కుభీర్ : కుభీర్(Kubheer) మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం (Heavy rain ) కురిసింది. చేతికొచ్చిన పంట తడిసిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతలు వేసి రోడ్లపై , పంట చేలల్లో ఆరబోసుకున్న సోయా( Soya) , మొక్కజొన్న ( Maize ) పంటలు తడిసి ముద్దయ్యాయి. అరగంటసేపు భారీగా కురిసిన వర్షం రైతులకు కన్నీళ్లను తెచ్చిపెట్టాయి.
ప్రభుత్వం సోయా పంట చేతికి వచ్చి సుమారు 20 రోజులు గడుస్తున్నప్పటికీ సోయా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడం వల్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ జాప్యం వల్లే ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆరోపించారు. దిగుబడులు తగ్గిపోయినప్పటికీ ఉన్న పంటలు మద్దతు ధరకు అమ్ముకోవాలన్నా కొనుగోలు కేంద్రాలను ఇప్పటికీ తెరవకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టాన్ని ఎవరు పూరిస్తారని, ప్రభుత్వం ఇంత జరుగుతున్న రైతుల పట్ల వివక్ష చూపడం బాధాకరమని ఆరోపించారు.
గత 45 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిని పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన రైతులకు ఇప్పటికీ ఎలాంటి సహాయం అందకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలో హెక్టారుకు రూ.9వేలు చొప్పున ప్రభుత్వం పంట నష్టపరిహారం అందిస్తుండగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తడిసన ధాన్యం, సోయా తో పాటు మొక్కజొన్న, పత్తి పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని మండల రైతులు డిమాండ్ చేస్తున్నారు.