ఇంద్రవెల్లి/ఉట్నూర్ రూరల్/బజార్హత్నూర్, మార్చి 24 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కురిసిన భారీ వర్షంతో తీవ్రనష్టం వాటిల్లింది. శంకర్గూడ, దుబ్బగూడ, ఇన్కర్గూడ, ధనోరా(బీ), హీరాపూర్, కేస్లాపూర్, ఏమాయికుంట, ముత్నూర్, దేవాపూర్ గ్రామాల్లో ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి.
వర్షపు నీరు ఇండ్లలోకి ప్రవేశించి నిత్యావసర సరుకులు తడిచాయి. ఈదురుగాలులతో పలుచోట్ల చెట్లు నెలకొరిగాయి. గోధుమ, జొన్న, శనగ పంటలకు నష్టం వాటిల్లింది. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కందులు విక్రయించడానికి వచ్చిన రైతులు ఇబ్బందులు పడ్డారు. ఉట్నూర్ మండలంలో మామిడి పిందెలు రాలాయి. వరి పైరు పూత రాలింది.
కోయడానికి సిద్ధంగా ఉన్న గోధుమ, ఎదిగిన జొన్న, మొక్క జొన్న పంటలు దెబ్బతిన్నాయి. బజార్హత్నూర్ మండలకేంద్రంతోపాటు దేగామ, జాతర్ల, కొలారి, గిర్నూర్, కాండ్లీ, పిప్రి గ్రామాల్లో వర్షం కురిసింది. గాలితో ఇండ్ల పైకప్పులు ఎగరి పడ్డాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గాలి దాటికి చెట్టు విద్యుత్ వైర్లపై పడడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.