శిరసా వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో ఎన్నికల వాయిదా ఖాయమైంది. ఎన్నికల విషయం పక్కన పెడితే.. హడావుడిగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం, దానికి గవర్నర్ ఆమోదం తెలపకుండానే జీవో 9 విడుదల చేయడం, ఈ మేరకు రిజర్వేషన్లను ఖరారు చేసి వెంటనే ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడం..
ఇదంతా బీసీలను బురిడీ కొట్టించేందుకే చేశారంటూ బీసీ సంఘాలు, నాయకులు మండిపడుతున్నారు. అసెంబ్లీలో చేసిన తీర్మానం మేరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకుండా రిజర్వేషన్లు ఖరారు చేసి, ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారని, అనంతరం అధికార పార్టీ నాయకులే కోర్టుకు వెళ్లి దాన్ని అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే కుట్రలో భాగంగానే పథకం ప్రకారం ఈ కుట్ర చేశారంటూ బీసీ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
అనవసర ప్రయాస.. ఆశావహుల అసహనం
బీసీ రిజర్వేషన్లపై సర్కారు జారీ చేసిన జీవో 9తో రాష్ట్రవ్యాప్తంగా అధికార యంత్రంగా కదిలింది. జీవో విడుదలైన మరుసటి రోజే జిల్లాల్లో కొత్త జీవోను అనుసరించి ఖరారు చేసిన రిజర్వేషన్ల ఆధారంగా రాజకీయ పార్టీల సమావేశంతో డ్రా నిర్వహించింది. ఈ ప్రక్రియ జరుగుతుండగానే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నగారా మోగించింది. నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు ఆశావహులు కొందరు గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. మరికొందరు త్వరలో నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల నిర్వహణపై అధికారులకు శిక్షణ ఇచ్చారు.
అన్ని జిల్లాల్లో కలెక్టర్లు మొదలు, ఎస్పీలు, డీసీపీలు, ఎంపీడీవోలు, ఎంఆర్వోలు అంతా నామినేషన్ల దాఖలు, స్ట్రాంగ్ రూమ్ల పరిశీలన చేశారు. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసుకున్నాక.. కోర్టు స్టే విధించింది. దీంతో అధికార యంత్రాంగం ఇన్ని రోజులు చేసిందంటూ వృథా ప్రయాసగా మారింది. కోర్టులో బ్రేక్లు పడుతాయని తెలిసినా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనులు చేయక తప్పలేదని క్షేత్రస్థాయిలో అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఎన్నికల్లో పోటీ చేద్దామని ఆశపడిన అభ్యర్థులు సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయలేదని, కాంగ్రెస్ ఉద్దేశ పూర్వకంగానే ఇలా చేసిందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. రిజర్వేషన్లపై స్టే విధించడంతో ఆశావహులు అనందపడుతున్నారు. మొన్న ఇచ్చిన రిజర్వేషన్ల ప్రకారం కాకుండా పాత పద్ధతిలో వెళ్తే తమకు అనుకూలంగా రిజర్వేషన్ రావచ్చని ఆశ పడుతున్నారు. రిజర్వేషన్లపై ఏదో ఒకటి తేల్చి ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారు.
చారిత్రాత్మకం అంటూ ప్రచారం.. బీసీ సంఘాల ఆగ్రహం..
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో చేసిన బీసీ డిక్లరేషన్ మేరకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో విడుదల చేసింది. వెంటనే దానికి తగ్గట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వ పెద్దలు ఇది ఓ చారిత్రాత్మకం అంటూ ప్రచారం మొదలుపెట్టారు. కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్లు చెప్పుకున్నారు. ఇది నాణేనికి ఒక వైపైతే మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులే 42 శాతం రిజర్వేషన్లపై కోర్టులో పిటిషన్ వేశారు.
అంటే రిజర్వేషన్లపై ఓ వైపు జీవో ఇచ్చి, మరోవైపు కోర్టులో కేసు వేయించారంటూ బీసీ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఎన్నికలు ఎదుర్కొనే దమ్ములేక బీసీలను బలి పశువులు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు ద్వంద్వ వైఖరి నాటకాలు ఈ రోజు హైకోర్టు సాక్షిగా బట్టబయలయ్యాయంటున్నారు. బీసీలకు న్యాయంగా దక్కాల్సిన రిజర్వేషన్ దక్కే వరకు పోరాటం చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని, బీసీ రిజర్వేషన్ల సాధనకు పోరాడుతామని స్పష్టం చేస్తున్నారు.
ఇది బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే..
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలను ఆశపెట్టి మోసం చేసింది. అధికార పార్టీ నాయకులే జీవోపై కోర్టుకు వెళ్లడం బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుడే. సమాజంలో 60 శాతం ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం న్యాయమైన విషయం. దాన్ని కొన్ని అగ్రవర్ణాల నాయకులు అడ్డుకోవాలని చూస్తున్నరు. బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం. బీసీలకు న్యాయమైన వాటా తేల్చి వెంటనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి.
– అర్నె సమ్మయ్య, బీఆర్ఎస్ బీసీ నాయకుడు, మంచిర్యాల జిల్లా