కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/కౌటాల/బెజ్జూరు/దహెగాం/చింతలమానేపల్లి/ పెంచికల్పేట్/వేమనపల్లి/కోటపల్లి, జూలై 10 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాణహిత నదితో పాటు వాగులు.. వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండగా, అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల పంట పొలాలు నీట మునిగాయి.
కుమ్రం భీం ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. అధికారులు రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 10 టీఎంసీలు కాగా, కట్టబలహీనంగా ఉండడం తో అధికారులు 5 టీఎంసీల నీటిని మాత్రమే ని ల్వ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తు తం 5.88 టీఎంసీల నీరు ఉండగా, ఇన్‌ఫ్లో 850 క్యూసెక్కులు వచ్చి చేరుతున్నది. రెండు గేట్లు 0.2 మీటర్లు ఎత్తి 880 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు కౌటాల మండలంలోని తుమ్డిహట్టి వద్ద ప్రాణహిత నది ఉగ్రరూపం దాల్చి నిండుగా ప్రవహిస్తున్నది. గురువారం సాయంత్రానికి పుష్కఘాట్ పూర్తిగా మునిగిపోయింది. మహారాష్ట్రలోని వైన్‌గంగా, వార్దా నదుల నుంచి భారీగా వరద రావడంతో ప్రాణహిత నిండుకుండను తలపిస్తున్నది. గుండాయిపేట, వీర్దండి, తాటిపల్లి గ్రామాల్లోని పంట పొలాల్లోకి బ్యాక్ వాటర్ వచ్చి వరి, పత్తి పంటలు నీట మునిగాయి. సిర్పూర్(టీ) మండలం వెంకట్రావ్పేట వద్ద వార్దా నదిలోకి భారీగా వరద రాగా, వంతెనను తాకుతూ ప్రవహిస్తున్నది. దహెగాం మండలంలోని ప్రాణహిత పరివాహక గ్రామాలైన మొట్లగూడ, రాంపూర్,దిగడ రావులపల్లి గ్రామాల్లో పత్తి,కంది తదితర పంటలు నీట మునిగినట్లు రైతులు తెలిపారు.
పెద్దవాగు, ప్రాణహిత నది పరివాహక గ్రామాల రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ విక్రమ్ అన్నారు. పెంచికల్పేట్ మండలంలోని ప్రాణహిత నది, పెద్దవాగు, బొకివాగు, ఉచ్చ మల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎస్ఐ అనిల్‌కుమార్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ప్రాణహిత నది బ్యాక్ వాటర్‌తో మొర్లిగూడ, జిల్లేడ, నందిగాం గ్రామాల్లో దాదాపు 200 ఎకరాల పత్తి నీట మునిగింది. చింతలమానేపల్లి మండలం కేతిని సమీపంలోని వాగులో కోర్సిని మడుగు వద్ద కేతిని గ్రామానికి చెందిన సెడ్మెక సుమన్ (18) గురువారం మధ్యాహ్నం గల్లంతయ్యాడు. సెడ్మెక సుమ న్ వాగు అవతల ఉన్న తమ పంట ను పశువులు తింటున్నాయని, వెళ్లి చూసివద్దా మని స్నేహితులతో కలిసి వెళ్లాడు. ఈ క్రమంలో వాగులోకి దిగారు.
సుమన్ గల్లంతు కాగా, మిగతా వారు అప్రమత్తమై వెంటనే ఒడ్డుకు చేరారు. యువకుడి ఆచూకీకోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలానికి సమీపంలోని ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తుంది. కల్లెంపల్లి, జాజులపేట, ముక్కిడిగూడెం, సుంపుటం,వేమనపల్లి, క్యాతనపల్లి, నీల్వాయి, ముల్కలపే ట, రాచర్ల గ్రామాల శివార్లలోని పత్తి పంటలు నీట మునిగాయి. ఇప్పటి వరకు 400 ఎకరాల్లో పత్తి నీట మునిగింది. గురువారం తహసీల్దార్ సంధ్యారాణి, నీల్వాయి ఎస్ఐ శ్యామ్‌పటేల్ రాచర్ల నది ఉధృతిని పరిశీలించారు. నదిలో పడవలు నడపవద్దని సూచించారు. అత్యవసరమైతే డయల్-100, 8712656557కు సమాచారం అందించాలన్నారు. కోటపల్లి మండలం వెంచపల్లి, జనగామ, ఆలుగామ, పుల్లగామ, అన్నారం, సిర్సా తదితర గ్రామాల్లో పత్తి పంట నీటిలో మునిగిపోయింది. లోతట్టు ప్రాంతాలను తహసీల్దార్ రాఘవేంద్రరావ్, ఎస్ఐ రాజేందర్, ఆర్ఐ శ్రీనివాస్ పరిశీలించారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు.. వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బెజ్జూర్ మండలం సుస్మీర్ వాగు ఉధృతంగా పారుతుండగా, సుస్మీర్, సోమిని, గెర్రెగూడ, ఇప్పలగూడ, మూగవెల్లి, బండలగూడ, నాగపల్లి, పాత సోమిని, కొత్త సోమిని, పాతగెర్రెగూడ తదితర గ్రామాలకు, చింతలమానేపల్లి మండలం దిందా-కేతిని వాగు, బాబాసాగర్- నాయకపుగూడ వాగులు నిండుగా ప్రవహిస్తుండగా, ఆయా రూట్లలోని అనేక పల్లెలకు వాహనాలు నిలిచిపోయాయి. వర్షాలకు ఆసిఫాబాద్ మండలంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ రియాజ్ అలీ సూచించారు. అడ ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేసినందున ప్రజలెవ్వరూ వాగుల వద్దకు వెళ్లవద్దని కోరారు.
ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, జూలై 10: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని పర్యాటక, సాంసృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు.. కలెక్టర్ వెంకటేశ్ ధోత్రేకు ఫోన్ చేసి చెప్పారు. ప్రాణ, ఆస్తి నష్ట జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖలను సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టామని కలెక్టర్ మంత్రికి వివరించారు.