ఆదిలాబాద్, మార్చి 19(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న అకాలవర్షాలతో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురియడంతో జొన్న, మక్క, నువ్వు, పొగాకు, కంది పంటలు దెబ్బతిన్నాయి. తలమడుగు, బజార్హత్నూర్, జైనథ్, బోథ్, గుడిహత్నూర్ మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. పంటలు చేతికొచ్చే దశలో ఉండగా కురిసిన వర్షాలు రైతులకు నష్టాన్ని చేకూర్చాయి. వందలాది ఎకరాల్లో జొన్న పంట నేలకొరిగింది. నష్టం వివరాలను సేకరించడానికి వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, 900 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేశారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, తలమడుగు జడ్పీటీసీ గణేశ్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య వివిధ ప్రాంతాల్లో పర్యటించి పంటలను పరిశీలించారు. అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఇంద్రవెల్లి మండలం కేంద్రంలోని ఓ జిన్నింగ్ మిల్లులో రైతులు ఆరబెట్టిన మక్కలు తడిసి ముద్దయ్యాయి. తడిసిన మక్కలను రైతులు ఎత్తుకోవడానికి ఇబ్బందులు పడ్డారు. వర్షం, ఈదురుగాలుల కారణంగా పంటలను నష్టపోయామని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇచ్చోడ, సిరికొండ మండలాల్లో వడగళ్ల వాన కురిసింది. ఇండ్ల పైకప్పులు లేచిపోయాయి. తలమడుగు మండలంలోని మధనపూర్, బరంపూర్, నందిగామతోపాటు ఆయా గ్రామాల్లో కూడా వడగళ్ల వాన పడింది. బజార్హత్నూర్, జాతర్ల గ్రామాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది.